Hollywood Iron Man: ఒకే ఒక్క పాత్ర.. రూ.5 వేల కోట్ల సంపాదన.. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డు సాధించిన నటుడెవరంటే
05 August 2024, 17:05 IST
- Hollywood Iron Man: ఒకే ఒక్క పాత్ర పోషించిన నటుడు.. ఏడు సినిమాలతోనే ఏకంగా రూ.5 వేల కోట్లు సంపాదించాడంటే నమ్మగలరా? ఈ హాలీవుడ్ ఐరన్ మ్యాన్ గురించి మీకు తెలుసా?
ఒకే ఒక్క పాత్ర.. రూ.5 వేల కోట్ల సంపాదన.. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డు సాధించిన నటుడెవరంటే
Hollywood Iron Man: ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా ఎన్నో మూవీస్ చేసినా.. ఓ నటుడిని లేదా నటిని ఓ పాత్ర ప్రత్యేకంగా నిలుపుతుంది. అందులోనూ మార్వెల్ సినిమాటిక్ యూనివర్సిటీ నుంచి వచ్చిన పాత్ర అయిన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. అలా ఇందులో ఐరన్ మ్యాన్ పాత్ర పోషించిన రాబర్ట్ డౌనీ జూనియర్ 11 ఏళ్లలో ఈ పాత్ర పోషించడం ద్వారానే ఏకంగా రూ.5000 వేల కోట్ల వరకూ సంపాదించడం విశేషం.
ఐరన్ మ్యాన్‌కు వేల కోట్ల ఆదాయం
రాబర్డ్ డౌనీ జూనియర్.. సుమారు ఐదు దశాబ్దాలుగా హాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక పేరు సంపాదించుకున్న నటుడు. అయితే అతని కెరీర్ అంతా ఓ ఎత్తయితే.. అతడు పోషించిన ఐరన్ మ్యాన్ పాత్ర మరో ఎత్తు. ఒక దశలో డ్రగ్స్ కు బానిసైన ఈ నటుడు.. తర్వాత మళ్లీ హాలీవుడ్ లోకి సహాయ పాత్రల ద్వారా ఎంట్రీ ఇచ్చి.. ఐరన్ మ్యాన్ పాత్ర ద్వారా ఎక్కడికో వెళ్లిన తీరు ఎందరికో ఆదర్శనీయం.
2008లో తొలిసారి వచ్చిన ఐరన్ మ్యాన్ మూవీలో టోనీ స్టార్క్ అలియాస్ ఐరన్ మ్యాన్ పాత్ర ద్వారా రాబర్ట్ డౌనీ జూనియర్ కెరీర్ మారిపోయింది. ఆ తర్వాత 11 ఏళ్ల పాటు మూడు ఐరన్ మ్యాన్ సినిమాలు, నాలుగు అవెంజర్స్ సినిమాల్లో అతడు ఇదే ఐరన్ మ్యాన్ పాత్ర పోషిస్తూ వచ్చాడు. అవెంజర్స్: ఎండ్ గేమ్ మూవీలో అతని పాత్ర ముగిసింది.
ఈ 11 ఏళ్లలో అతడు ఇదొక్క పాత్ర ద్వారానే సుమారు 500 మిలియన్ నుంచి 600 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5 వేల కోట్లు) సంపాదించినట్లు వెరైటీ మ్యాగజైన్ అంచనా వేసింది. ఒకే ఒక్క పాత్ర పోషించి 11 ఏళ్లలోనూ ఇంత భారీ మొత్తం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇప్పుడతడు అదే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో విక్టర్ వోన్ డూమ్ అనే విలన్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అవెంజర్స్ సినిమాలు అయిన డూమ్స్‌డే, ది సీక్రెట్ వార్స్ సినిమాల్లో రాబర్ట్ డౌనీ జూనియర్ విలన్ పాత్రలో పోషిస్తున్నాడు. ఈ సినిమాలు వరుసగా 2026, 2027లలో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాల కోసమే అతడు ఏకంగా 8 కోట్ల డాలర్లు (సుమారు రూ.650 కోట్లు) వసూలు చేస్తున్నట్లు కూడా వెరైటీ మ్యాగజైన్ తెలిపింది.
డ్రగ్స్, జైలు శిక్ష.. ఇప్పుడిలా..
రాబర్ట్ డౌనీ జూనియర్ కెరీర్ అంతా సవ్యంగా ఏమీ సాగలేదు. 1980ల్లో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ కు అలవాటు పడి, వాటికి బానిసైపోయి అరెస్టుల వరకూ వెళ్లాడు. 2000 వరకు అతని కెరీర్ అంతా ఒడిదుడుకులతోనే సాగింది. 2001లో అతడు పూర్తిగా దివాళా తీసి ఉన్న ఇల్లు కూడా కోల్పోయాడు.
అతనితో సినిమాలకు ఎవరూ అంగీకరించలేదు. ఆ తర్వాత మెల్లగా కొన్ని సినిమాల్లో సహాయ పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. 2008లో తొలిసారి ఎంసీయూ నుంచి వచ్చిన ఐరన్ మ్యాన్ మూవీలో అదే పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. ఇప్పుడతడు ప్రపంచంలో అత్యంత ధనికుడైన నటుల్లో ఒకడు కావడం విశేషం.