Deadpool and Wolverine Teaser Trailer: సినిమా చరిత్రలో ఎక్కువ మంది చూసిన ట్రైలర్ ఇదే.. మార్వెల్ మూవీ మరో రికార్డు-deadpool and wolverine teaser trailer marvel movie creates new record with most watched trailer in 24 hours ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Deadpool And Wolverine Teaser Trailer Marvel Movie Creates New Record With Most Watched Trailer In 24 Hours

Deadpool and Wolverine Teaser Trailer: సినిమా చరిత్రలో ఎక్కువ మంది చూసిన ట్రైలర్ ఇదే.. మార్వెల్ మూవీ మరో రికార్డు

Hari Prasad S HT Telugu
Feb 14, 2024 02:22 PM IST

Deadpool and Wolverine Trailer: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మరో సినిమా డెడ్‌పూల్ అండ్ వోల్వెరైన్ టీజర్ ట్రైలర్ రికార్డు క్రియేట్ చేసింది. రిలీజైన తొలి 24 గంటల్లోనే ఎక్కువ మంది చూసిన ట్రైలర్ ఇదే కావడం విశేషం.

మార్వెల్ మూవీ డెడ్‌పూల్ అండ్ వోల్వొరైన్ ట్రైలర్ ఎక్కువ మంది చూసినదిగా రికార్డు
మార్వెల్ మూవీ డెడ్‌పూల్ అండ్ వోల్వొరైన్ ట్రైలర్ ఎక్కువ మంది చూసినదిగా రికార్డు

Deadpool and Wolverine Trailer: హాలీవుడ్ మూవీ, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న డెడ్‌పూల్ అండ్ వోల్వెరైన్ మూవీ టీజర్ ట్రైలర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆదివారం (ఫిబ్రవరి 11) సూపర్ బౌల్ సందర్భంగా రిలీజైన ఈ ట్రైలర్ తొలి 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన ట్రైలర్ గా నిలవడం విశేషం. ఈ ట్రైలర్ కు తొలి 24 గంటల్లోనే 36.5 కోట్ల వ్యూస్ రావడం గమనార్హం.

డెడ్‌పూల్ రికార్డు

డెడ్‌పూల్ అండ్ వోల్వెరైన్ మూవీ ట్రైలర్ మరో మార్వెల్ మూవీ స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ మూవీ ట్రైలర్ రికార్డును బ్రేక్ చేసింది. 2021లో రిలీజైన ఈ మూవీ ట్రైలర్ తొలి 24 గంటల్లో 35.5 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ డెడ్‌పూల్ 3 ఆ రికార్డును సులువుగా బ్రేక్ చేసేసింది. నిజానికి ఈ ట్రైలర్ కు ఈ ఏడాది సూపర్ బౌల్ కూడా సాయం చేసిందని చెప్పొచ్చు.

ఈసారి సూపర్ బౌల్ ఎక్కువ మంది చూసి టెలికాస్ట్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా 12.37 కోట్ల వ్యూవర్స్ ఈ సూపర్ బౌల్ చూడటం గమనార్హం. ఈసారి ఈ గేమ్ చూడటానికి సూపర్ స్టార్ సింగర్ టేలర్ స్విఫ్ట్ వచ్చింది. తన బాయ్‌ఫ్రెండ్ ట్రావిస్ కెల్సీ ఆడుతున్న కన్సాస్ సిటీ ఛీఫ్స్ జట్టుకు సపోర్ట్ చేయడానికి ఆమె వచ్చింది. చివరికి ఆ టీమే గెలిచింది.

సూపర్ బౌల్ సందర్భంగానే ఈ డెడ్‌పూల్ అండ్ వోల్వెరైన్ ట్రైలర్ రిలీజ్ కావడంతో తొలి 24 గంటల్లోనే దీనిని ఎగబడి చూసేశారు. ఈ మూవీ జులై 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో రియాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మాన్ నటించారు. డెడ్‌పూల్ 3 మూవీని షాన్ లెవీ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో ఎమ్మా కొరిన్, మోరెనా బాకారిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరన్ సోనీ కూడా నటించారు.

డెడ్‌పూల్ ఫ్రాంఛైజీ

మార్వెల్ కామిక్స్ లోని డెడ్‌పూల్ పాత్ర పేరుతోనే 2016లో తొలిసారి డెడ్‌పూల్ మూవీ రిలీజైంది. 58 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 782 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక 2018లో డెడ్‌పూల్ 2 మూవీ వచ్చింది. ఈ సినిమాను 110 మిలియన్ డాలర్లతో తెరకెక్కించగా.. 785 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ ఏడాది రాబోతున్న డెడ్‌పూల్ 3 మూవీకి అధికారికంగా డెడ్‌పూల్ అండ్ వోల్వెరైన్ అనే టైటిల్ పెట్టారు.

IPL_Entry_Point