తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  James Cameron And Rajamouli Chit Chat: జక్కన్న ప్రతిభకు అవతార్ దర్శకుడు ఫిదా.. హాలీవుడ్‌లో పనిచేస్తే తనతో చెప్పమని ఆఫర్

James Cameron and Rajamouli Chit Chat: జక్కన్న ప్రతిభకు అవతార్ దర్శకుడు ఫిదా.. హాలీవుడ్‌లో పనిచేస్తే తనతో చెప్పమని ఆఫర్

21 January 2023, 12:27 IST

google News
    • James Cameron and Rajamouli Chit Chat: హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్.. మన దర్శక ధీరుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమా తాను చూశానని, తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు. అంతేకాకుండా సినిమా గురించి విశ్లేషణ కూడా ఇచ్చారు.
జేమ్స్ కామెరూన్-రాజమౌళి
జేమ్స్ కామెరూన్-రాజమౌళి (rajamouli ss Twitter)

జేమ్స్ కామెరూన్-రాజమౌళి

James Cameron and Rajamouli Chit Chat: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం వరుసగా అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ సహా ప్రతిష్టాత్మక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఈ వేడుకకు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి ఆయనను కలిసి మాట్లాడారు. కాసేపు సాగిన వీరి సంభాషణ ఆసక్తికరంగా ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రెండు సార్లు చూసినట్లు జేమ్స్ కామెరూన్ తెలిపారు. వీరి సంభాషణకు సంబంధించిన పూర్తి వీడియోను ఆర్ఆర్ఆర్ బృందం ట్విటర్ వేదికగా షేర్ చేసింది.

"ఎప్పుడైనా మీరు మూవీ తీయాలనుకుంటే జేమ్స్ కామెరూన్-రాజమౌళి సంభాషణ వినండి. ఇద్దరు దిగ్గజ దర్శకులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే సుదీర్ఘ వెర్షన్ ఇక్కడ ఉంది" అంటూ వీడియోను షేర్ చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్.

ఈ వీడియోను గమనిస్తే జేమ్స్ కామెరూన్.. తాను ఆర్ఆర్ఆర్ సినిమాను చూసినట్లు తెలిపారు. ముందుగా రాజమౌళి మాట్లాడుతూ.. "సార్ నేను మీ సినిమాలన్నింటినీ చూశాను. టెర్మినేటర్, అవతార్, టైటానిక్ అన్ని చిత్రాలు చూశాను. మీరు నాకో పెద్ద స్ఫూర్తి. మీ పనితనాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నాను." అని అన్నారు.

అనంతరం జేమ్స్ కామెరూన్ స్పందిస్తూ.. "నేను ఈ సినిమాలోని పాత్రలను చూశాను. చూస్తుంటే అలాగే ఎంతసేపైనా చూడాలనిపించే ఫీలింగ్ కలిగింది. ఈ స్టోరీ చెప్పే విధానం బాగుంది. ఫైర్, వాటర్, స్టోరీతో కథలో పాత్రలను పరిచయం చేయడం ఆసక్తికరంగా ఉంది. పాత్రలు ఏం చేయాలో, ఎందుకు చేస్తున్నాయో బాగా చూపించారు. ట్విస్టులు, మలుపులు, స్నేహం అంతా బాగుంది. స్నేహితులు మధ్య వైరం వచ్చినప్పుడు చంపే అవకాశం వచ్చినా చంపకపోవడం బాగుంది. నాకు సినిమా అంతా బాగా నచ్చింది." అని జేమ్స్ కామెరూన్ అన్నారు.

కామెరూన్ మాటలకు ఉబ్బితబ్బిబ్బై పోయిన రాజమౌళి.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "మీ నుంచి ఈ మాటలు వింటుంటే నాకు అవార్డు వచ్చినదాని కంటే ఎక్కువ ఆనందంగా ఉంది. మీరు నా సినిమా చూడటమే కాకుండా చూసి విశ్లేషిస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఓ మై గాడ్ తట్టుకోలేకపోతున్నాను." అని రాజమౌళి అన్నారు. ఆయన రెండు సార్లు మీ సినిమా చూశారని పక్కనున్న కామెరూన్ భార్య రాజమౌళికి చెప్పారు. "మీరు ఎప్పుడైనా ఇక్కడ సినిమా చేయాలనుకుంటే నాతో చెప్పండి" అంటూ కామెరూన్ రాజమౌళికి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు.

దీంతో రాజమౌళి హాలీవుడ్‌లో సినిమా చేస్తే జేమ్స్ కామెరూన్‌తో కలిసి పనిచేస్తారనే ఆయన మాటలతో అర్థమవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం