Telugu News  /  Entertainment  /  Ss Rajamouli End His Speech With Mera Bharat Slogan In Critics Choice Award Ceremony
రాజమౌళి ప్రసంగం
రాజమౌళి ప్రసంగం (REUTERS)

Rajamouli Speech At CCA: అంతర్జాతీయ వేదికపై రాజమౌళి అదిరిపోయే స్పీచ్.. 'మేరా భారత్ మహాన్' అంటూ జైకొట్టిన దర్శకుడు

16 January 2023, 10:58 ISTMaragani Govardhan
16 January 2023, 10:58 IST

Rajamouli Speech At CCA: దర్శక ధీరుడు రాజమౌళి క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రదానోత్సవంలో అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. బెస్ట్ విదేశీ చిత్రంగా ఆర్ఆర్ఆర్ అవార్డు సాధించడంతో ఆ పురస్కారాన్ని తీసుకునేటప్పుడు ఆయన ప్రసంగించారు. చివర్లో మేరా భారత్ మహాన్ అంటూ ముగించారు.

Rajamouli Speech At CCA: "ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవమును" అని ప్రముఖ రాయప్రోలు సుబ్బారావు అన్న మాటలను.. మన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తూచాతప్పకుండా పాటించారు. అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకాలను నిలిపేలా చేయడమే కాకుండా మేరా భారత్ మహాన్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రఖ్యాత క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును ఆర్ఆర్ఆర్ చిత్రం గెలుచుకోవడంతో.. ఆ పురస్కారాన్ని తీసుకునేందుకు వేదికనెక్కిన మన జక్కన్న తన ధన్యవాద ప్రసంగంతో మాతృభూమి గురించి తలచుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ముందుగా అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మన రాజమౌళి.. ప్రసంగానికి నాకు 30 సెకన్లే సమయమిచ్చారా? అంటూ నిర్వాహకులలను అడగడంతో అక్కడ నవ్వులు విరిశాయి. తన జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిన మహిళలందరికీ ధన్యవాదాలు చెప్పారు మన జక్కన్న.

"నా జీవితంలో కీలక పాత్ర పోషించిన మహిళలందరికీ ధన్యవాదాలు. స్కూల్ ఎడ్యూకేషన్ కంటే కూడా కామిక్ బుక్స్, కథల పుస్తకాలను చదివించి నా క్రియేటివిటీని పెంచిన మా అమ్మ రాజనందినికి, నన్ను బెస్ట్ వెర్షన్‌గా మార్చుకోవడంలో ప్రోత్సహించిన తల్లి లాంటి మా వదిన శ్రీవల్లికి, నా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తూ అంతకంటే ఎక్కువగా నా జీవితాన్ని డిజైన్ చేసిన నా భార్య రమకు, చిన్న చిరునవ్వుతో నా జీవితం ముందకెళ్లేలా తోడ్పడే నా కూతుర్లకు ధన్యవాదాలు చెబుతున్నాను. చివరగా నా దేశం ఇండియా.. మేరా భారత్ మహాన్.. జైహింద్" అంటూ సలాం కొడుతూ రాజమౌళి తన ప్రసంగాన్ని ముగించారు.

28వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంలో ఆర్ఆర్ఆర్ మూవీ ఉత్తమ విదేశీ చిత్రంగా పురస్కారాన్ని గెల్చుకుంది. ఎస్ఎస్ రాజమౌళి ఈ వేడుకకు హాజరైన అవార్డును తీసుకున్నారు. దీంతో పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ అవార్డు నాటు నాటు పాటకు దక్కించింది. ఆ అవార్డును ఎంఎం కీరవాణి అందుకున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

టాపిక్