Jhansi Web series Review: గతాన్ని మరిచిన 'ఝాన్సీ' మెప్పించిందా? అంజలి ఆకట్టుకుందా?
27 October 2022, 17:25 IST
- Jhansi Web series Review: అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఝాన్సీ సిరీస్ గురువారం నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
ఝాన్సీ వెబ్ సిరీస్ రివ్యూ
Jhansi Web series Review: ఓటీటీల పుణ్యామాని కంటెంట్ ఉన్న సిరీస్‌లు ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలంరించాయి. కానీ ఈ వెబ్ సిరీస్‌ల విషయంలో తెలుగులో అలంరించినవి తక్కువే అని చెప్పాలి. తాజాగా ప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఝాన్సీ.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో అంజలితో పాటు చాందిని చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, రాజ్ అర్జున్, అభిరామ్ వర్మ, రామేశ్వరి తాళ్లూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌కు తిరు, గణేశ్ కార్తిక్ దర్శకత్వం వహించాచుర. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సిరీస్ ట్రైలర్ చూస్తే ఆసక్తికరంగా ఉంది. ఫలితంగా దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మరి ఈ వెబ్‌సిరీస్ ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
కథ..
ఝాన్సీ(అంజలి), సంకీత్(ఆదర్శ్ బాలకృష్ణ) ఇద్దరూ సహజీవం చేస్తుంటారు. ఆరేళ్ల క్రితం గతం మర్చిపోయిన మహిళగా ఝాన్సీ సంకీత్‌కు తారాసపడుతుంది. ఆమెకు చికిత్స ఇప్పించి.. తన వద్దే ఆసరా కల్పిస్తాడు సంకీత్. భార్యతో విడిపోయిన అతడు కూతురుతో కలిసి ఉంటాడు. ఝూన్సీ కూడా అతడి కుమార్తేను ఎంతో ప్రేమగా చూసుకుంటూ అద్భుతమైన జీవితాన్ని గడుుపుతూ ఉంటోంది. అయితే ఆమెకు గతంలో జరిగిన ఘటనలు పీడకలల రూపంలో గుర్తుకు వస్తుంటాయి. మరి ఆమె తన గతం గురించి తెలుసుకుందా? అసలు తను ఎవరు? ఏం జరిగింది? లాంటి విషయాలు తెలియాలంటే ఈ వెబ్‌సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే?
వుమెన్ ట్రాఫికింగ్, మాఫియా లాంటి క్రైం థ్రిల్లర్ సిరీస్‌లు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. ఇది వాటికి ఏమాత్రం భిన్నంగా ఉండదు. ఓటీటీల కారణంగా కంటెంట్ విభిన్నంగా ఉంటే తప్పా ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. ఝాన్సీ సిరీస్ ఆరంభంలో వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంట్రడక్షన్ సీన్‌తోనే ఆడియెన్స్‌ను కథలోకి లీనమయ్యేలా చేస్తారు దర్శకులు. అయితే ఆ ఆసక్తిని, ఉత్కంఠను చివర వరకు తీసుకెళ్లడంలో మాత్రం విఫలమయ్యారు. ఆరు ఎపిసోడ్‌లు మాత్రమే ఉన్న ఈ సిరీస్ కథనంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి రెండు ఎపిసోడ్‌లు కాస్త ఫర్వా లేదనిపించినా.. తర్వాత తేలిపోయింది. అంతేకాకుండా ఐదో ఎపిసోడ్ వరకు కూడా కొత్త పాత్రలు పరిచయం అవుతూనే ఉండటంతో ప్రేక్షకులు కాస్తంత అయోమయంలోనూ పడతారు. పోనీ చివర్లోనైనా ట్విస్టులకు ఆన్సర్ దొరుగుతుందా అంటే అదీ కూడా లేదు. మరో సీజన్ కోసం వేచి చూడాల్సిందే అంటూ ప్రశ్నార్థకంగా ముగించారు. ఫలితంగా ప్రేక్షకులు కథకు డిస్ కనెక్ట్ అవుతారు.
పైపెచ్చు ఝాన్సీ తన గతాన్ని తెలుసుకునేందుకు యత్నించే విధానాన్నైనా యంగేజింగ్‌గా, ఓ డిటెక్టివ్ సిరీస్‌లా అయినా తీశారా అంటే అదీ లేదు. కథకు సంబంధం లేని హత్యలకు జరిగితే.. వారి కోసం సూపర్ వుమన్‌గా ఝాన్సీ మారడం కథను పక్కదోవ పట్టించేలా అనిపిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్‌లో సూపర్ హీరోగా ఝాన్సీ ఎందుకు వచ్చిందో జనాలకు అర్థం కాదు. ఇందులో కాస్త చూడాల్సిందేఏమైనా ఉందంటే అంజలి యాక్షన్ సీన్లే. అయితే అవి కూడా కొన్నిసార్లు లాజిక్‌కు అందవు. హత్యను ఏదో సింపుల్‌గా చేసేయడం, పోలీసులు విచారిస్తారని కానీ, క్లూలు వదలకూడదని కానీ తెలియకపోవడం స్క్రీప్టుపై గట్టిగా వర్క్ చేయలేదని తెలుస్తోంది.
ఎవరెలా చేశారంటే..
ఝాన్సీ పాత్రలో అంజలి పర్ఫెక్టుగా సెట్ అయింది. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో తన ప్రతిభను నిరూపించింది. ఎమోషనల్ సీన్లలో ఆమె నటన కనపిస్తుంది. ఆ ఎమోషన్ ఉన్న కారణాన్ని దర్శకుడు బలంగా చెప్పడంలో విఫలమయ్యాడు. అయితే ఇందులో కొత్తగా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది అంజలి. ఆదర్శ్ బాలకృష్ణ తన పాత్ర పరిధి మేర మెప్పించాడు. చాందిని చౌదరీ పాత్ర గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలా అనిపిస్తుంది. ఆమె పాత్ర గురించి పూర్తి వివరాలను దర్శకుడు ఈ సీజన్‌లో చూపించలేదు. ఆమె ఝాన్సీపై చూపించే ప్రేమ.. ఏదో లెస్బియన్ లవ్ మాదిరిగా అనిపిస్తుంది. ముమైత్ ఖాన్ పాత్ర కాస్త షాక్‌ను గురిచేస్తుంది. వుమన్ ట్రాఫిక్ చేసే మహిళగా ఉన్న ముమైత్.. మంచిగా మారడమేంటో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విలన్‌గా రాజ్ విజయ్ ఫర్వాలేదనిపిస్తాడు. అతడి పాత్ర నిడివి తక్కువైనా.. సిరీస్ అంతా ప్రభావితం చేస్తాడు.
సాంకేతిక వర్గం..
ఈ సిరీస్ నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కథకు అనుగుణంగా మంచి లోకేషన్లు ఎంచుకున్నారు. అయితే కథే రొటీన్‌గా ఉండటం ఇక్కడ మైనస్. శ్రీ చరణ్ పాకాల సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. అయితే గుర్తుండిపోయేలా నేపథ్య సంగీతం ఉండదు. సినిమాటోగ్రఫర్ పనితరం బాగానే ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగు పడాల్సింది. చాలా సన్నివేశాలకు కత్తెర వేయవచ్చు. దర్శకుడు తిరు, గణేష్.. స్క్రిప్టుపై పూర్తి స్థాయి పరిశోధన చేయలేదనిపిస్తుంది. ఇలాంటి స్టోరీలు దాదాపు ఒకే మాదిరిగా ఉన్న కథనం విషయంలో జాగ్రత్త పడాల్సింది. ఇందులో ఇదే పెద్ద మైనస్ అయింది. ప్రధాన పాత్ర గతాన్ని మర్చిపోయి ఒక్కొక్కటిగా ఛేదించే అంశాన్ని ఇంకా థ్రిల్లింగ్‌గా తెరకెక్కించవచ్చు. ఈ విషయంలో దర్శకుల వైఫల్యం కనిపిస్తుంది. ఫలితంగా ఈ సిరీస్‌లో యావరేజ్ కంటే కూడా తక్కువే అనిపిస్తుంది.
చివరగా.. ఝాన్సీలో మెరుపుల్లేవు.. జస్ట్ ఓకే
రేటింగ్: 2.5/5