Gaali vaana review | గాలివాన వెబ్ సిరీస్ రివ్యూ... డిఫరెంట్ మర్డర్ మిస్టరీ డ్రామా
17 April 2022, 6:25 IST
రాధిక శరత్‌కుమార్, సాయికుమార్, చైతన్య కృష్ణ, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన గాలివాన వెబ్‌సిరీస్ ఇటీవల జీ5 ఓటీటీ ద్వారా విడుదలైంది. బీబీసీ రూపొందించిన బ్రిటీష్ టీవీ సిరీస్ ఆల్ అఫ్ అజ్ ఆధారంగా రూపొందిన ఈ తెలుగు వెబ్ సిరీస్‌కు శరణ్ కొప్పిశెట్టి దర్వకత్వం వహించారు. మర్డర్ మిస్టరీ కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.
సాయికుమార్, రాధిక శరత్‌కుమార్
హాలీవుడ్ సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం కొత్తేమీకాదు. విదేశీ బాషల్లో విజయవంతమైన చిత్రాల స్ఫూర్తితో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. కానీ హాలీవుడ్ వెబ్‌సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేయడం అన్నది మాత్రం అరుదనే చెప్పాలి. గాలివాన అలాంటి కొత్త ప్రయత్నంగా నిలిచింది. బీబీసీ వారు రూపొందించిన బ్రిటీష్ టీవీ సిరీస్ వన్అఫ్ అజ్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. రాధిక శరత్‌కుమార్, సాయికుమార్ లాంటి సీనియర్స్ తో పాటు చైతన్య కృష్ణ, చాందినీ చౌదరి, శరణ్య లాంటి యువ నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. కిరాక్ పార్టీ, తిమ్మరుసు లాంటి చిత్రాలతో ప్రతిభను చాటుకున్న శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించగా శరత్ మరార్ నిర్మించారు. మర్డర్ మిస్టరీ కథాంశంతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ ద్వారా ఇటీవల విడుదలైంది. ఈసిరీస్ ఎలా ఉందంటే..
గోదావరి జిల్లా నేపథ్యంలో...
గోదావరి జిల్లాలోని కొమర్రాజు లంక అనే ఊరిలో ఉండే రెండు కుటుంబాల కథ ఇది. ఆయుర్వేద వైద్యుడైన రాజు(సాయికుమార్) కూతురు గీత, సరస్వతి(రాధిక శరత్ కుమార్) కొడుకు అజయ్ వర్మ ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. హనీమూన్ కోసం వైజాగ్ వెళ్లిన వారు అనూహ్యంగా హత్యకు గురవుతారు.పడమటి లంక శ్రీను అనే కిల్లర్ డబ్బు, నగల కోసం వారిని హత్య చేసి పారిపోయే క్రమంలో సరస్వతి ఇంటి ముందే అతడి కారుకు ప్రమాదం జరుగుతుంది. కొన ప్రాణాలతో ఉన్న అతడిని సరస్వతి పెద్దకొడుకు మార్తాండ్(చైతన్య కృష్ణ) కూతురు శ్రావణి (చాందినీ చౌదరి)తమ ఇంట్లోకి తీసుకువస్తారు. అతడి జేబులో అజయ్, గీతల ఫొటో కనిపిస్తుంది. అంతలోనే మీడియా ద్వారా వారిని హత్య చేసింది అతడే అనే నిజం వారికి తెలుస్తుంది. ఆ రోజు రాత్రి కిల్లర్ ను తమ దగ్గర బందీగా ఉంచుకొని ఉదయం పోలీసులకు అప్పగించాలని రాజు, సరస్వతి ఫ్యామిలీలు అనుకుంటాయి. కానీ శ్రీనుపై ఉన్న కోపంతో ఆ రెండు కుటుంబాల్లోని ఒకరు అతడిని హత్య చేస్తారు. అజయ్, గీత హత్య లతో పాటు శ్రీను మిస్సింగ్ కేసును సాల్వ్ చేసే బాధ్యతను పోలీస్ ఆఫీసర్ నందిని తీసుకుంటుంది. శ్రీను శవం పోలీసులకు దొరక్కుండా రాజు, సరస్వతి తో పాటు ఆమె కుటుంబసభ్యులు ఎలాంటి ప్లాన్స్ వేశారు. అజయ్, గీతల హత్యల వెనకున్నది ఎవరు? వారి మరణానికి కారణమేమిటి? శ్రీను ను చంపిన ఫ్యామిలీ మెంబర్ ఎవరన్నదే ఈ సిరీస్ మిగతా కథ.
ఫ్యామిలీ ఎమోషన్స్ తో
బ్రిటీష్ సిరీస్ లోని మూలకథను తీసుకొని గోదావరి జిల్లాల నేటివిటీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ను మేళవించి తెలుగులో ఈ సిరీస్‌ను రీమేక్ చేశారు. మర్డర్ మిస్టరీ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఓ కుటుంబంలోని వ్యక్తుల మరణానికి కారణమైన హంతకుడు అనూహ్యంగా ఆ ఇంటి ముందు శవంగా మారి కనిపిస్తే అన్న పాయింట్‌తోనే ఆసక్తికరంగా ఈ సిరీస్ మొదలవుతుంది. ప్రకృతి విపత్తును కథలోని మలుపుల కోసం దర్శకుడు చక్కగా వాడుకున్నాడు. ఓ వైపు తమ ఫ్యామిలీ మెంబర్స్ ను కోల్పోయిన బాధ, మరోవైపు అప్రయత్నంగా తమ చేతిలో చనిపోయిన వ్యక్తిని దాచడానికి ఆ రెండు కుటుంబాలు పడే తపన నుంచి ఎమోషన్స్ రాబట్టుకున్నాడు. ఈ సిరీస్ లో కనిపించే ప్రతి పాత్రకు ఓ బ్యాక్ స్టోరీని పెట్టడం బాగుంది. మర్డర్ మిస్టరీతోనే సమాంతరంగా ఆ ఉపకథలను నడిపించేలా స్ర్కీన్‌ప్లే ను చక్కగా రాసుకున్నారు.
ట్విస్ట్ లు బాగున్నాయి..
శ్రీను ను చంపిన హంతకుడు ఎవరనే సస్సెన్స్ ను చివరి వరకు ప్రేక్షకుల ఊహలకు అందకుండా పకడ్బందీగా చెప్పగలిగారు. ఇరు కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తిపై అనుమానాలు కలగడం..వారి ప్రవర్తన కథలో లీనమయ్యేలా చేస్తుంది. అనుమానాలు కొన్ని సార్లు ప్రేమించే వారిని ఏ విధంగా దూరం చేస్తుందో అర్థవంతంగా చెప్పగలిగారు. పోలీస్ ఆఫీసర్ నందిని ఎంట్రీతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ అసలు హంతకుడిని ఆమె ఎలా పట్టుకుందనే అంశాన్ని థ్రిల్లింగ్ గా చూపించారు. చివరి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే మలుపులు బాగున్నాయి.
వేగం తగ్గింది
ఒరిజినల్ బ్రిటీష్ సిరీస్ నాలుగు కేవలం నాలుగు ఏపిసోడ్స్‌తోనే ముగుస్తుంది కానీ తెలుగులో ఏడు ఎపిసోడ్స్‌కు పెంచేశారు. మర్డర్ మిస్టరీ కథలకు వేగమే ప్రధానం. అది ఇందులో పూర్తిగా లోపించింది. సీరియల్‌లా సిరీస్ సాగుతూనే ఉంటుంది. ఫాదర్ ఎపిసోడ్ , పోలీస్ ఆఫీసర్ కూతురి డ్రామా, మార్తాండ్, జ్యోతిల పర్సనల్ లైఫ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఉపకథలన్నీ కేవలం సిరీస్ నిడివి పెంచడానికే ఉపయోగపడ్డాయి. అసలు కథను పక్కదారి పట్టిస్తాయి. చివరలో వచ్చే కీలకమైన మలుపును కన్వీన్సింగ్‌గా చెప్పలేకపోయారని అనిపించింది. అలాగే పోలీస్ ఆఫీసర్‌గా నందిని చేసే విచారణ నిరాసక్తంగా సాగుతుంది. ఆమె క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దలేదు. శవాన్ని కుటుంబసభ్యులు దాచేసీన్ దృశ్యం సినిమాను గుర్తుకుతెస్తుంది.
సీనియర్స్ బలం..
సరస్వతి పాత్రలో రాధిక శరత్‌కుమార్ ఒదిగిపోయారు. కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించే తల్లి పాత్రలో ఆద్యంతం భావోద్వేగభరితంగా ఆమె క్యారెక్టర్ సాగింది. రాజుగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో సాయికుమార్ తన డైలాగ్ డెలివరీ, నటనతో ఆకట్టుకున్నారు.తాను చేసే తప్పుల్ని సమర్థించుకునే తండ్రిగా అతడి క్యారెక్టర్‌ను దర్శకుడు చక్కగా తీర్చిదిద్దారు. శ్రావణిగా చాందిని చౌదరి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించింది. చైతన్యకృష్ణ, శరణ్య, ఆశ్రిత వేముగంటితో పాటు మిగిలిన క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి. అంజి అనే తిండిబోతు కానిస్టేబుల్‌గా తాగుబోతు రమేష్ పాత్ర కొన్ని చోట్ల నవ్వులను పండించింది. సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం ఈ సిరీస్‌కు బలంగా నిలిచాయి.
మర్డర్ మిస్టరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన డిఫరెంట్ సిరీస్ ఇది. యువతరాన్ని, కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా తెరకెక్కించారు. ఓపికగా చూడగలిగే తప్పకుండా మంచి అనుభూతిని పంచుతుంది.
టాపిక్