Emergency trailer: ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర.. ఆసక్తికరంగా కంగనా రనౌత్ ఎమర్జెన్సీ ట్రైలర్
14 August 2024, 14:37 IST
- Emergency trailer: ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర.. అంటూ కంగనా రనౌత్ నటిస్తున్న ఎమర్జెన్సీ మూవీ ట్రైలర్ బుధవారం (ఆగస్ట్ 14) రిలీజైంది. ఈ మూవీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర.. ఆసక్తికరంగా కంగనా రనౌత్ ఎమర్జెన్సీ ట్రైలర్
Emergency trailer: స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన ఎమర్జెన్సీ రోజులు, దానికి కారణమైన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితంపై తెరకెక్కిన మూవీ ఎమర్జెన్సీ. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సెప్టెంబర్ 6న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ఇందిర పాత్రలో కంగనా నటించింది.
ఎమర్జెన్సీ ట్రైలర్
ఈ ఏడాది ఎంతో ఆసక్తి రేపుతున్న సినిమాల్లో ఒకటి ఎమర్జెన్సీ. నిజానికి గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ ఈ ఏడాది సెప్టెంబర్ 6న రిలీజ్ కు సిద్ధమవుతోంది. కంగనా రనౌత్ ఈ మూవీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించడమే కాకుండా తన సొంత మణికర్ణిక ఫిల్మ్ బ్యానర్లో నిర్మించి దర్శకత్వం కూడా వహించడం విశేషం.
ఎమర్జెన్సీ ట్రైలర్ విషయానికి వస్తే తన తండ్రి నెహ్రూ మరణం తర్వాత ఇందిర రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని అయిన తీరుతోపాటు ఇండియా, పాకిస్థాన్ యుద్ధం, సిమ్లా ఒప్పందం, ప్రతిపక్ష నేతలతో ఆమె వ్యవహరించిన తీరు, అత్యంత చీకటి రోజులను దేశానికి అందించిన ఎమర్జెన్సీ విధించే నిర్ణయంలాంటి అంశాలన్నింటినీ ఇందులో చూపించారు.
ఈ దేశం నుంచి తనకు ద్వేషం తప్ప మిగిలిందేమీ లేదు.. ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర.. లాంటి డైలాగులతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఇందిర జీవితం షేక్‌స్పియరియన్ విషాదం అని ఎందుకంటారో కూడా ఇందులో చూపించే ప్రయత్నం చేయబోతున్నారు.
ఎమర్జెన్సీ మూవీ గురించి..
ఈ సినిమాలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించాడు. గతేడాది నుంచే ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, టీజర్ లాంటివి రిలీజ్ చేస్తూ వస్తున్న.. మూవీ రిలీజ్ మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. సమ్మర్ లో రిలీజ్ కావాల్సి ఉన్నా.. బీజేపీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో నిలబడిన కంగన సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది.
ఈ ఎమర్జెన్సీ మూవీలో కంగన, అనుపమ్ ఖేర్ తోపాటు శ్రేయస్ తల్పడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్, సతీష్ కౌశిక్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎంపీ కంగన.. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని ఇందిరపై తీసిన సినిమా కావడంతో ఈ మూవీపై చాలా ఆసక్తి నెలకొంది.