LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ కి అస్వస్థత; ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స
మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎల్ కే అద్వానీ వయస్సు 96 సంవత్సరాలు.
మాజీ ఉప ప్రధాని, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, 96 ఏళ్ల లాల్ కృష్ణ అద్వానీ మంగళవారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అద్వానీకి చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
గతంలో కూడా చికిత్స..
జులై 3 వ తేదీన కూడా బీజేపీ నేత అద్వానీని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేశారు. వారం రోజుల క్రితం అద్వానీ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. ఒక రోజు తరువాత డిశ్చార్జ్ చేశారు. మార్చి 31 న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అద్వానీకి భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను తన నివాసంలో ప్రదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు.
బీజేపీ ఎదుగుదలకు ప్రధాన కారణమైన నేత
జాతీయ స్థాయిలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి కారణమైన నేత ఎల్ కే అద్వానీ. అయోధ్యలో రామ మందిర నిర్మాణం లక్ష్యంగా ఆయన చేపట్టిన దేశ వ్యాప్త రథ యాత్ర, తదనంతర పరిణామాలు బీజేపీని ‘మెజారిటీ’ ప్రజలకు దగ్గర చేశాయి. అద్వానీ 1927 నవంబర్ 8న కరాచీలో జన్మించారు. తన 14వ ఏట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) లో చేరారు. 1947లో దేశవిభజన తర్వాత ఆయన తన కుటుంబంతో సహా భారతదేశానికి వలస వచ్చారు.
జన సంఘ్ నుంచి..
1951లో శ్యామప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ ను స్థాపించారు. 1970లో రాజ్యసభలో అడుగుపెట్టిన ఆయన రెండేళ్ల తర్వాత పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో పార్టీ సహచరుడు అటల్ బిహారీ వాజపేయితో పాటు అరెస్టయ్యారు.1977లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అద్వానీ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1980 లో భారతీయ జనతా పార్టీ ని స్థాపించిన సమయంలో వ్యవస్థాపక సభ్యులలో ఒకరుగా ఉన్నారు. 1984 సార్వత్రిక ఎన్నికలలో కేవలం రెండు స్థానాలు గెలుచుకున్న స్థాయి నుంచి ఇప్పుడు కేంద్రంలో మూడు సార్లు అధికార పక్షంగా ఉండేంతలా బీజేపీ ఎదగడానికి ప్రధాన కారణం అద్వానీ నాయకత్వమే.
ఉప ప్రధానిగా..
అద్వానీ మూడు పర్యాయాలు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్రంలో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఉప ప్రధాని గా, హోం మంత్రిగా పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అద్వానీని బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఆ పార్టీ ఎన్నికల్లో గెలవలేకపోయింది.