PM Modi dials Dhankhar: ‘‘20 ఏళ్లుగా అవమానాలు ఎదుర్కొంటున్నా..’’ - ఉపరాష్ట్రపతితో ప్రధాని మోదీ
PM Modi dials Dhankhar: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ ను పరిహాసం చేస్తూ పార్లమెంటు వెలుపన విపక్ష ఎంపీలు చేపట్టిన కార్యక్రమం విషయంలో రచ్చ కొనసాగుతోంది. తాజాగా, ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతి ధన్ కర్ కు ఫోన్ చేశారు.
PM Modi dials Dhankhar: పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటనపై నిరసన తెలుపుతున్న ఇతర విపక్ష సభ్యులతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్ కర్ రాజ్య సభ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో, విపక్ష ఎంపీలు పార్లమెంటు ప్రధాన భవనం మెట్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఉపరాష్ట్ర పతి ధన్ కర్ శైలిని అనుకరించారు. ఆ ఘటనను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వీడియో తీశారు.
ధన్ కర్ ఆగ్రహం..
పార్లమెంటు ప్రాంగణంలో తనను అనుకరిస్తూ కార్యక్రమం చేపట్టడంపై ఉపరాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. తన రైతు నేపథ్యాన్ని, గ్రామీణ నేపథ్యాన్ని అవమానించారన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని మోదీ ధన్ కర్ కు ఫోన్ చేశారు. ధన్ కర్ ను బాడీ షేమింగ్ చేస్తూ అవమానించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా తాను కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, ఆ అవమానాలను సవాళ్లుగా తీసుకుని ముందుకు వెళ్లానని ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతి ధన్ కర్ కు తెలిపారు. ఉపరాష్ట్రపతిని అవమానించడం బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై స్పందించడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరాకరించారు.
మహువా మొయిత్రా రియాక్షన్
పార్లమెంటు ప్రాంగణంలో తనను, తన పదవిని, తన హోదాను విపక్ష ఎంపీలు అవమానించారన్న ఉప రాష్ట్రపతి ధన్ కర్ ఆవేదనపై టీెఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ఉపరాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ ను వేరెవరూ అవమానించలేరని, ఆయన మాత్రమే తనను తాను అవమానించుకుంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పనిలో పనిగా, గతంలో పార్లమెంట్లో ప్రధాని మోదీ ఇతర గౌరవనీయ ఎంపీలను అనుకరిస్తూ, అవమానించిన గత వీడియోలను మహువా మొయిత్రా ట్విటర్ లో పోస్ట్ చేశారు.