Kangana Ranaut: కంగనా రనౌత్ నుంచి రేసు గుర్రం విలన్ వరకు.. లోక్‍సభ ఎన్నికల్లో గెలిచిన నటీనటులు
04 June 2024, 21:35 IST
- Election Results 2024 - Kangana Ranaut: లోక్‍సభ ఎన్నికల్లో కొందరు నటీనటులు విజయాలు సాధించారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన కంగనా రనౌత్ అద్భుతంగా గెలిచారు. మరికొందరు యాక్టర్లు కూడా విజయం సాధించారు.
Kangana Ranaut: కంగన రనౌత్ నుంచి రేసు గుర్రం విలన్ వరకు.. లోక్‍సభ ఎన్నికల్లో గెలిచిన నటీనటులు
Lok Sabha Election Results 2024: దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన లోక్‍సభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. నేడు (జూన్ 4) ఫలితాలు వెల్లడయ్యాయి. కాగా, ఈసారి ఎన్నికల్లో కొందరు సినీ నటీనటులు విజయదుంధుబి మోగించారు. వారెవరూ ఇక్కడ చూడండి.
కంగన రనౌత్
బాలీవుడ్ క్వీన్, ప్రముఖ నటి కంగనా రనౌత్ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. తన సొంత ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‍లోని మండి లోక్‍సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. పోటీ చేసిన తొలిసారే కంగన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్‍పై ఆమె గెలిచారు.
అరుణ్ గోవిల్
రామాయణ్ సీరియల్‍లో రాముడిగా నటించి చాలా పాపులర్ అయ్యారు అరుణ్ గోవిల్. ఈ ఎన్నికల్లో ఆయన ఉత్తర ప్రదేశ్‍లోని మీరట్ లోక్‍సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీకి దిగారు. ఎన్నికల బరిలోకి దిగిన తొలిసారే ఆయన విజయం సాధించారు. సమాజ్‍వాదీ పార్టీ అభ్యర్థి సునీత వర్మపై 10వేలకు పైగా ఓట్ల మెజార్టీతో అరుణ్ గోవిల్ విజయం సాధించారు.
రవికిషన్
బాలీవుడ్ ప్రముఖ నటుడు రవికిషన్ వరుసగా రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. రేసుగుర్రం చిత్రంలో విలన్ మద్దాలి శివారెడ్డి పాత్రతో తెలుగులోనూ ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఉత్తర ప్రదేశ్‍లోని గోరఖ్‍పూర్ నుంచి రవికిషన్ విజయం సాధించారు. వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. సమాజ్‍వాదీ పార్టీ అభ్యర్థి నటి కాజల్ నిషాద్‍పై రవికిషన్ లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు.
సురేశ్ గోపీ
మలయాళ సీనియర్ నటుడు సురేశ్ గోపీ బీజేపీ తరఫున కేరళలోని త్రిసూర్ లోక్‍సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయంగా ఉంది. సమీప ప్రత్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థి కే మురళీధరన్, సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్‌పై సురేశ్ గోపీ గెలిచారు.
మనోజ్ తివారి
బోజ్‍పురి ప్రముఖ నటుడు మనోజ్ తివారి.. ఉత్తర ఢిల్లీ లోక్‍సభ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచారు. మూడోసారి ఎంపీగా ఆయన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై లక్షకుపైగా ఓట్ల ఆధిక్యంతో మనోజ్ గెలిచారు.
హేమమాలిని
బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ అభ్యర్థి హేమమాలిని ఉత్తర ప్రదేశ్‍లోని మథుర లోక్‍సభ స్థానం నుంచి విజయం సాధించారు. మూడోసారి ఆమెను గెలుపు వరించింది. కాంగ్రెస్ అభ్యర్థి ముకేశ్ ధన్‍గర్‌పై సుమారు 2.93లక్షల భారీ మెజార్టీతో హేమమాలిని విజయం సాధించారు.
ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్
పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్‍లోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తొలిసారి ప్రజాప్రతినిథిగా ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీతపై ఆయన సుమారు 70వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన సారథ్యంలోని జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, రెండు లోక్‍సభ స్థానాల్లోనూ గెలిచి 100 శాతం విజయాన్ని దక్కించుకొని హిస్టరీ క్రియేట్ చేసింది.
టాపిక్