Sita Ramam Deleted Scene: 'సీతా రామం' నుంచి మరో డిలీటెడ్ సీన్.. ప్రేక్షకులను మళ్లీ కంటతడి పెట్టిస్తోంది..!
24 September 2022, 13:03 IST
- Sita Ramam Scene: సీతా రామం చిత్రం నుంచి మరో డిలీడెట్ సీన్‌ను విడుదల చేశారు మేకర్స్. పాకిస్థాన్ ఆర్మీ చేతుల్లో బందీగా చిక్కిన దుల్కర్, సుమంత్ మధ్య నడిచే ఈ సన్నివేశం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
సీతా రామం సినిమా డిలీటెడ్ సీన్ ఇదే
Sita Ramam Deleted scene Release: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం సీతా రామం. ఈ సినిమా విడుదలై శుక్రవారంతో 50 రోజులు పూర్తయింది. గత నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అదిరిపోయే విజయాన్ని అందుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సినీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. దీంతో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన డిలీటెడ్ సన్నివేశాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నాకు చెందిన డిలీటెడ్ సీన్ రిలీజ్ చేయగా.. తాజాగా సినిమాలో చూపించని మరో సన్నివేశాన్ని వదిలారు.
పాకిస్థాన్ ఆర్మీ చేతుల్లో బందీగా ఉన్న దుల్కర్, సుమంత్ మధ్య చిత్రీకరించిన సన్నివేశమిది. పాకిస్థాన్ మేజర్ అబు తారీఖ్.. రామ్ దగ్గరకు వచ్చి నీకు ఇంకేమైనా చేయగలనా అని అడుగుతాడు. తర్వాతి సీన్‌లో సుమంత్, దుల్కర్‌ను బయటకు తీసుకొస్తారు. దీన్ని బట్టి బయటకు తీసుకెళ్లమని రామ్ అడిగాడని అర్థణవుతుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్న వీరిద్దరూ.. పుట్‌బాల్ ఆడతారు. ఆట పూర్తయిన వెంటనే "విష్ణు సర్.. మళ్లీ మీరే గెలిచారు" అని రామ్ అంటాడు. కోపంతో విష్ణు శర్మ.. అతడి కాలర్ పట్టుకొని "అంతా నీవల్లే జరిగింది. నువ్వు అనాథవురా.. నాకు పుట్టింది ఆడపిల్లో, మగపిల్లాడో కూడా తెలియదు" అంటూ రామ్‌పై ఫైర్ అవుతాడు. దీంతో రామ్ భావోద్వేగానికి లోనవుతాడు. ఈ సన్నివేశం కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇప్పటికే ఈ సీన్‌కు యూట్యూబ్‌లో 1 మిలియన్‌కు పైగా వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.
దుల్కర్ సరసన మృణాల్ ఠాకూర్ సీతా మహాలక్ష్మీ పాత్రలో నటించింది. రష్మిక మందన్నా అఫ్రీన్ అనే కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా.. వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకాలపై అశ్విని దత్ నిర్మించారు. సుమంత్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. దక్షిణాదిన సీతా రామం ఆగస్టు 5న విడుదల కాగా.. ఉత్తరాదిన మాత్రం సెప్టెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.