Varasudu Press Meet: వారసుడు తెలుగు గుండెతో చేసిన సినిమా.. ఇక్కడ కూడా సూపర్ హిట్టవుతుంది.. వంశీ పైడిపల్లి స్పష్టం
12 January 2023, 19:51 IST
- Varasudu Press Meet: వారసుడు సినిమా జనవరి 14న తెలుగులో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించి ఆసక్తికర విషయాలను తెలియజేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సహా తదితరులు మాట్లాడారు.
వారసుడు చిత్రబృందం
Varasudu Press Meet: దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం వారిసు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా తమిళంలో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 14న వారసుడు పేరుతో తెలుగులో విడుదల కానుంది. కోలీవుడ్‌లో విడుదలైన తొలి రోజు నుంచి ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో తెలుగులోనూ అదే స్థాయి టాక్ వస్తుందని మేకర్స్ విశ్వాసంతో ఉన్నారు. ఈ సందర్భంగా హైదరబాద్‍లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో భాగంగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు తదితరులు విలేకరులతో ముచ్చటించారు.
ముందుగా దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. "నా జీవితంలో కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు మన వెన్నంటే ఉండేది కుటుంబం ఒక్కటే. ఆ ఆలోచనతో వారసుడు కథను సిద్ధం చేశాం. విజయ్‌తో ఒకే ఒక్క సిట్టింగ్‌లో కథ ఓకే అయిపోయింది. ఆ తర్వాత టెన్షన్ మొదలైంది. అంతటి బిగ్గెస్ట్ స్టార్‌కు సరిపడే విధంగా సినిమా రూపొందించడం కోసం మంచి టీమ్ వర్క్ చేశాం. మంచి కథను చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారనేది సినిమా విడుదలైన తర్వాత నిజమైంది. సినిమా పూర్తయిన తర్వాత ఆడియెన్స్ లేచి చప్పట్లు కొట్టడమనేది మాటల్లో చెప్పలేని అనుభూతి. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది తెలుగు గుండెతో చేసిన సినిమా" అని వంశీ పైడిపల్లి స్పష్టం చేశారు.
అనంతరం నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. "సినిమా మీద నమ్మకంతో మీడియా ప్రతినిధుల కోసం జనవరి 10న ఓ స్పెషల్ షో వేశాం. నిజానికి ఇది రిస్క్ కానీ సినిమా బావుందనే నమ్మకం ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. వంశీ సినిమాను కొత్తగా చెప్పాలనుకునే దర్శకుడు. ఈ రోజు మీ దిల్ రాజు, మీ వంశీ తమిళనాడులో ఓ సూపర్ హిట్ కొట్టి వచ్చాం. ఇది చాలా గ్రేట్ ఫీలింగ్. సీతమ వాకిట్లో, ఎఫ్2, శతమానం భవతి.. ఇలా ప్రతి సంక్రాంతికి మీకు ఓ మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. జనవరి 14న ఈ సంక్రాంతికి వారసుడుగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సంక్రాంతికి వస్తున్న బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రాలు సూపర్ హిట్లు కావాలి, అన్ని చిత్రాలకు డబ్బులు రావాలి" అని దిల్ రాజు ఆకాంక్షించారు.
ఈ సినిమాలో విజయ్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేసింది. ప్రకాశ్ రాజ్, ప్రభు, యోగి బాబు, శ్రీకాంత్, శరత్ కుమార్, జయసుధ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు చిత్రాన్ని నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. జనవరి 11న తమిళంలో విడుదల కాగా.. తెలుగులో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.