Srikanth Interview: వారసుడు పూర్తిగా తెలుగు సినిమా.. శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Srikanth Interview: విజయ్ హీరోగా నటించిన వారసుడు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇందులో కీలక పాత్ర పోషించిన నటుడు శ్రీకాంత్.. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇది పూర్తిగా తెలుగు సినిమా అని స్పష్టం చేశారు.
Srikanth Interview: తలపతి విజయ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిన్న వారిసు. తెలుగులో ఈ సినిమాను వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా చేసింది. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కీలక పాత్రలో మెప్పించారు. తమిళంలో ఆయన నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా వారసుడు చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో విజయ్ సోదరుడిగా నటించానని తెలిపారు.
"విజయ్ సోదరుడిగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాను. బ్రదర్స్, సిస్టర్స్ మధ్య నడిచే అద్భుతమైన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉంటాయి. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ విడుదల కానుంది. ఇది పూర్తిగా తెలుగు నేటివిటీకి తగినట్లుగా ఉంటుంది. టాలీవుడ్ ప్రేక్షకుల్లో గుర్తింపు ఉన్న చాలా మంది నటీ, నటులు ఇందులో నటించారు." అని శ్రీకాంత్ స్పష్టం చేశారు.
తన పాత్ర చిత్రంలో ఫుల్ లెంగ్త్‌లో ఉంటుందని శ్రీకాంత్ అన్నారు.
"వంశీ పైడిపల్లి ఎమోషన్లను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. అతడితో పనిచేయడం ఆనందంగా ఉంది. విజయ్ కూడా ఇటీవల కాలంలో ఎలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేయలేదు. తమిళంలో నా అరంగేట్రం విజయ్ హీరోగా నటించిన సినిమాతో జరగడం చాలా ఆనందంగా ఉంది. సెట్‌లో విజయ్ చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడరు. క్యారవ్యాన్ ఉపయోగించరు. కనీసం సెల్‌ఫోన్ కూడా ఉపయోగించరు. ఎప్పుడూ కష్టపడే మనస్తత్వంతోనే ఉంటారు." అని శ్రీకాంత్ తెలిపారు.
ఇటీవల కాలంలో చాలా వరకు సినిమాలు పాన్ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయని, ముఖ్యంగా మన తెలుగు చిత్రాలను ఇతర భాషల్లో బాగా ఆదరిస్తున్నారని శ్రీకాంత్ అన్నారు. కాబట్టి సంక్రాంతి సీజన్ సినిమాలకు కూడా పండగ సీజనే, అన్ని రకాల సినిమాలను ప్రేక్షకులు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారని ఆయన తెలిపారు. వారసుడు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, పండుగకు ఇది ఫర్ఫెక్ట్ సినిమా ఆయన స్పష్టం చేశారు.
విజయ్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. వీరితో పాటు ప్రకాశ్ రాజ్, జయసుధ, ప్రభు, శరత్ కుమార్, శ్రీకాంత్, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటిగ్ బాధ్యతలు తీసుకోగా.. కార్తిక్ పలనీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.