తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Radheshyam| రాధేశ్యామ్ ఓటీటీలో రానుందా? థియేటర్ల మాటేమిటి?

Radheshyam| రాధేశ్యామ్ ఓటీటీలో రానుందా? థియేటర్ల మాటేమిటి?

26 January 2022, 17:23 IST

google News
    • రాధేశ్యామ్ చిత్రం ఓటీటీలో విడుదలవుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చెక్ పెట్టాడు. రిపబ్లిక్ డే సందర్భంగా విషెస్ చెబుతూ అసలు విషయాన్ని తెలియజేశాడు.
రాధేశ్యామ్
రాధేశ్యామ్ (Twitter/UV creations)

రాధేశ్యామ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్యాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కానుందని గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, జీ4 భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయని,  నిర్మాతలు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని చిత్రబృందం పలుమార్లు చెప్పుకొచ్చినప్పటికీ.. ఓటీటీ ఊహాగానాలకు మాత్రం చెక్ పట్టడం లేదు. దీంతో మరోసారి ఈ విషయంపై చిత్ర దర్శకుడు రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చాడు.

రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకంక్షలు తెలిపిన రాధాకృష్ణ.. చిత్ర విడుదలపై కూడా స్పష్టతనిచ్చాడు. రాధేశ్యామ్ త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుందని ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్‌గా తేల్చి చెప్పాడు. దీంతో ఓటీటీలో సినిమా రాబోతుందనే రూమర్లకు చెక్ పడినట్లయింది. అంతేకాకుండా ఈ విషయంపై ఓ ట్విట్టర్ యూజర్ వేసిన ప్రశ్నకు కూడా రాధాకృష్ణ సమాధానం చెప్పాడు. "సినిమా ఎప్పుడు వస్తుంది అన్నా" అని అడుగ్గా ఎప్పుడైతే పరిస్థితులు సద్దుమణుగుతాయో అప్పుడు విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు. నిర్మాణ సంస్థ విడుదల తేదీని ప్రకటిస్తుందని స్పష్టం చేశాడు.

ఫలితంగా రాధేశ్యామ్‌ కచ్చితంగా సినిమా థియేటర్లలోనే విడుదలవుతుందని తేలిపోయింది. అయితే కరోనా థర్డ్ వేవ్‌పై ఇది ఆధారపడి ఉంటుంది. మహమ్మారి ప్రభావం తగ్గితే కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాదు. పరిస్థితి సద్దుమణిగితే వేసవి కానుకగా ఏప్రిల్ లేదా మే మాసాల్లో విడుదలయ్యే అవకాశముంది.

ప్రభాస్ నటించిన ఈ రాధేశ్యామ్ చిత్రం పీరియాడికల్ ప్రేమ కథగా తెరకెక్కింది. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. జస్టిన్ ప్రభాకరన్‌తో దక్షిణాది భాషల్లో సంగీతాన్ని సమకూర్చగా.. హిందీలో పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ చిత్రానికి స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ పాటలు, ట్రైలర్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నాడు. యూవీక్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆదిపురుష్‌ను తెలుగు, హిందీ భాషల్లో ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కృతిసనన్, సైఫ్ అలీఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్, సందీప్ రెడ్డితో ప్రాజెక్ట్ కే లాంటి చిత్రాలతో మన డార్లింగ్ బిజీగా ఉన్నాడు.

తదుపరి వ్యాసం