తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thangalaan Ott: ఓటీటీలోకి విక్రమ్ ‘తంగలాన్’ సినిమా.. ఆరోజే రానుందా?

Thangalaan OTT: ఓటీటీలోకి విక్రమ్ ‘తంగలాన్’ సినిమా.. ఆరోజే రానుందా?

08 September 2024, 18:23 IST

google News
    • Thangalaan OTT: తంగలాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు డేట్ ఖరారైనట్టు సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రం ఏ రోజున ఓటీటీలోకి వస్తుందో బజ్ నడుస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
Thangalaan OTT: ఓటీటీలోకి విక్రమ్ ‘తంగలాన్’ సినిమా.. ఆరోజే రానుందా?
Thangalaan OTT: ఓటీటీలోకి విక్రమ్ ‘తంగలాన్’ సినిమా.. ఆరోజే రానుందా?

Thangalaan OTT: ఓటీటీలోకి విక్రమ్ ‘తంగలాన్’ సినిమా.. ఆరోజే రానుందా?

తమిళ స్టార్ హీరో చియన్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా ప్రశంసలను దక్కించుకుంది. ఆగస్టు 15వ తేదీన ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం రిలీజైంది. మరోసారి తన నట విశ్వరూపం చూపారు విక్రమ్. విభిన్నమైన గెటప్‍లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. తంగలాన్ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కమర్షియల్‍గానూ పర్వాలేదనిపించింది. తంగలాన్ సినిమా ఓటీటీలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది.

తంగలాన్ ఓటీటీ డేట్ ఇదేనా!

తంగలాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రిలీజ్‍కు ముందే డీల్ చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 20వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం బయటికి వచ్చింది. అయితే, నెట్‍ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

తంగలాన్ చిత్రం సెప్టెంబర్ 20వ తేదీన నెట్‍‍ఫ్లిక్స్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్‍కు రానుందనే బజ్ నడుస్తోంది. అయితే, హిందీ వెర్షన్ వారం ఆలస్యంగా వస్తుందనే టాక్ ఉంది. సెప్టెంబర్ 27న తంగలాన్ హిందీ వెర్షన్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

అనుకున్న దాని కంటే ముందే!

తంగలాన్ చిత్రాన్ని థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ ముందుగా అనుకున్నారు. అయితే, ఈ మూవీకి ఇప్పటికే దాదాపు థియేట్రికల్ రన్ ముగిసింది. చాలా కొన్ని థియేటర్లలోనే ఈ మూవీ ఉంది. దీంతో అనుకున్న దాని కంటే ముందే సెప్టెంబర్‌లోనే తంగలాన్ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయినట్టు టాక్. మరి సెప్టెంబర్ 20న ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందా అనేది చూడాలి.

1850ల బ్యాక్‍డ్రాప్‍లో బ్రిటీష్ పాలన కాలం నాటి కథతో తంగలాన్ చిత్రం రూపొందింది. కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో బంగారం కోసం జరిపిన వేట నేపథ్యంలో ఈ చిత్రాన్ని డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించారు. విక్రమ్ ఈ చిత్రంలో ఐదు గెటప్‍ల్లో కనిపించారు. మరోసారి ప్రాణం పెట్టి నటించారు. ఈ చిత్రాన్ని తన సిద్ధాంతాలతోనే చూపించే ప్రయత్నం చేశారు పా రంజిత్.

తంగలాన్ చిత్రంలో విక్రమ్‍తో పాటు మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి, డేనియల్ కాల్టగిరోన్, హరికృష్ణన్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఏ.కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి ప్లస్ అయింది.

కలెక్షన్లు ఇలా..

తంగలాన్ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ మూవీ దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు తగ్గట్టు భారీ వసూళ్లను ఈ మూవీ సాధించలేకపోయింది. కమర్షియల్‍గా యావరేజ్‍గా నిలిచింది. ఈ చిత్రం ఫుల్ రన్‍లో రూ.110కోట్లను దాటే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. తంగలాన్ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2ను మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందని విక్రమ్ వెల్లడించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం