తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Press Meet: రాజకీయాలపై చిరంజీవి సంచనల వ్యాఖ్యలు.. గా‌డ్‌ఫాదర్ డైలాగ్‌పై చిరు స్పష్టత

Chiranjeevi Press Meet: రాజకీయాలపై చిరంజీవి సంచనల వ్యాఖ్యలు.. గా‌డ్‌ఫాదర్ డైలాగ్‌పై చిరు స్పష్టత

04 October 2022, 17:23 IST

google News
    • Chiranjeevi About Pawan Kalyan: గాడ్‌ఫాదర్ చిత్ర ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలపై వచ్చిన డైలాగుపై స్పందిస్తూ మాతృకలో డైలాగుల ఆధారంగానే రాసినట్లు స్పష్టం చేశారు.
గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్ లో చిరంజీవి
గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్ లో చిరంజీవి (HT Feed)

గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్ లో చిరంజీవి

Chiranjeevi comments on Politics: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 5వ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా హీరో చిరంజీవి, దర్శకుడు మోహన్ రాజా తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ముఖ్యంగా రాజకీయ నేతలపై గాడ్‌ఫాదర్ సినిమాలో వచ్చిన డైలాగ్ గురించి అడుగ్గా.. ఇందులో పొలిటికల్ లీడర్లపై ఎలాంటి సెటైర్లు వేయలేదని మెగాస్టార్ స్పష్టం చేశారు. ఈ సినిమా లూసిఫర్ రీమేక్‌గా తెరకెక్కిందని, మాతృకలోని డైలాగుల ఆధారంగానే ఇందులోనూ రాసినట్లు ఆయన తెలిపారు.

"నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు." అనే డైలాగ్‌ను చిరంజీవి ఇటీవలే తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ గురించే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు. ఆ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేమి చేయలేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తన మద్దతు ఉంటుందని తెలిపారు.

"నా తమ్ముడు కల్యాణ్ నిజాయితీ గురించి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అది ఎక్కడా కలుషితం కాలేదు. అలాంటి నాయకుడు మనకు రావాలి. అందుకు కచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది. నేను ఓ పార్టీ, తను ఓ పార్టీలో ఉండటం కంటే.. నేను సైలెంట్ అయితే అతడు భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతాడు. రాష్ట్రాన్ని పాలించే అవకాశం ప్రజలు తనకి ఇవ్వాలని, అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నా." అని చిరంజీవి స్పష్టం చేశారు.

దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. "నేను తమిళనాడులో పుట్టినా దర్శకుడిగా పుట్టింది మాత్రం తెలుగులోనే. ఇప్పుడు నా పదో సినిమాగా చిరంజీవి గారి గాడ్ ఫాదర్ తో రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం నా పేరుని మొదట సూచించిన నిర్మాత ఎన్ వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. నాకు ఐదేళ్ళు వున్నపుడు నేను చూసిన హీరో చిరంజీవి గారు. ఆయన ఇమేజ్ కళ్ళ నుండి ఎప్పటికీ పోదు. లూసిఫర్ సినిమాకి నేను పెద్ద అభిమానిని. అందులో వున్న బలాన్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చాను. గాడ్ ఫాదర్ అనే టైటిల్ పెట్టింది తమన్, ఈ సినిమాకి తమన్ సంగీతం ఆరో ప్రాణం. ఇంటర్వెల్ లో ఒక సీన్ వుంది. థియేటర్ బద్దలౌతుంది. చిరంజీవి గారు కంటి చూపుతో గ్రేట్ యాక్షన్ చేశారు. సత్యదేవ్ పాత్ర అద్భుతంగా పండింది. నయనతార అద్భుతమైన పాత్ర చేశారు. మురళి శర్మ, సునీల్, షఫీ, సముద్రఖని, అనసూయ అందరి పాత్రలు అద్భుతంగా వుంటాయి. నా డైరెక్షన్ టీంకు కృతజ్ఞతలు. చిరంజీవి గారిపై వున్న ప్రేమని ఈ సినిమాతో చూపించాను. ఇది మామూలు ప్రేమ కాదు. సినిమా బావుంటే ప్రేక్షకులు ఇంకా గొప్ప ప్రేమని చూపించాలని. ఇండస్ట్రీ కనీ ఎరుగని హిట్ ని గాడ్ ఫాదర్ కి ఇవ్వాలి. తెలుగు ని ఇండియా మ్యాప్ కి చూపించినది మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన మనందరికీ ఒక ఐడెంటిటి. ఈ సినిమాకి పని చేసిన అందరూ చిరంజీవి గారిపై ప్రేమతో చేశారు. ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రేమ కురిపించాలి" అని కోరారు.

సత్యదేవ్ మాట్లాడుతూ.. "అన్నయ్య అంటే చిన్నప్పటి నుండి ఇష్టం ప్రేమ. ఆయనపై వున్న ప్రేమతో ఇండస్ట్రీ కి వచ్చాను. ఆయనతో కలసి నటించడం ఒక కల నేరవేరినట్లయింది. దర్శకుడు మోహన్ రాజా ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసినతీరు అద్భుతం. నిర్మాతలు ఆర్ బి చౌదరీ, ఎన్ వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరు నా థాంక్స్. గాడ్ ఫాదర్ విజయదశమి రోజు తప్పకుండా పెద్ద విజయం అందుకుంటుంది" అని అన్నారు

నిర్మాత ఎన్ వి ప్రసాద్ మాట్లాడుతూ.. "నేను చిరంజీవి గారి ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిలానే వుంటాను. ఆయనతో గొప్ప సాన్నిహిత్యం వుంది. ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేయాలని ఉండేది. ఇలాంటి సమయంలో ఓసారి చరణ్ బాబు ఫోన్‌ చేసి.. ‘‘లూసిఫర్‌’ సినిమా నాన్నకు బాగా నచ్చింది. కుదిరితే మీరు హక్కులు కొనుగోలు చేయండి’’ అని చెప్పారు. చరణ్‌ బాబు చెప్పడంతో మేము హక్కులు కొనుగోలు చేశాం. అలా చిరంజీవి గారి చిత్రానికి నన్ను నిర్మాతను చేసింది చరణ్ బాబే. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి దీన్ని తెరకెక్కించారు. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ మా బ్యానర్ లో చేయడం మేము ఎన్నడూ ఊహించని విషయం. ఇది చరణ్, చిరంజీవి గారి వలనే సాధ్యమైయింది ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా ఓ పండుగలా వుంటుంది. అభిమానులు తప్పకుండా విజిల్స్‌ వేస్తారు. గాడ్ ఫాదర్ అభిమానుల అంచనాల అందుకుంటుంది'' అన్నారు

గాడ్‌ఫాదర్ అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది సత్యదేవ్ కూడా ముఖ్యమైన క్యారెక్టర్ చేశారు. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాలో టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్బీ చైదురీ, ఎన్వీ ప్రసాద్, సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు.

తదుపరి వ్యాసం