Chiranjeevi: ఇండస్ట్రీపై దాడులను ఐక్యంగా ఎదుర్కొంటామని చిరంజీవి ట్వీట్ - టాలీవుడ్ పెద్దల అత్యవసర మీటింగ్?
03 October 2024, 10:48 IST
Chiranjeevi: నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖలను మెగాస్టార్ చిరంజీవి తప్పుపట్టారు. ఇలాంటి దిగజారుడు మాటల్ని టాలీవుడ్ ఇండస్ట్రీ ఐక్యంగా ఎదుర్కొంటుందంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు.
చిరంజీవి
కొండా సురేఖ కామెంట్స్‌పై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ పేరు ప్రస్తావించకుండా సినిమా ఇండస్ట్రీని కించపరుస్తూ ఓ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని చిరంజీవి అన్నాడు. ఇలాంటి దిగజారుడు మాటల్ని ఉపేక్షించేది లేదంటూ తన ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నాడు.
అటెన్షన్ కోసం…
"రాజకీయాల్లో అటెన్షన్ కోసం, ఫేమస్ కావడానికి సినీ ప్రముఖులు, సెలబ్రిటీలను సాఫ్ట్ టార్గెట్ చేయడం సిగ్గుచేటు. రాజకీయ లబ్ది కోసం పాలిటిక్స్‌తో సంబంధం లేనివారిపై ముఖ్యంగా మహిళలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ దిగజారుతున్నారు. గౌరవప్రదమైన హోదాల్లో ఉన్న వ్యక్తులు, నాయకులు ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలి కానీ ఇలాంటి మాటలతో సమాజాన్ని కలుషితం చేయకూడదు. ఇండస్ట్రీపై చేసిన ఈ హేయమమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరిచించుకోవాలని
చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ దాడులను ఇండస్ట్రీ ఐక్యంగా ఎదుర్కొంటుందని చిరంజీవి అన్నాడు.
నేను షాక్ అయ్యా - రామ్‌గోపాల్ వర్మ...
సమంత, నాగచైతన్యలపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ చైసి తాను షాకైనట్లు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నాడు. నాగార్జున కుటుంబాన్ని అంత్యంత దారుణంగా అవమానించిన కొండా సురేఖ కామెంట్లను చూసి నేను షాక్ అయ్యాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకునే క్రమంలో గౌరవప్రదమైన నాగార్జున కుటుంబాన్ని లాగడం ఏ మాత్రం సహించకూడదని రామ్‌గోపాల్‌వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
రాజకీయాల్లోకి లాగొద్దు…మంచు లక్ష్మి
సినిమా ఇండస్ట్రీవారిపై ఓ మహిళ నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం చాలా బాధను కలిగిస్తోందని మంచు లక్ష్మి అన్నది. సినిమా మాధ్యమం ద్వారా ప్రజలను ఎంటర్‌టైన్ చేస్తున్న వారిని గౌరవించండి. అంతేకానీ వారిని రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయ నాయకులు సినీ పరిశ్రమలోని వారిపై ఇలాంటి నిందలు వేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని మంచు లక్ష్మి అన్నది.
సుధీర్‌బాబు,, స్వప్నదత్‌తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు కొండా సురేఖ కామెంట్స్‌ను తప్పు పట్టారు.
టాలీవుడ్ అత్యవసర మీటింగ్
సమంత, నాగచైతన్య విడాకులపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో కలకలాన్ని రేపుతోన్నాయి. టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ వాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ ప్రముఖులపై జరుగుతోన్న మాటల దాడిని అడ్డుకట్టవేసేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఓ అత్యవసర సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మీటింగ్‌కకు సినీ నటీనటులతో పాటు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.