Brahmamudi June 15th Episode: బ్రహ్మముడి- కావ్య, పుట్టింటివాళ్లపై అపర్ణ ప్రేమ వర్షం- రుద్రాణికి గుండెనొప్పి- అంతా షాక్
15 June 2024, 8:11 IST
Brahmamudi Serial June 15th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 15వ తేది ఎపిసోడ్‌లో పెళ్లాన్ని పట్టించుకోమ్మని రాజ్‌కు గడ్డి పెడుతుంది తల్లి అపర్ణ. తర్వాత ఇంటికి వచ్చిన కావ్య పుట్టింటివాళ్లపై అపర్ణ ప్రేమ వర్షం కురిపిస్తుంది. కావ్యను పెద్ద కోడలిగా అంగీకరిస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ జూన్ 15వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో కావ్య సూప్ తీసుకొస్తే అపర్ణ వద్దంటుంది. నేను నీ భార్య చేత్తో ఇచ్చిన సూప్ తాగనురా అని అపర్ణ అంటే.. ఎందుకు మామ్ అని రాజ్ అంటాడు. నా ముందు తనను ఉండొద్దని అంటుంది అపర్ణ. అందరూ నన్నే అనండని కావ్య అంటే.. ఇంకెవరు అన్నారని అపర్ణ అడుగుతుంది. మీ అబ్బాయే. మీకు ఇలా కావడానికి కారణం నేనే అని అంటున్నారు అని కావ్య చెబుతుంది.
నేను చేసిన తప్పు చేయకు
పళ్లు రాలగొడతాను అని అపర్ణ అంటే.. నావా అని కావ్య అయోమయంగా అడుగుతుంది. వీడివి. నాకు ఇలా కావడానికి కారణం నీ తండ్రి చేసిన మోసం. ఒకరు చేసిన తప్పుకు ఇంకొకరికి శిక్ష వేస్తే తర్వాత పడే బాధ నాకే తెలుసు. నీ తండ్రి చేసిన పనికి నా గుండె తట్టుకోలేకపోయింది. నువ్ తప్పు చేశావని నీకు, నీ భార్యకు శిక్ష వేశాను. నేను చేసిన తప్పు చేయకు. అర్థమైందా అని అపర్ణ అంటుంది. సరేనని రాజ్ అంటాడు.
మళ్లీ కావ్య సూప్ ఇస్తే.. వద్దని చెప్పానుగా అని అపర్ణ అంటుంది. వద్దని చెప్పిందిగా లోపలికి వెళ్లు అని కావ్యపై అరుస్తాడు రాజ్. దాంతో రాజ్‌పై కోపంగా చూస్తుంది అపర్ణ. ఇప్పుడే కదరా గడ్డి పెడ్డాను. అప్పుడే నీ భార్యను తిడుతున్నావ్. బుద్ధి లేదా అని అపర్ణ అంటుంది. ఉంది అని రాజ్ అంటాడు. కావ్య సూప్ ఇస్తుంటే.. నువ్ తీసుకోవచ్చు కదా అని అపర్ణ అంటుంది. దాంతో ఆ సూప్ తీసుకున్న రాజ్ అపర్ణకు ఇస్తాడు.
పెళ్లాన్ని పట్టించుకోరా
ఇన్నిరోజులు నీ తండ్రి కోసం చేసిన త్యాగాలు చాలు. నీ భార్య మనసు ముక్కలు కాకుండా చూసుకో అని అపర్ణ చెబుతుంది. అంటే ఏం చేయాలని రాజ్ అడుగుతాడు. నీ పెళ్లాన్ని పట్టించుకోరా దద్దమ్మ. భర్త మనసులో తను లేనని తెలిస్తే ఏ భార్య అయిన తట్టుకోలేదు అని అపర్ణ అంటుంది. కానీ, డాడ్ మనసులో నువ్వే ఉన్నావ్ మమ్మీ అని రాజ్ అంటాడు. చెంప పగిలిపోద్ది. నేను నీ కాపురం గురించి చెబుతున్నాను. భ్రష్టు పట్టిపోయిన నా కాపురం గురించి కాదు. వెళ్లు అని అపర్ణ అంటుంది.
కట్ చేస్తే కావ్య చీర మార్చుకుంటుంటే రాజ్ వచ్చి చూసి షాక్ అవుతాడు. పక్కకు తిప్పుకుంటాడు. కావాలనే వచ్చి అలా ఎందుకు తిరుగుతారు అని కావ్య అంటుంది. అలా ఎందుకు వస్తాను. సరే వెళ్తాను రాజ్ అంటాడు. దాంతో ఆపి కావ్య చీర కట్టుకోవడం అయిపోయిందని అంటుంది. తర్వాత ముద్దు గురించి డిస్కషన్ చేసుకుంటారు. కావ్య ముద్దు పెట్టేలా చూస్తే రాజ్ షాక్ అవుతాడు. ముద్దు వద్దా అని కావ్య అడిగితే.. రాజ్ కావాలి, వద్దన్నట్లు తల ఊపుతాడు.
ముద్దు పెడితే గానీ
తర్వాత రాజ్‌పైకి వెళ్తుంది కావ్య. ఏయ్.. పూజ ఉందని రాజ్ అంటే.. అయ్యో అని చెంపలు వేసుకుంటుంది కావ్య. తర్వాత మా డాడ్ గురించి ఆలోచించమని చెబుతాడు రాజ్. అలా ఎలా మర్చిపోతానని పద్యం గురించి చెబుతుంది కావ్య. దాంతో రాజ్ ఏదో ఒకటి అంటాడు. అయినా నన్నే అంటారేంటీ.. ముద్దు పెడితే గానీ మారరు అని కావ్య పెట్టబోతుంటే.. ఏయ్ పూజ పూజ అని పిచ్చి పిచ్చిగా భయపడుతూ అరుస్తాడు. అది చూసి కావ్య నవ్వుతుంది.
పూజ ఏర్పాట్లు జరుగుతుంటాయి. చేసిన పాపాలు చేసేసి పూజలు చేస్తే పరిహారం అవుతుందా అని ఇందిరాదేవి అంటే.. ఇది నా పరిహారం కోసం కాదు. అపర్ణ ఆరోగ్యం కోసం అని సుభాష్ అంటాడు. పూజలు చేస్తే అపర్ణ మనసుకు అయిన గాయం పోతుందా అని ఇందిరాదేవి అంటుంది. కొడుకు సుభాష్‌ను ఇందిరాదేవి తిడుతుంటే.. కోడలి ముందు ఇలా అనడం బాగోలేదు. ఆయన మీ కొడుకు మీరే కడుపులో దాచుకోకుంటే ఎలా అని కావ్య అంటుంది.
పాప పరిహారం కోసం కాదు
నేను నీ అంత వెర్రిబాగులదాన్ని కాదు. అందరూ నీలా గుండెనిబ్బరంతో ఉండలేరు. నేను సాటి ఆడదానికి తప్పు చేస్తే కొడుకును అయిన క్షమించలేను అని ఇందిరాదేవి అంటుంది. క్షమించకమ్మా. తల్లిగా నీకే ఇంత ద్వేషం ఉంటే తను నన్ను అస్సలు క్షమించదు. అయినా ఈ పూజ నా పాప పరిహారం కోసం కాదు. అపర్ణ ఆరోగ్యం కోసం అని వెళ్లిపోతాడు సుభాష్. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా. సరే ఈ పూజ మావయ్య గారు చేయిస్తున్నారని తెలిస్తే అత్తయ్య ఆపించేస్తారు. ఇది మీరు చేయిస్తున్న పూజ అని చెప్పండని కావ్య అంటుంది.
అందుకు ఇందిరాదేవి సరే అంటుంది. ఇంతలో అనామిక తల్లిదండ్రులు వస్తారు. వీళ్లెందుకు వచ్చారని ధాన్యలక్ష్మీ అనుకుంటుంది. అపర్ణను క్షేమసమాచారాలు అడుగుతారు. హాస్పిటల్‌కే వద్దామనుకున్నాం. కానీ బిజీగా ఉన్నామని కారణాలు చెబుతారు. దాంతో నేను మీరెందుకు రాలేదని అడలేదు. మీకోసం ఎదురుచూడలేదు అని అపర్ణ అంటుంది. ఇప్పుడు మీరు అని ధాన్యలక్ష్మీ అడగబోతుంటే.. ఇంట్లో పూజ ఉందని నేనే రమ్మన్నాను అని అనామిక చెబుతుంది.
ఎప్పుడు ఉండే బాగోతమే
అంటే మా అక్కను చూడటానికి కాదన్నమాట వీళ్లు వచ్చింది అని అనామిక అంటుంది. అంటే సాయంత్రం ఎలాగు వచ్చేవాళ్లే.. పూజకు కూడా వచ్చినట్లు ఉంటుందని ఇప్పుడు రమ్మన్నాను అని అనామిక అంటుంది. తర్వాత కనకం ఫ్యామిలీ అప్పుతోపాటు వస్తుంది. చూశావా ఏదో ఒక సాకు పెట్టుకుని అప్పు ఎప్పుడూ ఇంటికి వస్తుందని అనామిక అంటే.. ఎప్పుడు ఉండే బాగోతమే కదే అని తల్లి ఫైర్ అవుతుంది. అపర్ణను కనకం పరామర్శిస్తుంది.
పర్వాలేదు. కూర్చోండి అని కనకం వాళ్లను అపర్ణ అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. మీవాళ్లు పోయి పోయి మా వదిన దగ్గర కూర్చున్నారు. ఎందుకు బీపీ పెంచడానికా అని రుద్రాణి కావ్యను అంటుంది. ఏయ్ ఇటు రా అని కావ్యను పిలుస్తుంది అపర్ణ. నేనే మిమ్మల్ని చూడటానికి రమ్మని పిలిచాను అత్తయ్య అని కావ్య అంటే.. నీకు అసలు బుద్ధుందా. వాళ్లను ఎవరు పిలిచారని నేను అడిగానా. నేనే పిలిచాను అని అపర్ణ అంటుంది.
స్పృహ తప్పిన రుద్రాణి
దాంతో అంతా షాక్ అవుతారు. ఇంట్లో పూజ ఉంటే ఎందుకు పిలవలేదు. నీ పుట్టింటివాళ్లు వస్తే పలకరించడం కూడా తెలియదా అని అపర్ణ అంటుంది. దాంతో కావ్యతోపాటు కనకం కూడా ఆశ్చర్యపోతుంది. అన్ని నన్ను అడిగే చేస్తున్నావా. వెళ్లి వాళ్లకు కాఫీ తీసుకురా అని అపర్ణ అంటుంది. దాంతో స్పృహ తప్పినట్లు అయి పడిపోతుంది రుద్రాణి. రాజ్ పట్టుకుంటాడు. అక్కడ ఏం జరుగుతోందని రుద్రాణి అంటుంది. ఏమో అన్నట్లుగా రాజ్ చూస్తాడు.
అమ్మమ్మ గిల్లండి అని స్వప్న గిల్లించుకుంటుంది. నిజమే నిజమే అని సంబరపడుతుంది. రాజ్‌ను పిలిచి అత్తమామలను పలకరించమని చెబుతుంది అపర్ణ. తర్వాత కావ్యను ఏంటీ చీర. ఇకనుంచి నా పెద్ద కోడలిగా ఖరీదైన చీరలు కట్టుకోవాలి అని అపర్ణ చెబుతుంది. దాంతో రాహుల్ నా తల తిరిగిపోతుంది అని అంటాడు. నాకు ఆల్రెడీ తిరిగిందిరా అని రుద్రాణి అంటుంది. తెల్లారితే లక్ష పనులు చేస్తుంది. పెళ్లాన్ని షాపింగ్‌కు తీసుకెళ్లలేవా అని రాజ్‌ని నిలదీస్తుంది అపర్ణ.
భర్త కూర్చోవాలి
తీసుకెళ్తాను అని రాజ్ అంటాడు. మా వదినకు హార్ట్ స్ట్రోక్ వచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చేలా ఉందిరా అని రుద్రాణి అంటుంది. నాకు ఆల్రెడీ వచ్చేసినట్లే ఉంది మమ్మీ అని రాహుల్ అంటాడు. పంతులు గారు పూజ ఎంతసేపు పడుతుందని అపర్ణ అడిగితే.. గంట పడుతుందని పంతులు అంటాడు. అంతసేపు కూర్చోవడం నా వల్ల కాదని అపర్ణ అంటుంది. అమ్మ ఇది మీ ఆరోగ్యం కోసం చేస్తున్న పూజ. మీరే కూర్చోవాలి. లేదా మీ భర్త కూర్చోవాలి అని పంతులు అంటాడు.
సుభాష్ వచ్చి పీటలపై కూర్చుంటాడు. అత్తయ్య గారు.. నన్ను చావు చివరి అంచులవరకు తీసుకెళ్లిన మనిషి పూజలో కూర్చోవడం ఏంటీ. అవసరం అయితే నేను చచ్చిన పర్వాలేదు. ఈ పూజను ఆపించేయండి అని అపర్ణ ఆవేశంగా అంటుంది. మధ్యలో పూజ వదిలేస్తే ఇంకా అశుభం అని ఇందిరాదేవి అంటుంది. అది భగవంతుని దృష్టిలో అపరాధం అయితే ఆ శిక్ష నాకే వేయమని దేవుడుని కోరుకుంటాను అని అపర్ణ అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
అపర్ణతో సుభాష్
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో పాపాలు చేసిన వాళ్లు ఇలాంటి పుణ్యకారాలు చేసేందుకు అర్హత పోగొట్టుకున్నారు అని అపర్ణ అనడంతో సుభాష్ పూజలో కూర్చోవట్లేదు అని వెళ్లిపోతాడు. మీరు అత్తయ్యతో ధైర్యంగా మాట్లాడి మీ మనసులోను భారాన్ని చెప్పండి. మిమ్మల్ని క్షమిస్తారు అని కావ్య అంటుంది. దాంతో అపర్ణతో మాట్లాడేందుకు సుభాష్ వెళ్లి పక్కన కూర్చుంటాడు. అపర్ణ మొహం పక్కకు తిప్పుకుంటుంది.
టాపిక్