తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood Big Flops In 2022: భారీ హైప్.. కట్ చేస్తే పక్కా ఫ్లాప్.. ఈ ఏడాది బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టిన సినిమాలివే..!

Tollywood Big Flops in 2022: భారీ హైప్.. కట్ చేస్తే పక్కా ఫ్లాప్.. ఈ ఏడాది బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టిన సినిమాలివే..!

26 December 2022, 6:48 IST

    • Tollywood Big Flops in 2022: టాలీవుడ్‌లో ఈ ఏడాది విజయాలతో పాటు పరాజయాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఆచార్య, రాధేశ్యామ్, లైగర్ లాంటి భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుని భారీ ఫ్లాప్‌ను చవిచూశాయి.
ఈ ఏడాది బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టిన సినిమాలు
ఈ ఏడాది బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టిన సినిమాలు

ఈ ఏడాది బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టిన సినిమాలు

Tollywood Big Flops in 2022: ఏ రంగంలోనైనా జయపజయాలు సాధారణమే. విజయం సాధించినప్పుడు పొంగిపోవడం, పరాజయం ఎదురైనప్పుడు కుంగిపోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే సక్సెస్ పలకరించే లోపే ఫెయిల్యూర్ టాటా చెప్పి వెళ్లిపోతుందని ఓ సినీ కవి చెప్పినట్లు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్లిపోవడమే జీవిత ప్రయాణం. ముఖ్యంగా చిత్రసీమలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఏడాది విడుదలైన మన కొన్ని సినిమాలు సూపర్ విజయాన్ని అందుకుంటే.. కొన్ని మాత్రమే చేదు ఫలితాన్ని చవిచూశాయి. అందులోనూ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కొంతమంది స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. ప్రభాస్, చిరంజీవి, విజయ్ దేవరకొండ, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. మరి అవేంటో ఓ సారి క్లుప్తంగా చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Single Screen Theatres: సినీ ల‌వ‌ర్స్‌కు షాక్‌ - తెలంగాణ‌లో ప‌ది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మూత - కార‌ణం ఇదే

Rajinikanth: ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌తో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియ‌న్ మూవీ తీయోచ్చు - ద‌ళ‌ప‌తి విజ‌య్ రికార్డ్ బ్రేక్‌

Satya OTT: ఓటీటీలోకి నెలకాకముందే తమిళ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్.. అందులో ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

Krishna mukunda murari serial today: కృష్ణకి షాకుల మీద షాకులు ఇస్తున్న మీరా.. ఆదర్శ్, ముకుంద పెళ్ళికి ముహూర్తం ఫిక్స్

ఖిలాడీ..

ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన మాస్ మహారాజా రవితేజ ఖిలాడీ చిత్రం బాక్సాఫీస్ ముందు పరాజయాన్ని చవిచూసింది. క్రాక్ లాంటి సూపర్ హిట్టు తర్వాత రవితేజ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వసూళ్లపరంగా పెద్దగా ప్రభావం చూపని ఈ సినిమా చేదు ఫలితాన్ని అందుకుంది. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా చేశారు.

రాధే శ్యామ్..

ఈ ఏడాది వచ్చిన అత్యంత భారీ పరాజయాల్లో రాధేశ్యామ్ ఒకటిగా నిలిచింది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరెకెక్కిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్లాపుల్లో ఒకటిగా నిలిచింది. తొలి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై ట్రోల్స్ కూడా విపరీతంగా వచ్చాయి. పెట్టిన బడ్జెట్‌లో కలెక్షన్లు కూడా పూర్తి స్థాయిలో రాబట్టుకోలేక బాక్సాఫీస్ ముందు డీలా పడింది. పూజా హెగ్డే హీరోయిన్‍‌గా నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.

ఆచార్య..

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ ఫ్లాపుల్లో ఒకటిగా నిలిచిన సినిమా ఆచార్య. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడంతో అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే బాక్సాఫీస్ ముందు మాత్రం ఈ సినిమా వారిని తీవ్రంగా నిరాశ పరిచింది. కంటెంట్‌లో ధమ్ము లేకపోతే స్టార్ హీరోలు కూడా ఏం చేయలేరనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఎంతలా అంటే ఈ సినిమా విడుదల తర్వాత చిరంజీవి సైతం ఈ మూవీ టాపిక్‌ను తీసుకొచ్చేందుకు వెనకడుగు వేశారంటే అర్థం చేసుకోవచ్చు. కొరటాల శివతో పాటు సినిమాలో పాదఘట్టం, ధర్మస్థలి అనే పేర్లను తీవ్రంగా ట్రోల్ చేశారు నెటిజన్లు.

రామారావు ఆన్ డ్యూటీ..

ఈ ఏడాది రవితేజకు వచ్చిన రెండో ఫ్లాప్ రామారావు ఆన్ డ్యూటీ. రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.4 కోట్లు కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాల అంచనా. పేలవమైన కథాంశంతో అసంబద్ధమైన కథనంతో సినిమా పూర్తిగా నిరాశకు గురిచేసింది. రవితేజ లాంటి హీరో ఈ సినిమాను ఎంచుకోవడం రిస్కేనని చెప్పాలి. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా చేశారు.

లైగర్..

విజయ్ దేవరకొండ తొలి పాన్ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. విడుదలైన తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందు చిత్రబృందం విరివిగా ప్రమోషన్లు నిర్వహించడమే కాకుడా సినిమాపై హైప్ పెంచారు. వారి హంగామా కారణంగా లైగర్ నిజంగా అధ్భుతంగా ఉంటుందోమోనని వెళ్లిన ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. విజయ్, పూరి జగన్నాథ్ కెరీర్‌లో ఘోరమైన ఫ్లాప్‌ను సొంతం చేసుకుంది. కథలో సత్తా లేకపోవడం, పైపెచ్చు బాలీవుడ్ ప్రేక్షకుల కోసమే సినిమా తీసినట్లు ఉండటంతో నెగిటివిటీ ఎక్కువగా వచ్చింది. పూరి జగన్నాథ్ అంటేనే డైలాగ్స్‌కు పెట్టింది పేరు. అలాంటిది హీరోకు నత్తి పెట్టడంతో ఆ ముచ్చట కూడా లేకపోవడంతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్‌గా చేసింది.

మాచర్ల నియోజకవర్గం..

యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. టీజర్, ట్రైలర్‌తో ఆడియెన్స్‌ను ఆకర్షించిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. స్టోరీలైన్‌లో ఎలాంటి వైవిధ్యం లేకపోవడం, కథనం మూసగా ఉండటం లాంటి కారణాల వల్ల ఈ సినిమా థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ది వారియర్..

ఇస్మార్ట్ శంకర్ చిత్రం సరైన హిట్ కోసం చూస్తున్నాడు హీరో రామ్ పోతినేని. ఆ కోవలోనే ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ది వారియర్ చిత్రం బాక్సాఫీస్ బాంబ్‌గా నిలిచింది. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాత సినిమాలన్నింటినీ కలిపి కొట్టినట్లుగా అనిపిస్తుంది. పదేళ్ల క్రితమే ఇలాంటి సినిమాలకు తెలుగు ప్రేక్షకులు డిస్ కనెక్ట్ అయ్యారు. మళ్లీ అదే తరహాలో పాత మూస పద్ధతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకుల ఆదరణ నోచుకోలేదు. చాలా మందికి అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదలైంది కూడా తెలియదు.

ఇవి కాకుండా నాగ చైతన్య నటించిన థ్యాంక్యూ, వరుణ్ తేజ్ గని, నాగార్జున నటించిన ది ఘోస్ట్ లాంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. ఎన్నో అంచనాల నడుమ విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం