తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kangana Ranaut: ఎమర్జెన్సీ మూవీ ఎఫెక్ట్.. బంగ్లాని రూ.32 కోట్లకి అమ్మేసిన కంగనా రనౌత్

Kangana Ranaut: ఎమర్జెన్సీ మూవీ ఎఫెక్ట్.. బంగ్లాని రూ.32 కోట్లకి అమ్మేసిన కంగనా రనౌత్

Galeti Rajendra HT Telugu

10 September 2024, 14:39 IST

google News
  • Kangana Ranaut Bungalow: బీజేపీ ఎంపీగా గెలిచిన తర్వాత సినిమాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆమె నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ విడుదల వాయిదా పడిపోయిన విషయం తెలిసిందే.

కంగనా రనౌత్
కంగనా రనౌత్ (HT File Photo)

కంగనా రనౌత్

బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబయియి బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న తన బంగ్లాను రూ.32 కోట్లకు విక్రయించేసింది. ఈ మేరకు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి. కంగనా నటించి, నిర్మించిన ఎమర్జెన్సీ మూవీ వివాదాలతో రిలీజ్ కావడం లేదు. దాంతో ఈ సినిమాకి ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా ఉన్న కంగనా ఆర్థిక సమస్యలను అధిగమించడానికి బంగ్లాని అమ్మేసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ బంగ్లాను కంగనా రనౌత్ 2017 సెప్టెంబర్‌లో రూ.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లలో ఉంది. 3,075 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాలో 565 చదరపు అడుగుల పార్కింగ్ స్థలం కూడా ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీగా కూడా గెలుపొందిన కంగనా.. సినిమాల్లోనూ బిజీగా ఉంది. కానీ ఎమెర్జెన్సీ మూవీ విడుదల ఆగిపోవడంతో ఆమెని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినట్లు కనిపిస్తున్నాయి.

1975‌లో భారత్‌లో విధించిన అత్యవసర పరిస్థితిని ఆధారంగా చేసుకుని ఎమర్జెన్సీ మూవీని కంగనా నిర్మించింది. ఇందులో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రని కంగనా పోషించింది. కానీ వివాదాస్పద అంశాలు అందులో ఉన్నాయని మూవీకి తొలుత సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. ఆ తర్వాత యూ/ఏ వచ్చినట్లు ప్రచారం జరిగినా.. వాయిదా మాత్రం తప్పలేదు. సెన్సార్‌ బోర్టు సర్టిఫికెట్‌ ఇవ్వకపోడంతో సెప్టెంబరు 6న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.

బంగ్లాని తమిళనాడు వ్యక్తి కొనుగోలు

కంగనా బంగ్లా అమ్మకానికి సంబంధించిన లావాదేవీలు సెప్టెంబర్ 5న జరిగినట్లు తెలుస్తోంది. రూ .1.92 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ .30,000 రిజిస్ట్రేషన్ ఫీజుని చెల్లించినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఆ బంగ్లాను కొనుగోలు చేసిన వ్యక్తి తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కమలిని హోల్డింగ్స్ భాగస్వామి శ్వేతా బతిజా అని రికార్డుల్లో ఉంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్ 2024, మే నెలలో తనకి రూ.28.7 కోట్ల చరాస్తులు, రూ.62.9 కోట్ల స్థిరాస్తులతో సహా రూ.91 కోట్లకు పైగా ఆస్తులను ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. ఇందులో ఆ బంగ్లా వివరాలు కూడా ఉన్నాయి.

పాలి హిల్‌తో బాలీవుడ్‌కి కనెక్షన్

పాలి హిల్ చాలా పాపులర్ ఏరియా. అక్కడ అనేక మంది బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్స్, నటులకి హీరోలు, విల్లాలు ఉన్నాయి. చదరపు అడుగు ధర రూ.లక్ష కంటే ఎక్కువ ఉంటుందని స్థానిక బ్రోకర్లు చెబుతున్నారు. పాలి హిల్‌లో అమీర్ ఖాన్, సంజయ్ దత్ వంటి అనేక మంది బాలీవుడ్ స్టార్‌లు నివాసం ఉంటున్నారు.

2020 సెప్టెంబరులో బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) బాంద్రాలోని పాలి హిల్‌లో అనధికారిక నిర్మాణం జరిగిందనే కారణంతో కంగనాకి చెందిన స్థలంలోని కట్టడాన్ని పాక్షికంగా కూల్చివేశారు. కానీ ఆ తర్వాత ఆ వివాదం సమసిపోయింది. ఆ తర్వాత కంగనా రనౌత్ ముంబయిలోని అంధేరి ప్రాంతంలో రూ.1.56 కోట్లతో కార్యాలయానికి స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆర్క్ వన్ అనే భవనంలోని 19వ అంతస్తులో 407 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని చదరపు అడుగు రూ.38,391 చొప్పున కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లలో ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం