Actor Suriya: ఈ విషాన్ని ఇంకెన్నాళ్లు తాగుతారు?: తమిళనాడు ప్రజలకు సూర్య బహిరంగ లేఖ వైరల్-actor suriya writes letter to tamilnadu people after kallakuruchi hooch tragedy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Actor Suriya: ఈ విషాన్ని ఇంకెన్నాళ్లు తాగుతారు?: తమిళనాడు ప్రజలకు సూర్య బహిరంగ లేఖ వైరల్

Actor Suriya: ఈ విషాన్ని ఇంకెన్నాళ్లు తాగుతారు?: తమిళనాడు ప్రజలకు సూర్య బహిరంగ లేఖ వైరల్

Hari Prasad S HT Telugu

Actor Suriya: తమిళనాడులోని కల్లకురిచిలో కల్తీ మద్యం తాగి 47 మంది మరణించిన విషాదంపై నటుడు సూర్య శివకుమార్ స్పందించాడు. ఈ విషాన్ని ఇంకెన్నాళ్లు తాగుతారంటూ అతడు అక్కడి ప్రజలు, ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశాడు.

ఈ విషాన్ని ఇంకెన్నాళ్లు తాగుతారు?: తమిళనాడు ప్రజలకు సూర్య బహిరంగ లేఖ వైరల్

Actor Suriya: తమిళ స్టార్ హీరో సూర్య శుక్రవారం (జూన్ 21) సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ రాష్ట్రంలోని కల్లకురిచిలో కల్తీ మద్యం తాగి 47 మంది మరణించిన విషాదంపై అతడు స్పందించాడు. మందు పేరుతో విషాన్ని తాగుతున్నారని, ఇంకా ఎంతకాలం ఇలా చేస్తారంటూ అతడు నిలదీశాడు. దీనిపై ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించి.. కఠిన చట్టాలు చేయాలని కోరాడు.

సూర్య ఏమన్నాడంటే?

గురువారం (జూన్ 20) తమిళనాడులోని కల్లకురిచిలో నకిలీ మద్యం తాగి సుమారు 47 మంది మృత్యువాత పడటం, మరో 100 మంది వరకు తీవ్ర అస్వస్తతకు గురవడం దేశాన్ని షాక్ కు గురి చేసింది. దీనిపై సూర్య సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఓ పెద్ద లేఖను రిలీజ్ చేశాడు. అందులో ప్రజలు, ప్రభుత్వానికి ముఖ్యమైన సూచన చేశాడు.

ఇంకెన్నాళ్లీ విషం తాగుతారు?

ఆ లేఖలో అతడు ఏమన్నాడంటే.. "ఒక చిన్న పట్టణంలో వరుసగా 50 మరణాలు అనేది తుఫానులు, వర్షాలు, వరదలు వంటి విపత్తుల సమయంలో కూడా జరగని విషాదం. ఇంకా వంద మందికి పైగా ఆస్పత్రిలోనే ఉండడం కలకలం రేపుతోంది. వరుస మరణాలు, బాధితుల రోదనలు హృదయాన్ని కలచివేస్తున్నాయి.

తమ వారిని కోల్పోయి విలపిస్తున్న వారిని ఏ పదాలతో ఓదార్చాలి? ఇప్పుడు రాజకీయ పార్టీలు, ఉద్యమాలు, మీడియా, ప్రజలు.. ఇలా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగం సత్వరమే చర్యలు చేపట్టి జరిగిన నష్టాన్ని తగ్గించడానికి కృషి చేస్తుండటం ఓదార్పునిస్తోంది. కానీ దీర్ఘకాలిక సమస్యకు ఇలాంటి స్వల్పకాలిక పరిష్కారం కచ్చితంగా పనిచేయదు.

గతేడాది విల్లుపురం జిల్లాలోనూ ఇలాగే విషంలాంటి కల్తీ మద్యం తాగి 22 మంది చనిపోయారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు పొరుగు జిల్లాలోనూ అదే విషపూరితమైన మద్యం మిథనాల్ కలిపి తాగి మూకుమ్మడిగా మృత్యువాత పడుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి మార్పు రాకపోవడం చాలా బాధాకరం.

మద్యపానం సమాజానికి ప్రమాదం

తమ బతుకులు బాగుపడాలని ఓట్లు వేసే తమిళనాడు ప్రజలు.. ఇరవై ఏళ్లకు పైగా మనల్ని పాలించిన ప్రభుత్వాలు TASMAC పెట్టి బలవంతంగా తాగిస్తున్న దుస్థితిని నిత్యం చూస్తూనే ఉన్నారు. మద్యపాన విధానం అనేది అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో నినాదంగా మాత్రమే పనికొస్తోంది.

టాస్మాక్‌లో రూ. 150 తాగే మందుబాబులు.. డబ్బులు లేనప్పుడు రూ. 50లకు విషం కొని తాగుతున్నారు. మద్యపానం చేసేవారి సమస్య వ్యక్తిగత సమస్య కాదని, ప్రతి కుటుంబానికి, మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య అని మనమందరం ఎప్పుడు గ్రహిస్తాము? మద్యపానాన్ని ప్రోత్సహిస్తూ సొంత ప్రజలపై ఏళ్ల తరబడి చేస్తున్న హింసను ప్రభుత్వాలు వెంటనే ఆపాలి.

మద్యానికి బానిసైన వారిని ఆ ఊబిలో నుంచి బయటపడేయడానికి ప్రతి జిల్లాలో పునరావాస కేంద్రాలు ప్రారంభించాలి. విద్యార్ధుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం దార్శనికతతో కూడిన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లే, మద్యపాన వ్యసనపరుల పునరావాసానికి కూడా ఆదర్శప్రాయమైన కార్యక్రమాలను రూపొందించి ఉద్యమంలా అమలు చేయాలి.

ప్రభుత్వం, రాజకీయ పార్టీలు దూరదృష్టితో వ్యవహరిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి విషాద మరణాలను అరికట్టవచ్చు. గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి స్వల్పకాలిక పరిష్కారాన్ని ఆమోదించిన తర్వాత నిషేధ విధానంపై ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారని ప్రజలతో పాటు నేను ఆశిస్తున్నాను. ఇట్లు మీ సూర్య" అని సూర్య ఆ లేఖ చాలా ఘాటుగా ముగించాడు.