Shanmukh | సూర్యను కలుసుకున్న 'సూర్య'.. కంటతడి పెట్టుకున్న షణ్ముఖ్
04 March 2022, 7:31 IST
- తన అభిమాన కథానాయకుడిని కలుసుకున్న ఆనందంలో కంటతడి పెట్టుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. హీరో సూర్యను కలుసుకున్న ఈ యూట్యూబ్ స్టార్.. భావోద్వేగానికి లోనయ్యాడు. సూర్య కూడా షన్నూను బాగా రిసీవ్ చేసుకున్నాడు.
సూర్యతో షణ్ముఖ్
మనం ఎవరినైనా అమితంగా ఇష్టపడుతున్నా, మన మనస్సుకు దగ్గరైన వారు కంటపడినా ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. కొన్నికొన్ని సార్లు తీవ్ర భావోద్వేగానికి కూడా లోనవుతుంటాం. ఆనందం అధికమై కళ్ల నుంచి అది బయటకు వస్తుంది. సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు బిగ్‌బాస్ సీజన్ 5 రన్నర్ షణ్ముఖ్ జశ్వంత్. షన్నూ-దీప్తి మళ్లీ కలిసిపోయారా? దీప్తిని కలుసుకున్నాడా? అనుకుంటే మీరు పొరబడినట్లే.. షణ్ముఖ్ ఆనందానికి కారణం వేరే ఉంది. తన అభిమాన హీరో అయిన సూర్యను కలుసుకున్న క్షణాన ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు. విలక్షణ నటుడు సూర్య అంటే షణ్ముఖ్‌కు ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని బహిరంగంగానే పలుమార్లు చెప్పాడు ఈ యూట్యూబ్ స్టార్.
సూర్య తాజా చిత్రం ఈటీ మార్చి 10న విడుదల కాబోతున్న తరుణంలో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఓ హోటెల్‌లో దిగిన సూర్య.. అక్కడ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో అక్కడున్న షణ్మఖ్.. తన అభిమాన కథానాయకుడిని చూసి ఆనందంతో పరవశించిపోయాడు. ఆ కార్యక్రమం ముగిసే వరకు అక్కడే ఉండిపోయాడు. సూర్య కూడా షణ్ముఖ్‌ను గమనించి.. మీడియాతో మాట్లాడటం పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా వెళ్లి అతడిని కలిశారు.
తాను మీకు పెద్ద అభిమానిననంటూ తనను తాను సూర్యకు పరిచయం చేసుకున్నాడు షన్నూ. సూర్య కూడా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ షన్నూను షేక్ హ్యాండ్ ఇస్తాడు. సూర్యతో కలిసి ఫొటో కూడా దిగుతాడు. తన అభిమాన కథానాయకుడిని అనుకోకుండా కలుసుకోవడం, ఆయన కూడా అంతే చక్కగా రిసీవ్ చేసుకోవడంతో షణ్ముఖ్ ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి. వెంటనే ఎమోషనలై కన్నీళ్లు పెట్టుకున్నాడు. షన్నూ భావోద్వేగం చెందడం గమనించిన హీరో సూర్య కూడా భుజం తట్టి కౌగిలించుకుని సర్దిచెబుతారు.
సూర్యతో తాను దిగిన ఫొటోలను షణ్ముఖ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అంతేకాకుండా "నువ్వు ఏం కావాలని కోరుకుంటావో అది దక్కకపోవచ్చు. కానీ మీకు ఏది అవసరమో అది తప్పకుండా దొరుకుతుంది" అని క్యాప్షన్ పెట్టాడు. బిగ్‌బాస్ సీజన్5 రన్నరప్ నిలిచిన షణ్మఖ్‌కు ఇటీవల కాలంలో పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. బిగ్‌బాస్ షోలో సిరితో రిలేషన్ కారణంగా బయటకు అతడికి బాగా నెగటివిటీ వచ్చింది. అనంతరం అతనికి అండగా నిలిచిన దీప్తి కూడా బ్రేకప్ చెప్పింది. ఆ బాధ నుంచి షన్నూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
టాపిక్