తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shanmukh| దీప్తితో బ్రేకప్‌కు సిరి కారణం కాదు.. తప్పంతా నాదే: షణ్ముఖ్

Shanmukh| దీప్తితో బ్రేకప్‌కు సిరి కారణం కాదు.. తప్పంతా నాదే: షణ్ముఖ్

HT Telugu Desk HT Telugu

15 February 2022, 8:21 IST

google News
    • దీప్తితో బ్రేకప్ అవ్వడానికి గల కారణాన్ని షణ్ముఖ్ చెప్పేశాడు. అంతేకాకుండా బిగ్‌బాస్‌ హౌస్‌లో సిరితో చనువుగా ఉండటం వ్యతిరేకతను తీసుకొచ్చిందని స్పష్టం చేశాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
షణ్ముఖ్-దీప్తి
షణ్ముఖ్-దీప్తి (Instagram)

షణ్ముఖ్-దీప్తి

సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య లాంటి వెబ్ సిరీస్‌ల్లో తన నటనతో మెప్పించిన షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్‌లో అతడికుంటే క్రేజ్ అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ సీజన్5 రన్నరప్‌గా నిలిచిన షణ్నూ.. ఆ షోలో ఉన్నప్పుడు ఎంతో నెగటివిటీ ఎదుర్కొన్నాడు. యూట్యూబ్‌ సిరీస్‌లతో ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో, బిగ్‌బాస్‌ షోలో సహా కంటెస్టెంట్ సిరితో సాన్నిహిత్యం ద్వారా అంతే వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. చివరకు బిగ్‌బాస్-2 కంటెస్టెంట్ దీప్తి కూడా బ్రేకప్‌ చెప్పేసింది. తాజాగా ఈ విషయంపై షణ్ముఖ్ స్పందించాడు. ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

"బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు సిరితో చనువుగా ఉండటమే ప్రజల్లో నాపై వ్యతిరేకతను తీసుకొచ్చిందని నేననుకుంటున్నా. ఎందుకంటే అప్పటికే నేను దీప్తితో, సిరి శ్రీహాన్‌తో రిలేషన్‌లో ఉన్నాం. హౌస్‌లో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఫలితంగా నెగటివిటీ వచ్చింది." అని అన్నాడు.

సిరి వాళ్లమ్మ అలా అనడం బాధించింది: షణ్ముఖ్

"ఓ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చారు. అదే సమయంలో సిరి వాళ్లమ్మ హౌస్‌లోకి వచ్చి.. షణ్మఖ్ మా అమ్మాయిని ప్రతిసారీ హగ్ చేసుకోవడం నాకే మాత్రం నచ్చలేదని అందరి ముందు అన్నారు. ఇంటి సభ్యులందరి ముందు ఆమె అలా మాట్లాడటం నాకు నచ్చలేదు. నిజం చెప్పాలంటే ఎంతో బాధించింది. నా దృష్టిలో సిరి ఎప్పుటికీ ఓ స్నేహితురాలు మాత్రమే. హౌస్‌లో తనను ఎవరైనా ఏమైనా అంటే నేను సపోర్ట్‌గా ఉండే వాడిని. కానీ అవన్నీ మర్చిపోయి వాళ్లమ్మ నా గురించి తప్పుగా అర్థం చేసుకోవడం తట్టుకోలేకపోయాను." అని షణ్ముఖ్ తెలిపాడు.

బ్రేకప్‌కు ఎన్నో కారణాలున్నాయి..

"దీప్తి-నేనూ విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగటివిటీని ఎదుర్కొంది. నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు కూడా నాకే సపోర్ట్ చేసింది. కానీ సిరితో నేను చనువుగా ఉండటం బయటవాళ్లకు ఎలా నచ్చలేదో, అదే మాదిరిగా దీప్తి కుటుంబానికి కూడా నచ్చలేదు. ఫలితంగా ఆమెపై ఒత్తిడి పెరిగింది. ఇకనైనా తను సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరం కెరీర్‌పై దృష్టి పెట్టాం. మేమిద్దరం మళ్లీ కలుస్తామా? లేదా అనేది దేవుడు చేతుల్లో ఉందే. అంతేకానీ మా బ్రేకప్‌కు సిరిని నిందించడం సరికాదు. తప్పు నాదే కాబట్టి నన్నే నిందించాలి." అని షణ్ముఖ్ స్పష్టం చేశాడు.

ప్రస్తుతం షణ్ముఖ్ ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. అదే ఏజెంట్ ఆనంద్ సంతోష్. త్వరలోనే ఇది విడుదల కానుంది. సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య లాంటి సిరీస్‌లు రూపొందించిన సుబ్బునే దీన్ని రాశాడు. ఇన్ఫినిటీ మీడియా నిర్మిస్తోంది. ఇటీవలే ఓ డ్యాన్స్ షో‌లో కనిపించిన షణ్నూ.. అద్భుతమైన స్టెప్పులతో అలరించాడు. 

 

తదుపరి వ్యాసం