AR Rahman AI Voice: చనిపోయిన సింగర్స్ వాయిస్‌తో రెహమాన్ ఏఐ క్రియేషన్.. సూపర్ స్టార్ సినిమా కోసం..
30 January 2024, 15:27 IST
- AR Rahman AI Voice: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా చనిపోయిన సింగర్స్ వాయిస్ తో పాట పాడించాడు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ కోసం ఇలా చేసినట్లు అతడు వెల్లడించాడు.
మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్
AR Rahman AI Voice: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్ లో మరో ప్రయోగం చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో దివంగత సింగర్స్ బంబా బాక్యా, షాహుల్ హమీద్ ల వాయిస్ ను రీక్రియేట్ చేశాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీలోని తిమిరి యెరుడా అనే సాంగ్ కోసం రెహమాన్ ఈ పని చేయడం గమనార్హం. అయితే వాళ్ల కుటుంబాల అనుమతి తీసుకొని, తగిన రెమ్యునరేషన్ ఇచ్చిన తర్వాతే ఈ పని చేసినట్లు అతడు చెప్పాడు.
రెహమాన్ ఏఐ అద్భుతం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రస్తుతం ఎన్నో ఊహించని అద్భుతాలు సాధ్యమవుతున్నాయి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా అలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేశాడు. అదే ఏఐని ఉపయోగించి ఇప్పటికే చనిపోయిన సింగర్స్ వాయిస్ ను రీక్రియేట్ చేశాడు. అది కూడా రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ కోసం కావడం విశేషం.
ఈ విషయాన్ని రెహమానే మంగళవారం (జనవరి 30) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. "వాళ్ల కుటుంబాల నుంచి అనుమతి తీసుకున్నాం. అంతేకాదు వాళ్లకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ను కూడా వారికి పంపించాం. సరిగ్గా వాడితే టెక్నాలజీ ఏమీ ముప్పు, న్యూసెన్స్ కాదు" అని రెహమాన్ అన్నాడు.
రెహమాన్ ఏఐపై మిక్స్‌డ్ రియాక్షన్
ఏఆర్ రెహమాన్ ఏఐ ఉపయోగించి దివంగత సింగర్స్ వాయిస్ రీక్రియేట్ చేయడంపై ఇంటర్నెట్ లో మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు ఆ వాయిస్ మళ్లీ వినడం మెస్మరైజింగ్ గా ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం ఇది చాలా ప్రమాదకరమైన సాంప్రదాయానికి నాంది పలకడం అవుతుందని అనడం గమనార్హం. ఓ యూజర్ నేరుగా రెహమాన్ ట్వీట్ ను తప్పుబట్టాడు.
"మీలాంటి వారి నుంచి ఇలాంటిది రావడం చాలా ప్రమాదకరమైన సాంప్రదాయానికి తెరలేపడం అవుతుంది. దీనికి నోస్టాల్జియా హ్యాష్ ట్యాగ్ ఎందుకు. అదే నోస్టాల్జియా కావాలనుకుంటే మేము నేరుగా వాళ్లు పాడిన అప్పటి పాటలను వింటాము. ఈ ఏఐ ఎందుకు" అని ఓ యూజర్ ప్రశ్నించాడు. లేని వాళ్ల వాయిస్ ఇలా ఉపయోగించడం సరికాదని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు కొందరు ఇంటర్నెట్ యూజర్లు మాత్రం రెహమాన్ క్రియేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నువ్వు తప్ప ఇలాంటి అద్భుతమైన ఆలోచన మరెవరూ చేయలేరని ఓ యూజర్ అన్నాడు. దివంగత సింగర్స్ వాయిస్ లో మరోసారి వినడం చాలా బాగుందని మరో యూజర్ కామెంట్ చేశాడు.
బంబా బాక్యా గతంలో రెహమాన్ తో కలిసి ఎన్నో పాటలు పాడాడు. అతడు 2022లో గుండెపోటుతో కన్నుమూశాడు. ఇక మరో సింగర్ షాహుల్ హమీద్ 1997లో చెన్నైలో ఓ కారు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఇద్దరు సింగర్ల వాయిస్ ను ఇప్పుడు లాల్ సలామ్ మూవీ కోసం ఏఆర్ రెహమాన్ మరోసారి ఏఐ సాయంతో వాడుకున్నాడు. రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది.