Anushka Sharma | క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్న అనుష్కశర్మ... గ్రౌండ్‌లోకి దిగడానికి సిద్ధం..
11 March 2022, 16:35 IST
భర్త విరాట్ కోహ్లి అడుగుజాడల్లోనే నడవనుంది అతడి భార్య, బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మ. క్రికెటర్‌గా మారబోతున్నది. ఆమె క్రికెటర్‌గా ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏమిటంటే...
అనుష్క శర్మ
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి బాటలోనే అడుగులు వేసేందుకు అతడి సతీమణి అనుష్క శర్మ సిద్ధమవుతోంది. గ్రౌండ్‌లో దిగి ఫోర్లు, సిక్సర్లు కొట్టేందుకు రెడీ అవుతోంది. అయితే ఇవన్నీ రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో మాత్రమే. టీమ్ ఇండియా ఉమెన్ క్రికెటర్ జులాన్ గోస్వామి జీవితం ఆధారంగా ‘చక్ దా ఎక్స్‌ప్రెస్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో జులాన్ గోస్వామి పాత్రలో అనుష్కశర్మ నటింబోతున్నది. ఈ చిత్రం కోసం అనుష్క శర్మ క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయడంలో మెళకువలను నేర్చుకుంటుంది. ప్రాక్టీస్ తాలూకు వీడియోను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ప్రిపరేషన్ చాలా కఠినంగా ఉందని, అయిన ఆపకుండా కొనసాగిస్తున్నట్లు అనుష్కశర్మ పేర్కొన్నది. గెట్ స్వెట్ గో అంటూ క్యాప్షన్ జోడించింది. ఆమె ప్రిపరేషన్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె బ్యాట్ పట్టి షాట్ కొట్టిన తీరు క్లాస్ గా ఉందని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ‘చక్ దా ఎక్స్‌ప్రెస్’ ద్వారా నాలుగేళ్ల విరామం అనంతరం అనుష్కశర్మ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. చివరగా ఆమె షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన ‘జీరో’ సినిమాలో కథానాయికగా నటించింది. కూతురు వామికాకు జన్మనివ్వడంతో సినిమాలకు ఇన్నాళ్లు దూరంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో ‘చక్ దా ఎక్స్‌ప్రెస్’ విడుదలకానుంది. ఈ సినిమాకు పోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కర్ణేష్ శర్మతో కలిసి అనుష్క శర్మ ఈ సినిమాను నిర్మిస్తోంది.