Animal Controversy: యానిమల్ మూవీ చూసి నా కూతురు ఏడ్చింది: కాంగ్రెస్ ఎంపీ ఫైర్
08 December 2023, 12:48 IST
- Animal Controversy: యానిమల్ మూవీ చూసి నా కూతురు ఏడ్చింది అంటూ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి సినిమాలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
యానిమల్ మూవీపై కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ ఆగ్రహం
Animal Controversy: యానిమల్ మూవీ ఓవైపు బాక్సాఫీస్ దగ్గర కోట్ల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాను విమర్శిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. పురుష అహంకారినికి అద్దం పట్టేలా ఆడవాళ్లను ఈ సినిమాలో చూపించిన తీరును తప్పుబడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ అయితే రాజ్యసభలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు.
యానిమల్ సినిమా చూసి తన కూతురు ఏడ్చిందంటూ కాంగ్రెస్ ఎంపీ వెల్లడించారు. సినిమాలో మహిళల పట్ల హింస దారుణంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. "సినిమా సమాజానికి అద్దంలాంటిది. సినిమా చూస్తూనే మనం పెరిగాం. అది యువతను ప్రేరేపించగలదు. గతంలో కబీర్ సింగ్, పుష్పలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు యానిమల్ వచ్చింది. నా కూతురు తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ సినిమా చూడటానికి వెళ్లింది. మధ్యలోనే ఏడుస్తూ బయటకు వచ్చేసింది" అని రాజ్యసభలో ఆమె చెప్పారు.
మహిళల పట్ల హింసను ప్రోత్సహించేలా ఈ సినిమా ఉందని ఆమె విమర్శించారు. "కబీర్ సింగ్ సినిమానే తీసుకోండి. అందులో అతడు తన భార్య, చుట్టు పక్కల మనుషులు, సమాజం పట్ల ఎలా వ్యవహరిస్తాడో చూశాం. సినిమా అతని తీరును సమర్థించేలా ఉంది. యువత అతన్ని రోల్ మోడల్ గా తీసుకుంటోంది. సినిమాల్లో చూసే ఆ హింస సమాజంలోనూ పెరిగిపోతోంది" అని రంజీత్ రంజన్ అన్నారు.
ఇక యానిమల్ మూవీలో సిక్కుల యుద్ధ గీతం అర్జన్ వైలీని ఓ హింసాత్మక సీన్ కోసం వాడుకోవడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. మొఘల్స్, బ్రిటీష్ తో పోరాడిన సిక్కు యోధుల వీరగాధను తెలిపే ఈ పాటను ఓ గ్యాంగ్ వార్ కోసం వాడుకోవడం ఏంటి ఆమె ప్రశ్నించారు. ఇది వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు.
మరోవైపు యానిమల్ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూనే ఉంది. ఇప్పటికే ఆ సినిమా రూ.550 కోట్లు వసూలు చేసింది. రణ్‌బీర్ కపూర్ కెరీర్లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ అయిన సంజూకి కేవలం రూ.20 కోట్ల దూరంలో ఉంది. శుక్రవారం (డిసెంబర్ 8) ఆ రికార్డును బ్రేక్ చేయనుంది.