Aunty Controversy on Anasuya: అనసూయ అన్నంత పని చేసింది.. ఆంటీ అన్నందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన యాంకర్.. ఇదిగో ప్రూఫ్
30 August 2022, 12:20 IST
- బుల్లితెర యాంకర్ అనసూయ తనను ఆంటీ అంటూ దూషించిన వారిపై చర్యలు చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కంప్లైంట్ తాలూకు స్క్రీన్ షాట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
అనసూయ
ప్రముఖ నటి, జబర్దస్త్ ఫేమ్ అనసూయ భరద్వాజ్ వివాదం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై యాంకర్‌గానూ అలిస్తున్న అనసూయను ఇటీవలే సోషల్ మీడియాలో కొంతమంది ఆంటీ అంటూ సంబోధిస్తూ ఆమె హర్ట్ అయ్యేలా వ్యవహరించారు. అంతేకాకుండా ఆమెపై అసభ్యకరమైన కామెంట్లతో టార్గెట్ చేశారు. దీంతో తనపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అప్పుడే చెప్పింది. అయినప్పటికీ ఆమెను అంత త్వరగా విడిచిపెట్టలేదు నెటిజన్లు. ఇంకా రెట్టింపు ట్వీట్లు, కామెంట్లతో నెట్టింట నానా రచ్చ చేశారు. తాజాగా అనసూయ అన్నంత పనిచేసింది. తనను టార్గెట్ చేస్తూ ఆంటీ అంటూ సంబోధించిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆంటీ అంటూ తనను ట్రోలింగ్, మీమ్స్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. ఫిర్యాదుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విటర్ వేదికగా షేర్ చేసింది. "యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు కేసు పెట్టకూడదని అనుకున్నాను. కానీ ఇలా చేయక తప్పట్లేదు. నాకు మద్దతుగా నిలిచిన సైబర్ క్రైమ్ అధికారులకు ధన్యవాదాలు. నన్ను ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకునే ప్రాసెస్ మొదలైంది. అప్డేట్స్ ఇస్తుంటాను. మీరు ఊహించని దానికంటే పెద్దది." అంటూ కంప్లైంట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది అనసూయ.
ఇటీవల అనసూయ చేసిన ట్వీట్ ఇంత దుమారానికి కారణమైంది. “అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా!" అని ఈ నెల 25న అనసూయ ట్వీట్ చేసింది. దీంతో తమ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించే ఈ ట్వీట్ పెట్టిందని అభిప్రాయపడిన ఫ్యాన్స్ ఆంటీ అంటూ అనసూయను దూషించారు. తమ కామెంట్లతో సామాజిక మధ్యామాల్లో విరుచుకుపడ్డారు. ఎంతలా అంటే ఆంటీ అనే హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యేంతగా ట్వీట్లు చేశారు.