Highway Movie Review: హైవే మూవీ రివ్యూ - ఆనంద్ దేవరకొండ హైవే ఎక్కినట్టేనా?
19 August 2022, 11:34 IST
Highway Movie Review: ఆనంద్ దేవరకొండ (Anand deverakonda) హీరోగా సినిమాటోగ్రాఫర్ కె.విగుహన్ (K. V. Guhan)దర్శకత్వంలో రూపొందిన హైవే సినిమా (Highway Movie) ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సైకో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...
ఆనంద్ దేవరకొండ హైవే మూవీ
Highway Movie review: హైవే మూవీ హీరో ఆనంద్ దేవరకొండ తొలిసారిగా దొరసాని సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ తమ్ముడు. అన్న బాటలో కమర్షియల్ మాస్ సినిమాలు కాకుండా కాన్సెప్ట్ బేస్ డ్ స్టోరీస్‌ను ఎంచుకుంటూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. మిడిల్‌క్లాస్ మెలోడీస్, పుష్పకవిమానం సినిమాలతో నటుడిగా పాస్ అయ్యాడు.
అతడు హీరోగా నటించిన తాజా మూవీ హైవే. సైకో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకత్వం వహించాడు. మానస రాధాకృష్ణన్, సయామీఖేర్ (Saiyami Kher) కీలక పాత్రల్లో నటించారు. హైవే మూవీ షూటింగ్ పూర్తయి చాలా రోజులు అయనా కరోన కారణంగా సినిమా రిలీజ్ వాయిదాపడింది. ప్రస్తుతం థియేటర్లలో పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో డైరెక్ట్‌గా ఓటీటీలో హైవే మూవీ రిలీజ్ చేశారు.
శుక్రవారం ఆహా ఓటీటీ (Aha Ott) ద్వారా హైవే మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైవేతో ఆనంద్ దేవరకొండ మెప్పించాడా? 118 తర్వాత దర్శకుడిగా గుహన్‌కు మరోసక్సెస్ దక్కిందా లేదా అన్నది చూద్దాం
విష్ణు - తులసి ప్రేమాయణం
విష్ణు (ఆనంద్ దేవరకొండ) ఓ ఫొటోగ్రాఫర్. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం స్నేహితుడైన సముద్రంతో (సత్య) కలిసి వైజాగ్ నుండి బెంగళూరు బయలుదేరుతాడు. మంగళూరులో ఉన్న తన తండ్రిని కలుసుకోవడానికి తులసి (మానస రాధాకృష్ణన్) ఒంటరిగా బయలుదేరుతుంది. మధ్యలో బస్ మిస్ కావడంతో ఆమెకు విష్ణు లిఫ్ట్ ఇస్తాడు. కొద్ది పరిచయంలోనే తులసితో విష్ణు ప్రేమలో పడతాడు.
మరోవైపు హైదరాబాద్ నగరంలో ఓ సైకో కిల్లర్ (అభిషేక్ బెనర్జీ) వరుసగా యువతులను హత్య చేస్తుంటాడు. అతడిని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ ఆశా భరత్ (సయామీ ఖేర్) ప్రయత్నిస్తుంటుంది. పోలీస్ నిఘా పెరిగిపోవడంతో సైకో కిల్లర్ బెంగళూరు పారిపోవాలని అనుకుంటాడు.
మార్గమధ్యంలో అతడికి తులసి కనిపించడంతో ఆమెను కిడ్నాప్ చేస్తాడు. ఆ సైకో కిల్లర్ బారి నుండి తులసి రక్షించడానికి విష్ణు ఎలాంటి సాహసం చేశాడు? పోలీస్ ఆఫీసర్‌తో కలిసి విష్ణు అతడిని పట్టుకున్నాడా? తులసిని ఆ సైకో కిల్లర్ చంపేశాడా లేదా అన్నదే హైవే సినిమా ఇతివృత్తం.
Highway movie: సైకో కిల్లర్ కథ…
సైకో కిల్లర్ కథాంశాలతో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు లెక్కకుమించిన సినిమాలొచ్చాయి. ఆ కాన్సెప్ట్‌ను అన్ని రకాలుగా వండి పీల్చి పిప్పిచేశారు. ఆ జానర్‌లో కొత్తగా చూపించడానికి ఏం లేకపోవడంతో కొన్నేళ్లుగా దర్శకులెవరూ సైకో కిల్లర్ కథల జోలికి వెళ్లడం లేదు. ఎవరూ టచ్ చేయడం లేదు కాబట్టే తాను సైకో కిల్లర్ కథను ఎంచుకొని సినిమా చేయాలని కె.వి. గుహన్ అనుకున్నట్లున్నాడు.
ఓల్డ్ స్టైల్ లో...
పేరుకు ఇది 2022 లో తీసిన సినిమానే అయనా రాత, తీతలో మాత్రం 2000 దశకంలోనే ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. సైకో కిల్లర్ జానర్ లో 2010 టైమ్ లో వచ్చిన కొరియన్ సినిమా ఐ సా ది డెవిల్ ను మరోసారి చూసిన భయం కలుగుతుంది. కానీ హైవే మాత్రం ఒక్కసారి కంప్లీట్ చేయడానికే నీరసం ముంచుకొచ్చేస్తుంది.
కన్ఫ్యూజన్ లో పడిపోయి..
హీరోహీరోయిన్లు, సైకో కిల్లర్, అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించే లేడీ పోలీస్ ఆఫీసర్ అంటూ నాలుగు పాత్రలను భిన్నమైన నేపథ్యాలతో పరిచయం చేయడం వరకు సినిమా ఓకే అనిపిస్తుంది. ఆ తర్వాతే ఎటువైపు నడిపించాలో తెలియని అయోమయంలో హైవేపై దారి తప్పిన వెహికిల్‌గా సినిమా ఇష్టానుసారం సాగిపోతుంది
Highway Movie: సెంటిమెంట్ పండలేదు
హీరోయిన్ క్యారెక్టర్ నుండి సెంటిమెంట్ డ్రామాను పండిస్తూ సింపథీని క్రియేట్ చేయాలని దర్శకుడు అనుకున్నాడు. వర్కవుట్ కాలేదు. పోలీస్ ఆఫీసర్‌గా సయామీఖేర్ ఇన్వెస్టిగేషన్ కేవలం డైలాగ్స్ వరకే పరిమితమైంది. అప్పుడప్పుడు కనిపిస్తూ రెండు డైలాగ్స్ చెప్పి వెళ్లిపోతుంది. కొన్ని సీన్స్‌లో అయితే ఆమె ఇన్వెస్టిగేషన్ చేయడం కంటే ఆపడమే మంచిదనిపిస్తుంది.
సీరియల్ కిల్లర్ క్యారెక్టరైజేషన్ డబ్బింగ్ సినిమాలోని ఆర్టిస్ట్‌లా తెరపై వచ్చే సీన్‌కు అతడి ఎక్స్‌ప్రేషన్‌కు సంబంధమే ఉండదు. అతడు ఎందుకు హత్యలు చేస్తున్నాడన్నది ఎస్టాబ్లిష్ చేయలేదు. క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది.
ఆనంద్ దేవరకొండ ప్లస్
ఉన్నంతలో ఆనంద్ దేవరకొండ ఒక్కడే కొంతవరకు యాక్టింగ్‌తో మెప్పించాడు. విష్ణుగా అతడి పాత్ర బాగుంది. హీరోయిన్ మానస రాధాకృష్ణన్ తో (Manasa Radhakrishnan)పాటు సయామీఖేర్ యాక్టింగ్ బేసిక్స్ లెవల్ లోనే ఆగిపోయింది.
సైకో కిల్లర్ పాత్రకు అభిషేక్ బెనర్జీ సరిగ్గా కుదరలేదు. థ్రిల్లర్ సినిమాలో కామెడీ అవసరం లేదని అనుకున్నాడో ఏమో దర్శకుడు కమెడియన్ గా కేవలం సత్యను మాత్రమే తీసుకున్నాడు. అతడు కూడా నవ్వించకూడదని ఫిక్స్ అయినట్లున్నాడు. ఒక్క సీన్ లో కూడా అతడి కామెడీ వర్కవుట్ కాలేదు.
దర్శకుడిగా విఫలమైన సినిమాటోగ్రాఫర్ గా మాత్రం కె.వి గుహన్ ఆకట్టుకున్నాడు. ప్రతి సీన్ అందంగా తెరకెక్కించాడు. సినిమాల్లో రెండే పాటలు ఉన్నాయి. అవి కూడా సినిమా నిడివిని పెంచడానికే ఉపయోగపడ్డాయి.
ముందుకు కదలదు...
హైవే ప్రయాణం మొత్తం గజిబిజిగా సాగిపోతూ గందరగోళానికి గురిచేస్తుంది. సినిమాలో చాలా సార్లు పల్లెవెలుగు బస్ ను చూపిస్తారు. ఆ తర్వాత అది ముందుకు కదలక మోరాయించినట్లుగా చెబుతారు. ఈసినిమా కూడా అదే ఫీల్ ను కలిగిస్తుంది. నిదానంగా సాగుతూ ఎంతకూ ముందుకు కదలదు.
హైవే మూవీ రేటింగ్ - 2/5