Thirteen Lives Movie Review: థర్టీన్ లైవ్స్ మూవీ రివ్యూ - వాస్తవ ఘటనలకు దృశ్యరూపం-thirteen lives movie review amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thirteen Lives Movie Review: థర్టీన్ లైవ్స్ మూవీ రివ్యూ - వాస్తవ ఘటనలకు దృశ్యరూపం

Thirteen Lives Movie Review: థర్టీన్ లైవ్స్ మూవీ రివ్యూ - వాస్తవ ఘటనలకు దృశ్యరూపం

Nelki Naresh Kumar HT Telugu
Aug 18, 2022 06:13 AM IST

2018లో జరిగిన తామ్ లువాంగ్ గుహల రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన హాలీవుడ్ చిత్రం థర్టీన్ లైవ్స్(Thirteen Lives) ఇటీవల ఆమెజాన్ ప్రైమ్ (Amazon prime video) లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందంటే...

థర్టీన్ లైవ్స్
థర్టీన్ లైవ్స్ (twitter)

Thirteen Lives Movie Review: ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మాటకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణగా నిలుస్తుంది హాలీవుడ్ చిత్రం థ‌ర్టీన్‌లైవ్స్. 2018 ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తామ్ లువాంగ్ గుహ‌ల‌ రెస్క్యూ ఆప‌రేష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో ద‌ర్శ‌కుడు రోన్ హోవార్డ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. య‌థార్థ ఘ‌ట‌న‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ఈ బ‌యోగ్రాఫిక‌ల్ స‌ర్వైవ‌ల్ డ్రామాలో చూపించారు. విగో మోర్ట‌న్‌సెన్‌, కొలిన్ ఫ‌ర్రెల్‌, జోయ‌ల్ ఎడ్గ‌ర్‌ట‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇంత‌కీ ఈ సినిమా క‌థ‌మేమిటంటే

ఫుట్‌బాల్ టీమ్ ఆచూకీ మిస్‌

జూన్ 23 2018లో థాయ్‌లాండ్‌కు 12 మంది ఫుట్‌బాల్ జూనియ‌ర్ టీమ్ మెంబ‌ర్స్ తో పాటు కోచ్ తామ్ లువాంగ్ గుహ‌ల‌ను చూడ‌టానికి వెళ్తారు. భారీ వ‌ర్షం కార‌ణంగా కోచ్‌తో పాటు పిల్ల‌లంద‌రూ గుహ‌లోనే చిక్కుకుపోతారు. వెన‌క్కి వ‌చ్చే దారి క‌నిపించ‌దు. గుహ బ‌య‌ట పార్క్ చేసిన సైకిళ్ల ఆధారంగా వారంద‌రూ లోప‌ల చిక్కుకున్నార‌నే విష‌యం రూడీ అవుతుంది. ఆ పిల్ల‌ల‌ను ర‌క్షించే బాధ్య‌త‌ను థాయ్‌లాండ్ ప్ర‌భుత్వం ఛాలెంజింగ్‌గా తీసుకుంటుంది. రెస్క్యూ ఆప‌రేష‌న్ కోసం థాయ్ నావికాదళం రంగంలోకి దింపుతుంది. గుహ‌లోప‌లివ‌ర‌కు వెళ్ల‌డం వారికి అసాధ్య‌మ‌వుతుంది.

ఆ పిల్ల‌ల‌ను ర‌క్షించ‌డానికి ప్ర‌పంచ దేశాల స‌హాయాన్ని అర్థిస్తుంది థాయ్ లాండ్ గ‌వ‌ర్న‌మెంట్ . దాదాపు ప‌దిహేడు దేశాల‌కు చెందిన ఐదు వేల మంది రెస్క్యూ టీమ్ ఆ ఆప‌రేష‌న్ కోసం థాయ్‌లాండ్ వ‌స్తారు. ప్ర‌జ‌లంద‌రూ స్వ‌చ్ఛందంగా రెస్క్యూ టీమ్‌కు అండ‌గా నిలుస్తారు. కానీ ఎవ‌రూ కూడా పిల్ల ఆచూకీ కనిపిపెట్టలేకపోతారు. ఈ ఆప‌రేష‌న్‌లో బ్రిటీష్ రెస్క్యూ టీమ్ రిచ‌ర్డ్ స్టాంటాన్‌, జాన్ వొలేథాన్ ప్రాణాల‌కు తెగించి ఆ పిల్ల‌ల‌ను కాపాడ‌టానికి ఎలా ప్ర‌య‌త్నాలు చేశారు? ప‌ద్దెనిమిది రోజుల పాటు గుహ‌లోనే చిక్కుకుపోయినా ఆ చిన్నారులు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారా లేదా అన్న‌దే ఈ సినిమా క‌థ‌

స‌ర్వైవ‌ల్ డ్రామా

స‌ర్వైవ‌ల్ డ్రామా జాన‌ర్‌లో హాలీవుడ్ తో పాటు ఇత‌ర భాష‌ల్లో చాలా సినిమాలొచ్చాయి. కానీ వాటికి భిన్నంగా సాగే సినిమా ఇది. ఆరంభం నుంచి ముగింపు వ‌ర‌కు నెక్స్ట్ ఏం జ‌రుగబోతుందోన‌నే ఉత్కంఠ‌ను ప్ర‌తిక్ష‌ణం క‌లిగిస్తుంది. ఫుట్‌బాట్ టీమ్ మెంబ‌ర్స్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌తారా లేదా అనే స‌స్సెన్స్‌ను చివ‌రి వ‌ర‌కు హోల్డ్ చేస్తూ ద‌ర్శ‌కుడు సినిమాను అద్భుతంగా రూపొందించారు.

సందేశంతో...

ఆప‌ద‌లో ఉన్న వారిని చూసి జాలిప‌డ‌టం, సానుభూతి చూప‌డం కాదు సాయం చేయ‌డానికి ముందుకు రావడం ముఖ్య‌మ‌నే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఆవిష్కరించారు. అంతేకాకుండా సాధించాల‌నే తపన, ప‌ట్టుద‌ల‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ని చెప్పారు. ఓ సీన్ లో బ్రిటీష్ రెస్క్యూ మెంబ‌ర్స్ రిచ‌ర్డ్‌, జాన్ ల‌ను ముస‌లివాళ్లు అంటూ థాయ్ నావిక‌ద‌ళం అవ‌హేళ‌న చేస్తుంది. కానీ ప్ర‌పంచంలో ఎవ‌రూ చేయ‌లేని ప‌నిని త‌మ టీమ్ తో క‌లిసి ధైర్యంగా రిచ‌ర్డ్‌, జాన్ ఎలా విజ‌య‌వంతం చేశార‌న్న‌ది ద‌ర్శ‌కుడు స్ఫూర్తిదాయ‌కంగా ఇందులో చూపించారు.

రెస్క్యూ ఆప‌రేష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో

సినిమా మొత్తం రెస్క్యూ ఆప‌రేష‌న్ నేప‌థ్యంలోనే సాగుతుంది. అయినా ఎక్కడ డాక్యుమెంటరీ ఫీల్ రాదు. అంత‌లా ఎగ్జైటింగ్‌గా ద‌ర్శ‌కుడు సినిమాను రూపొందించారు. అలాగ‌ని ఎక్క‌డ లాజిక్‌ల‌కు అంద‌ని స‌న్నివేశాలు ఉండ‌వు. హీరోయిజం వాస‌న‌లు క‌నిపించ‌వు. రియ‌ల్ ఇన్సిడెంట్ కళ్ల ముందు సాక్షాత్కరించిన ఫీలింగ్ క‌లిగేలా స‌హ‌జంగా సినిమా సాగుతుంది. విగో మోర్ట‌న్‌సెన్‌, కొలిన్ ఫ‌ర్రెల్ యాక్టింగ్ బాగుంది. ఆర్ట్‌వ‌ర్క్‌, విజువ‌ల్స్ మెప్పిస్తాయి.

ఫ్రెష్ ఫీలింగ్‌

మూస ధోర‌ణితో కూడిన క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు అల‌వాటుప‌డిన ప్రేక్ష‌కుల‌కు థర్లీన్ లైవ్స్ సినిమా ఫ్రెష్ ఫీలింగ్ ను త‌ప్ప‌కుండా అందిస్తుంది.

IPL_Entry_Point