Allu Arjun Ganesh Visarjan: తన ఆఫీసులోని గణేషునికి బై బై చెప్పిన అల్లు అర్జున్
05 September 2022, 18:04 IST
- Allu Arjun Ganesh Visarjan: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తన గీతా ఆర్ట్స్ ఆఫీసులోని గణేషునికి బై బై చెప్పాడు. ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్‌లు చేస్తూ బొజ్జ గణపయ్యను సాగనంపాడు.
గణేష్ నిమజ్జనంలో కూతురు అర్హతో అల్లు అర్జున్
Allu Arjun Ganesh Visarjan: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ఆగస్ట్ 31న వినాయక చవితి రోజున ఆఫీస్‌లో గణపతిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఆరు రోజుల పాటు అల్లు అర్జున్‌తోపాటు అతని ఆఫీస్‌లోని స్టాఫ్ అంతా ఘనంగా పూజలు చేశారు.
సోమవారం (సెప్టెంబర్ 5) ఆ గణేషున్ని నిమజ్జనం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. స్టాఫ్‌తోపాటు తన కుటుంబం కూడా వెంట రాగా ఊరేగింపుగా వెళ్లి గణపతిని నిమజ్జనం చేయడం విశేషం. ఊరేగింపు సందర్భంగా రోడ్డుపై గణపతి ముందు అర్జున్ స్టెప్పులేశాడు. అతన్ని చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
పూర్తి బ్లాక్ డ్రెస్‌లో అర్జున్ ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు. కూతురు అర్హను ఎత్తుకొని మరీ అతడు డ్యాన్స్ చేశాడు. ఇక ఈ గణేష్ చతుర్థికి ముందు అతని మూవీ పుష్ప స్టైల్లో కొన్ని విగ్రహాలు వెలిసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రతోపాటు ఢిల్లీలాంటి నగరాల్లో పుష్ప స్టైల్ గణేష్ విగ్రహాల ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ అల్లువారబ్బాయి పుష్ప 2 షూటింగ్‌కు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమా ఈ మధ్యే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఆ సమయంలో బన్నీ న్యూయార్క్ టూర్‌లో ఉండటంతో రాలేకపోయాడు. అక్కడ జరిగిన ఇండియా డే పరేడ్‌లో అల్లు అర్జున్ పాల్గొన్న విషయం తెలిసిందే.