Adhrushyam Movie Review: అదృశ్యం రివ్యూ - అపర్ణ బాలమురళి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
09 April 2024, 9:19 IST
Adhrushyam Movie Review: అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించిన అదృశ్యం మూవీ ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి సుధీష్ రామచంద్రన్ దర్శకత్వం వహించాడు.
అదృశ్యం మూవీ రివ్యూ
Adhrushyam Movie Review: అపర్ణ బాలమురళి (Aparna Balamurali) ప్రధాన పాత్రలో నటించిన మలయాళం మూవీ ఇని ఉత్తరమ్...అదృశ్యం పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో సుధీష్ రామచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈటీవీ విన్ (ETV WIN) ఓటీటీలో ఇటీవల రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉందంటే...
జానకి చేసిన మర్డర్...
జానకి గణేషణ్ (అపర్ణ బాలమురళి) ఓ డాక్టర్. ఓ రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన జానకి తన స్నేహితుడు వివేక్‌ను తానే చంపినట్లు సీఐ కరుణన్‌ను ముందు లొంగిపోతుంది. లైంగికంగా వేధించడం వల్లే అతడిని చంపి అడవిలో ఓ చోట పాతిపెట్టినట్లు చెబుతుంది. తొలుత జానకి మానసిక వ్యాధితో బాధపడుతోందని భావించిన సీఐ కరుణన్ ఆమె మాటలను నమ్మడు.
కానీ జానకి హత్య చేసిందనే వార్త మీడియాలో హైలైట్ అవుతుంది. వివేక్‌ను తాను, సీఐ కరుణన్ కలిసి చంపినట్లు మీడియా ముందు చెబుతుంది జానకి. వివేక్‌ను చంపి పాతిపెట్టిన ప్లేస్‌కు జానకితో పాటు వెళతారు పోలీసులు. అక్కడ వివేక్ డెడ్‌బాడీ కాకుండా ఓ చర్చి ఫాదర్‌తో పాటు జానకి లవర్ అశ్విన్ (సిద్ధార్థ్ మీనన్) డెడ్‌బాడీలు దొరుకుతాయి.
సీఐ కరుణన్ వారిని హత్య చేసినట్లు ఆధారాలు కూడా లభ్యం కావడంతో కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఈ కేసును సాల్వ్ చేసే బాధ్యత ఎస్‌పిపై (హరీష్ ఉత్తమన్) పడుతుంది. అశ్విన్, చర్చి ఫాదర్‌లను చంపింది ఎవరు? వివేక్‌ను సీఐ కరుణన్ చంపాడని జానకి ఎందుకు పోలీసులతో పాటు మీడియాకు అబద్ధం చెప్పింది? ఏ మాత్రం సంబంధం లేని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ అశ్విన్‌తో పాటు చర్చి ఫాదర్ డెడ్‌బాడీలు ఒకే చోట ఎలా దొరికాయి? జానకిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న అశ్విన్ ఆమెకు ఎలా శాశ్వతంగా దూరమయ్యాడు?
కరుణన్‌ను ఈ కేసు నుంచి బయటపడేయడానికి హోమ్ మినిస్టర్ దినేష్(సిద్ధిఖీ) ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? దినేష్ రాజకీయాల్లో ఎదగడానికి కరుణన్ పావుగా ఎలా వాడుకున్నాడు? జానకి ప్రతీకారానికి ఎస్‌పి ఏవిధంగా సాయపడ్డాడు? తన రాజకీయాలపై మచ్చ పడకుండా దినేష్ ఏం చేశాడు అన్నదే అదృశ్యం(Adhrushyam Movie Review) మూవీ కథ.
లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్...
లేడీ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చాలా అరుదుగా సిల్వర్‌స్క్రీన్‌పై వస్తుంటాయి. అదృశ్యం అలాంటి మూవీనే. అవినీతిపరుడైన ఓ పోలీస్ ఆఫీసర్ చేస్తోన్న కుట్రలకు ఓ యువతి తన తెలివితేటలతో ఎలా చెక్ పెట్టిందన్నదే ఈ మూవీ కథ. తమ రాజకీయ ఎదుగుదల, స్వార్థం కోసం ప్రభుత్వ అధికారులను పొలిటికల్ లీడర్స్ ఎలా వాడుకుంటారు? అవసరం తీరిన తర్వాత వారిని ఎలా వదిలించుకుంటారు? వృత్తి నిర్వహణలో పోలీసులపై రాజకీయనాయకుల ఒత్తిడులు ఎలా ఉంటాయన్నది ఈ క్రైమ్ థ్రిల్లర్ కథలో అంతర్లీనంగా చూపించాడు డైరెక్టర్.
అదృశ్యం(Adhrushyam Movie Review) ఓ సాదాసాదీ రివేంజ్ డ్రామా మూవీ. తన ప్రియుడి మరణానికి కారణమైన పోలీస్ ఆఫీసర్‌పై ఓ యువతి ఎలా రివేంజ్ తీర్చుకుందన్నదే ఈ సినిమా కథ. ఈ సింపుల్ స్టోరీని స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో చివరి వరకు ఎంగేజింగ్‌గా నడిపించాడు డైరెక్టర్. ఏ మాత్రం సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల డెడ్‌బాడీస్ ఒకే చోట ఎలా దొరికాయి? వారిని హత్య చేసింది ఎవరన్నది ఎక్కడ ఉత్కంఠ వీడకుండా ట్విస్ట్‌లు, టర్న్‌లకు స్క్రీన్‌ప్లేను అల్లుకున్నాడు డైరెక్టర్. ఆ మలుపులు అన్ని థ్రిల్లింగ్‌ను కలిగిస్తాయి.
పోలీస్ అన్వేస్టిగేషన్...
మినిస్టర్ ఇంట్రడక్షన్ సీన్‌తోనే అదృశ్యం సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వచ్చిన జానకి తాను ఓ హత్య చేశానని పోలీసులకు లొంగిపోయే సీన్ నుంచి అసలు కథ మొదలవుతుంది. వివేక్ శవం కనుగొనడానికి వచ్చిన పోలీసులకు జానకి ట్విస్ట్ ఇచ్చే సీన్ నుంచి నెక్స్ట్ ఏం జరుగబోతుందో అనే ఇంటెన్స్ క్రియేట్ చేస్తూ కథను ముందుకు నడిపించాడు డైరెక్టర్.
ఎస్‌పి ఇన్వేస్టిగేషన్‌లో అసలైన హంతకుడు ఎలా బయటపెట్టాడు? ఈ హత్యలకు కరుణన్‌తో పాటు మినిస్టర్‌కు ఉన్న సంబంధం ఏమిటన్నది రివీల్ అయ్యే ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. హరీష్ ఉత్తమన్ ఇన్వేస్టిగేషన్ సీన్స్‌ను హీరోయిజం తో కాకుండా నిజంగానే ఓ పోలీస్ ఇన్వేస్టిగేషన్ లో నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిడులు ఉంటాయి, తమ అధికార బలంతో సామాన్యులను నేరంలో ఇరికించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయన్నది చూపించారు.
క్లైమాక్స్ రొటీన్...
క్లైమాక్స్ కన్వీన్సింగ్‌గా అనిపించదు. అసలైన నేరస్తుడు చట్టం నుంచి తప్పించుకున్నట్లుగానే చూపించారు. ఇన్వేస్టిగేషన్ సీన్స్ కొన్ని రొటీన్‌గా అనిపిస్తాయి
వన్ ఉమెన్ షో...
జానకి పాత్రలో అపర్ణ బాలమురళి వన్ ఉమెన్ షోగా ఈ మూవీ నిలుస్తుంది. ప్రియుడికి జరిగిన అన్యాయంపై రివేంజ్ తీర్చుకునే అమ్మాయి పాత్రలో తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. పోలీసులు వేసిన ఎత్తులను జానకి తిప్పికొట్టే సీన్స్ ఆకట్టుకుంటాయి. రాజకీయ నాయకుల ఒత్తిడులను ఎదుర్కొంటూ తాను నమ్మిన రూట్‌లో సామాన్యులకు న్యాయం చేసే పోలీస్ ఆఫీసర్‌గా హరీష్ ఉత్తమన్ మల్టీ షేడ్స్‌తో సాగే పాత్రలో కనిపించారు. విలన్స్‌గా కళాభవన్ షాజాన్, సిద్దిఖీ కనిపించారు. అశ్విన్ పాత్రలో సిద్ధార్థ్ మీనన్ ఒకే అనిపిస్తాడు.
అపర్ణ బాలమురళి యాక్టింగ్ అదుర్స్...
అదృశ్యం ఆడియెన్స్ ఊహలకు అందకుండా సాగే వైవిధ్యమైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అపర్ణ బాలమురళి యాక్టింగ్ కోసం మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇది.