Amala Paul: తల్లి అయిన హీరోయిన్ అమలా పాల్.. ఏ పేరు పెట్టారంటే..
17 June 2024, 22:04 IST
- Amala Paul Baby boy: హీరోయిన్ అమలాపాల్ తల్లి అయ్యారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన కుమారుడి పేరును కూడా వెల్లడించారు.
Amala Paul: తల్లి అయిన హీరోయిన్ అమలా పాల్.. ఏ పేరు పెట్టారంటే..
Amala Paul: హీరోయిన్ అమలా పాల్ తొలిసారి తల్లి అయ్యారు. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. అమలాపాల్ జూన్ 11వ తేదీనే ప్రసవించారు. అయితే, నేడు (జూన్ 17) ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అమలా పాల్, ఆమె భర్త జగత్ దేశాయ్ తొలిసారి తల్లిదండ్రులయ్యారు.
పేరు ఇదే
తమ కుమారుడి పేరును కూడా అమలాపాల్ వెల్లడించారు. ఇలాయ్ (ILAI) అని పేరు పెట్టినట్టు తెలిపారు. “ఇట్స్ బేబీ బాయ్. మా చిన్ని అద్భుతాన్ని చూసేయండి. 11.06.2024న జన్మించాడు” అని కుమారుడితో ఇంట్లోకి వచ్చిన వీడియోను ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు పోస్ట్ చేశారు అమల.
తన కుమారుడిని చేతుల్లో ఎత్తుకొని ఇంట్లోకి సంతోషంగా అడుగుపెట్టారు అమలా పాల్. అప్పటికే కుటుంబ సభ్యులు ఇంటిని అందంగా డెకరేట్ చేశారు. తమ రూమ్‍కు వెళ్లిన అమల సర్‌ప్రైజ్ అయ్యారు. ఈ వీడియో అద్భుతంగా ఉంది.
2023 నవంబర్‌లో అమలాపాల్, జగత్ దేశాయ్ వివాహం జరిగింది. ఈ ఏడాది జనవరిలో తన ప్రెగ్నెసీని అమల ప్రకటించారు. ఏప్రిల్‍లో సీమంతం వేడుక జరిగింది. జూన్ 11వ తేదీన మగబిడ్డకు అమల జన్మనిచ్చారు.
అమలా పాల్ చివరగా ఆడుజీవితం సినిమాలో కనిపించారు. పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 28వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం అమలా లైనప్‍లో లెవెల్ క్రాస్ సహా మరో మలయాళం మూవీ కూడా ఉంది.
అమలా పాల్ కెరీర్
అమలా పాల్ 2009లో నీలతామర అనే మలయాలం సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మలయాళంతో పాటు తమిళంలోనూ చిత్రాలు చేశారు. 2011లో బెజవాడ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మూడు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. చాలా సూపర్ హిట్‍లను సాధించారు. ఇప్పటికీ వరుస చిత్రాలతో అమల బిజీగా ఉంటున్నారు.
తాను గర్భిణిగా ఉన్నప్పుడు తన భర్త ఎంత మద్దతుగా నిలిచారో గతంలో అమలాపాల్ ఓ సందర్భంలో పంచుకున్నారు. “రాత్రులంతా నా పక్కనే ఉంటూ నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నావు. నాపై నీవు ఉంచిన నమ్మకం, నువ్వు చెప్పిన మాటలు నాలో ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఎంతో విలువైన ప్రెగ్నెన్సీ జర్నీలో నా వెనుక అత్యంత బలంగా మద్దతుగా నిలబడిన నీకు థాంక్యూ. నాకు మద్దతునిచ్చేందుకు మీరు చేసిన ప్రయత్నాలన్నీ నాలోని ఆత్మవిశ్వాసాన్ని భారీగా పెంచాయి. నా హృదయం ప్రేమతో, కృతజ్ఞతతో నిండిపోయింది. నా బలంగా, ప్రేమగా, సపోర్ట్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు. పదాల్లో వర్ణించలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా” అని తన భర్త జగత్ దేశాయ్‍ను ఉద్దేశించిన గతంలో సోషల్ మీడియాలో ఎమోషనల్‍గా పోస్ట్ చేశారు అమల.
అమలా పాల్ చేతిలో ప్రస్తుతం మలయాళ చిత్రాలు లెవెల్ క్రాస్, డివాజా ఉన్నాయి. ఇప్పటికే లెవెల్ క్రాస్‍లో అమల షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత డివిజా చిత్రీకరణకు ఆమె వెళ్లే అవకాశం ఉంది.