Kanguva Movie: కంగువా సినిమా చూడలేదు.. అందరికీ నచ్చాలని లేదు కదా?: ఐశ్వర్య రాజేష్
16 December 2024, 18:10 IST
Actress Aishwarya: కోయంబత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఐశ్వర్యా రాజేష్ వేసుకొచ్చిన డ్రెస్‌ను కంగువా సినిమాతో ముడిపెట్టిన మీడియా ప్రతినిధులు.. సినిమాను చూశారా? అని అడిగారు. దాంతో ఐశ్వర్య రాజేష్ నిజాయతీగా సినిమాను చూడలేదు అని చెప్తూనే…
కంగువా గురించి మాట్లాడిన ఐశ్వర్య రాజేష్
కంగువా సినిమాపై హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన కంగువా మూవీ నవంబరులో విడుదలై.. అంచనాల్ని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ సినిమాపై వచ్చిన ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ ఇటీవల ఏ మూవీపై కూడా రాలేదు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లు వసూళ్లు రాబట్టడం కూడా గగనమైపోయింది.
కంగువా నేను చూడలే
కోయంబత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్‌ను మీడియా సభ్యులు కంగువా సినిమా గురించి ప్రశ్నించారు. దాంతో ఐశ్వర్యా రాజేష్ చాలా నిజాయతీగా కంగువా సినిమాను తాను చూడలేదని చెప్పేసింది. కేవలం తన తల్లి మాత్రమే ఆ సినిమా చూసిందని.. బాగుందని మాత్రమే చెప్పిందని ఐశ్వర్యా రాజేష్ చెప్పుకొచ్చింది.
అందరికీ నచ్చాలని లేదు కదా?
‘‘కంగువా సినిమా అందరికీ నచ్చాలని లేదు కదా? కొన్ని సినిమాలు ఎవరికైనా నచ్చుతాయి. కొన్ని సినిమాలు ఎవరికీ నచ్చవు. ఎవరినీ నొప్పించకుండా ఏదైనా చెబితే బాగుంటుంది. నచ్చలేదు అని చెప్పడం తప్పు కాదు. ఎవరినీ నొప్పించకుండా మీకు నచ్చనిది చెప్పడానికి ఒక మార్గం ఉంది’’ అని ఐశ్వర్యా రాజేష్ వెల్లడించింది.
తొలి రోజే నెగటివ్ టాక్
కంగువా సినిమాలో సూర్యకు జోడీగా బాలీవుడ్ నటి దిశా పటానీ నటించింది. బాబీ డియోల్, నటరాజన్ సుబ్రమణ్యం అలియాస్ నట్టి, కరుణాస్, బోస్ వెంకట్, యోగిబాబు, రెడిన్ కింగ్ల్సే తదితరులు ఈ సినిమాలో నటించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా 11,500కు పైగా థియేటర్లలో విడుదలైన కంగువా మొదటి రోజే నెగటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఓటీటీలో కంగువా
కంగువా సినిమా రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. వరల్డ్‌వైడ్ కేవలం రూ.110 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తమిళ్ బాహుబలిగా ఈ సినిమాను కోలీవుడ్ ప్రచారం చేసింది. రూ.2,000 కోట్లు వసూలు చేస్తుందని ప్రొడ్యూస్ బాహాటంగా రిలీజ్‌కి ముందు ప్రకటించాడు. కానీ.. కథ కొత్తగా ఉన్నప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పించేలా శివ తీయలేకపోయాడు.