Vikrant Massey Retirement: 37 ఏళ్ల వయసులోనే నటనకి గుడ్ బై చెప్పేసిన యంగ్ హీరో.. అభిమానులు షాక్
02 December 2024, 9:41 IST
Actor Vikrant Massey retirement: ట్వెల్త్ ఫెయిల్ సినిమాతో దేశవ్యాప్తంగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విక్రాంత్ మాస్సే.. చిన్న వయసులోనే నటనకి గుడ్ బై చెప్పేశాడు. ఇంతకీ ఈ యంగ్ హీరో చెప్పిన కారణం ఏంటో తెలుసా?
విక్రాంత్ మాస్సే
Vikrant Massey Movies: యంగ్ హీరో విక్రాంత్ మాస్సే అనూహ్యంగా నటనకి గుడ్ బై చెప్పేశాడు. ట్వెల్త్ ఫెయిల్, సెక్టార్ 36 సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న విక్రాంత్ మాస్సే.. ఇటీవల సబర్మతి ఎక్స్‌ప్రెస్ మూవీతోనూ మంచి మార్కులు కొట్టేశాడు. నటుడిగా మంచి భవిష్యత్తు ఉన్న విక్రాంత్ మాస్సే అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ.. 37 ఏళ్ల వయసులోనే నటనకి వీడ్కోలు పలికేశాడు.
ఆ టైమ్ వచ్చేసింది
2025 తర్వాత నటన నుంచి తప్పుకుంటానని సోమవారం ఉదయం విక్రాంత్ మాస్సే ప్రకటించి అభిమానులను షాక్‌కి గురిచేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘‘గత కొన్నేళ్లు అద్భుతంగా గడిచాయి. ఇన్నాళ్లు నాపై ప్రేమ, అభిమానం చూపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. కానీ నా ఫ్యామిలీకి సమయం కేటాయించాల్సిన టైమ్ ఆసన్నమైందని నేను గ్రహించాను. 2025లో రిలీజ్ అయ్యే సినిమానే నా చివరి మూవీ’’ అని విక్రాంత్ మాస్సే ప్రకటించాడు.
ఫ్యాన్స్ షాకింగ్స్ కామెంట్స్
విక్రాంత్ మాస్సే రిటైర్మెంట్‌పై నెటిజన్లు చాలా ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు. ‘ఎందుకిలా చేశావ్..?’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘మీలాంటి నటులు ఎవరూ లేరు. మీ నుంచి మరిన్ని మంచి సినిమాలు కావాలి’’ అని మరొకరు కామెంట్ చేశారు. మరో నెటిజన్.. ‘‘హఠాత్తుగా ఏంటిది? అంతా సవ్యంగా ఉందా?’ అంటూ ఆరోగ్యం గురించి వాకబు చేశాడు.
రిటైర్మెంట్ వెనక్కి తీసుకో
మీ యాక్టింగ్, ‘సినిమాలు మాకు బాగా నచ్చాయి. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించు’’ అని చాలా మంది నెటిజన్లు కోరుతున్నారు. ‘బ్రో నీ కెరీర్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది.. ఎందుకిలా చేశావ్? ’ అని ఒకరు ప్రశ్నించగా.. ‘ఈ ప్రకటన ఏదో సినిమా పబ్లిసిటీ స్టంట్ కాదు కదా?’ అని ఒక నెటిజన్ అనుమానం వ్యక్తం చేశారు.
విక్రాంత్ మాస్సే కెరీర్ ఇలా
ధూమ్ మచావో ధూమ్ షోతో బుల్లితెరపై తన నట ప్రస్థానాన్ని ప్రారంభించిన విక్రాంత్ మాస్సే.. 2009లో బాలికా వధు చిత్రం ద్వారా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత 2013లో లూటెరా చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. జిన్నీ వెడ్స్ సన్నీ, హసీన్ దిల్రుబా, లవ్ హాస్టల్, ట్వెల్త్ ఫెయిల్ చిత్రాలలో మంచి పేరు సంపాదించుకున్నాడు.