RRR Viral | అయ్యయ్యో రామ్‌చరణ్‌ను కొడుతున్నాడే.. సినిమా చూస్తూ ఏడ్చేసిన బాలుడు!
26 March 2022, 17:03 IST
- పిల్లల అమాయకత్వం కొన్నిసార్లు విపరీతంగా నవ్వు తెప్పిస్తుంది. సినిమాలో జరిగిన ఘటనలు నిజమని నమ్మేస్తుంటారు. అలాంటి ఘటనే జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ ఎన్టీఆర్.. రామ్‌చరణ్‌ను నిజంగానే కొడుతున్నాడని భావించి వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ చూస్తూ ఏడ్చేసిన పిల్లాడు
ఎట్టకేలకు ఎన్నో అంచనాల నడుమ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి షో నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల సందర్భంగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సినిమాలో తారక్, రామ్‌చరణ్ కొట్టుకునే సీన్‌ను చూసి ఓ బాలుడు వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను గమనిస్తే.. థియేటర్లో ఫ్యామిలీతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తున్న బాలుడు అకస్మాత్తుగా ఏడ్వటం మొదలుపెడతాడు. అప్పుడే ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను కొట్టే సీన్ జరుగుతుంటుంది. ఆ దృశ్యాన్ని చూసిన సదరు బాలుడు ఏడ్వటం ప్రారంభించాడు. వట్టి పుణ్యానికే తన అభిమాన హీరోను కొడుతున్నడంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అసలు రామ్‌చరణ్ ఏం చేయలే.. అయినా కొడుతున్నాడు, ఆయన్ను విలన్ చేస్తున్నారు అని బాధపడ్డాడు. దీంతో నవ్వుకోలేకపోయిన బాలుడి తల్లిదండ్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వాళ్లిద్దరు మళ్లీ ఫ్రెండ్స్ అవుతారని, ఈ మాత్రందానికే ఏడుస్తావా.. అంటూ బతిమాలాడు. అయినప్పటికీ ఆ చిన్నారి ఏడ్వడం ఆపలేదు.
రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది.
టాపిక్