Tollywood Drugs Case | టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. వారిపై ఈడీ సీరియస్.. కోర్టు ధిక్కరణ పిటిషన్
23 March 2022, 22:42 IST
- టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఏళ్లుగా నానుతూనే ఉంది. తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. నిందితులు, సాక్షులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వట్లేదని.. ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది.
ప్రతీకాత్మక చిత్రం
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో అంశం తెరపైకి వచ్చింది. సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. డ్రగ్స్ కేసుకు సంబంధించి.. నిందితులు, సాక్షుల డిజిటల్ డేటాను ఇవ్వట్లేదని ఈడీ చెబుతోంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో ఆడియో, విడియో రికార్డింగ్స్ ఈడీకి ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2017 లో టాలీవుడ్ స్టార్స్ తో పాటు మొత్తం 41 మంది కాల్ డేటా రికార్డింగ్స్ నమోదు చేసింది ఎక్సైజ్ శాఖ. వీరిపై 2017 లో 12 ఎఫ్ ఐ ఆర్లు నమోదు చేశారు. డ్రగ్స్ నిందితులతో పాటు సాక్షుల నుండి కాల్ డేటా రికార్డింగ్స్ తీసుకున్నామని ఈడీకి ఎక్సైజ్ సుపరిటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు.
విచారణ సందర్భంగా అందరి కాల్ డేటాను ఎక్సైజ్ శాఖ రికార్డింగ్ చేసింది. నిందితుడు కెల్విన్ మొబైల్ ఫోన్ ను సైతం సీజ్ చేసింది. కెల్విన్ తో స్టార్స్ కు ఉన్న సంబంధాల ఆధారాల కోసం స్టార్స్ కాల్ డేటా రికార్డింగ్స్ బయటికి తీసింది. ఈడికి మాత్రం ఆ కాల్ రికార్డింగ్స్ ను ఎక్సైజ్ శాఖ ఇవ్వలేదు.
ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ ల తో పాటు,ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన ఒరిజినల్ మెటీరియల్ ను ఇవ్వాలని ఈడీ కోరింది. అవన్నీ.. ట్రైల్ కోర్టులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. కోర్టుకు ఎక్సైజ్ శాఖ సమర్పించిన వాంగ్మూల కాపిలు మాత్రమే అందాయని మరోవైపు ఈడీ అంటోంది. అందులో కాల్ డేటా రికార్డింగ్స్ లేవని పేర్కొంది. వాటిని ఇవ్వాలని గతంలో ఎక్సైజ్ శాఖకు ఈడి లేఖ రాసింది. ఈ విషయం కోర్టుకు చేరింది.
అయితే కొన్ని రోజుల క్రితం విచారణ చేసిన హైకోర్టు.. ఈడీకి మెుత్తం వివరాలను ఇవ్వాలని ఫిబ్రవరి 2న ఆదేశించింది. డ్రగ్స్ కేసులో ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తు అధికారుల రికార్డులతో పాటు పూర్తి వివరాలను ఈడీకి ఇవ్వాలని ప్రభుత్వానికి చెప్పింది. డ్రగ్స్ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈడీకి సహకరించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వారి కాల్ డేటా రికార్డులను నెల రోజుల్లో ఇవ్వాలని స్పష్టం చేసింది.
అయితే మళ్లీ టైమ్ తీసుకోవడంతో.. కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ కూడా రాసింది. దీంతో.. హైకోర్టు ఆదేశించినా.. సమాచారం ఇవ్వడం లేదని.. మార్చి 23న కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది ఈడీ. సోమేష్ కుమార్, సర్ఫరాజ్‌కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని చెప్పింది.
టాపిక్