Lok Sabha elections: ఎంపీలుగా గెలిచిన బియాంత్ సింగ్ కుమారుడు, ఖలిస్తాన్ అనుకూల నాయకుడు
06 June 2024, 10:14 IST
Lok Sabha elections: 2024 లోక్ సభ ఎన్నికల్లో ఏడుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. వారిలో ఇందిరా గాంధీని హత్య చేసిన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా, ఖలిస్తాన్ అనుకూల నాయకుడు అమృత్ పాల్ సింగ్ కూడా ఉన్నారు. అమృత్ పాల్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
స్వతంత్ర ఎంపీలుగా గెలిచిన వారి వివరాలు
Independent MPs: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) 292 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 స్థానాలు గెలుచుకున్నాయి. మిగిలిన 17 మంది ఎంపీలు ఏ కూటమికి చెందిన వారు కాదు. వారిలో ఏడుగురు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచారు.
ఈ ఏడుగురు ఇండిపెండెంట్లు ఎవరు?
2024 లోక్ సభ ఎన్నికల్లో అమృత్ పాల్ సింగ్, సరబ్ జీత్ సింగ్ ఖల్సా, పటేల్ ఉమేష్ భాయ్ బాబుభాయ్, మహ్మద్ హనీఫా, రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, విశాల్ పాటిల్, షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి విజయం సాధించారు. వీరిలో ప్రస్తుతం జైలులో ఉన్న అమృత్ పాల్ సింగ్, రషీద్ ఇంజినీర్ కూడా ఉన్నారు.
స్వతంత్ర ఎంపీల వివరాలు..
అమృత్ పాల్ సింగ్: ఖలిస్తాన్ అనుకూల సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’కు నేతృత్వం వహిస్తున్న అమృత్ పాల్ సింగ్ ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. దుబాయ్ నుంచి 2022 సెప్టెంబర్లో భారత్ కు తిరిగి వచ్చిన అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన 2012లో కుటుంబ ట్రాన్స్ పోర్ట్ వ్యాపారంలో చేరారు.
సరబ్జీత్ సింగ్ ఖల్సా: 1984 అక్టోబర్ లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన ఇద్దరు అంగరక్షకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా. ఈ సరబ్జీత్ సింగ్ ఖల్సా తాత బాబా సుచా సింగ్ కూడా గతంలో ఎంపీగా పని చేశారు. ఆయన బతిండాకు ప్రాతినిధ్యం వహించారు.
పటేల్ ఉమేష్ భాయ్ బాబూభాయ్: బాబుభాయ్ ఒక సంఘసేవకుడు, . డామన్ డయ్యూ స్థానం నుంచి వరుసగా నాలుగోసారి పోటీ చేస్తున్న సిట్టింగ్ బీజేపీ ఎంపీ లాలూభావు బాబూభాయ్ పటేల్ ను ఓడించడంతో ఆయన విజయం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహ్మద్ హనీఫా: నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ జిల్లా అధ్యక్షుడు అయిన హనీఫా 1967లో ఉనికిలోకి వచ్చిన లద్దాఖ్ స్థానాన్ని గెలుచుకున్న నాలుగో ఇండిపెండెంట్. ఇక్కడ 1984, 2004, 2009 ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్లు విజయం సాధించారు.
రాజేష్ రంజన్: పప్పు యాదవ్ అని కూడా పిలువబడే రంజన్ మార్చిలో తన జన్ అధికార్ పార్టీని (జెఎపి) కాంగ్రెస్ లో విలీనం చేశారు. సీట్ల పంపకం ఒప్పందం ప్రకారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కు కాంగ్రెస్ పూర్ణియా స్థానాన్ని ఇవ్వడంతో పప్పు యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పూర్ణియా నుంచి పోటీ చేసి గెలిచారు. గతంలో పలు పర్యాయాలు లోక్ సభ సభ్యుడిగా ఆయన పని చేశారు.
విశాల్ పాటిల్: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంతరావు పాటిల్ మనవడు విశాల్ పాటిల్. శివసేన (యూబీటీ) తన సొంత అభ్యర్థిని నిలబెట్టడంతో కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి సొంతంగా పోటీలో నిలిచి గెలిచారు.
షేక్ అబ్దుల్ రషీద్: ఇంజనీర్ రషీద్ అనే పేరు కూడా ఉన్న షేక్ అబ్దుల్ రషీద్ ప్రస్తుతం ఉగ్రవాదులకు నిధులు అందజేశారన్న కేసులో తిహార్ జైల్లో ఉన్నారు. 2019లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద ఆయనను అరెస్ట్ చేసింది.