2024 Lok Sabha elections: బిహార్ లో కాంగ్రెస్ - ఆర్జేడీల మధ్య కుదిరిన లోక్ సభ ఎన్నికల సీట్ల పంపకం
29 March 2024, 14:37 IST
Bihar seat-sharing deal: 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి సంబంధించి కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో రెండు పార్టీలు పోటీ చేయనున్న స్థానాలపై స్పష్టత వచ్చింది.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
India bloc seat-sharing deal: 2024 లోక్ సభ ఎన్నికల (2024 Lok Sabha elections) కోసం బీహార్ లో కాంగ్రెస్ (Congress), రాష్ట్రీయ జనతాదళ్ (RJD) మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదిరింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కు వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో బిహార్ లో అతిపెద్ద భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ 26 స్థానాల్లో పోటీ చేయనుంది. మరోవైపు, కాంగ్రెస్ 9 సీట్లలో అభ్యర్థులను నిలపనుంది. ఆర్జేడీకి లభించిన స్థానాలలో పూర్నియా, హాజీపూర్ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పోటీ చేసే సీట్లలో కిషన్ గంజ్, పాట్నా సాహిబ్ మొదలైనవి ఉన్నాయి. కూటమిలో మరో భాగస్వామ్య పక్షమైన వామపక్షాలు ఐదు స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
పూర్నియా, కతిహార్
బిహార్ లో సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య పూర్నియా, కతిహార్ స్థానాలు కీలకంగా మారాయి. ఈ రెండు స్థానాలు తమకే కావాలని కాంగ్రెస్, ఆర్జేడీలు పట్టుబట్టాయి. ఈ రెండు స్థానాల్లో గత ఎన్నికల్లో జేడీయూ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో పూర్నియా స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని రాజ్యసభ ఎంపీ రంజీత్ రంజన్ భర్త పప్పు యాదవ్ (Pappu yadav) ఆశించాడు. ఈ విషయంలో తనకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నుంచి కాంగ్రెస్ టికెట్ ఇస్తామని హామీ లభించిందని పప్పు యాదవ్ ధీమాగా ఉన్నాడు. దాంతో, ఈ స్థానంపై కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య పోటీ నెలకొన్నది. చివరకు, ఆర్జేడీ తన పట్టు నిలుపుకుంది. అయితే, ఈ స్థానం నుంచి ఆర్జేడీ ఇప్పటికే అనధికారికంగా బీమా భారతికి టికెట్ కన్ఫర్మ్ చేయడం విశేషం. బీమాభారతి ఇటీవల జేడీ యూ నుంచి ఆర్జేడీ లో చేరారు. అంతేకాదు, బీహార్ లోని ఏడు నియోజకవర్గాలకు ఆర్జేడీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.
కూటమి పార్టీల్లో విబేధాలు
లోక్ సభ ఎన్నికల (2024 Lok Sabha elections) తొలి దశ నామినేషన్ పత్రాల దాఖలు పూర్తయిన మరుసటి రోజే ఈ మహాకూటమి సీట్ల పంపకాల ప్రకటన చేయడం గమనార్హం. తొలి దశలో ఎన్నికలు జరిగే నాలుగు స్థానాల్లో ఆర్జేడీ ఏకపక్షంగా తన అభ్యర్థులను బరిలోకి దింపడంపై మిత్రపక్షాలు మండిపడుతున్నాయి. పాట్నాలో జరిగిన మహాకూటమి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (RJD leader Tejashwi Yadav) ప్రసంగించాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. మంగళవారం పర్నాలోని కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ నివాసంలో బీహార్ సీట్ల పంపకాలకు సంబంధించి జరిగిన సమావేశంలో తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. ఆ తరువాత, లోక్ సభ ఎన్నికల్లో బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.
2019 ఎన్డీయే క్లీన్ స్వీప్
2019 లోక్ సభ ఎన్నికల్లో (2019 Lok Sabha elections) 40 స్థానాలకు గానూ బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్న నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ 39 సీట్లు గెలుచుకుంది.