తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Peddapally Congress: చేయి చేయి కలుపుదాం... పెద్దపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని నేతల పిలుపు

Peddapally Congress: చేయి చేయి కలుపుదాం... పెద్దపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని నేతల పిలుపు

HT Telugu Desk HT Telugu

09 April 2024, 8:03 IST

google News
    • Peddapally Congress: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు ఏకమయ్యారు. చేయి చేయి కలిపి ఐక్యతా రాగంతో కాంగ్రెస్ ఎండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు.
పెద్దపల్లిలో కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం
పెద్దపల్లిలో కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం

పెద్దపల్లిలో కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం

Peddapally Congress: ఎంపీ అభ్యర్థిMP Candidate ఎంపిక విషయంలో ఎవరికివారే వ్యవహరించిన Congress ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిన ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ Gaddam Vamsi krishnaకు జై కొడుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జి మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో గోదావరిఖని Godavarikhani లో పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ సన్నాహక సమావేశం నిర్వహించారు.

సమావేశంలో Peddapally ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తోపాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజ్ ఠాకూర్, విజయరమణారావు, అట్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రేమ్ సాగర్ రావు, వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి పాల్గొని ఐక్యతను చాటి చెప్పారు.

అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం

టికెట్ ఆశిస్తూ బిఆర్ఎస్‌కు గూడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతను కాదని గడ్డం వంశీకృష్ణకు టికెట్ కెటాయించడంతో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ పెద్దలు సుదీర్ఘంగా ఆలోచించి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణ ను ఎంపిక చేశారని, కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.‌ రాబోయే తరానికి నిస్వార్థంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన నాయకుడు వంశీ అని తెలిపారు.

ప్రజలకు సేవ చేయాలనే తపనతో వచ్చిన వంశీని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలన్నారు. గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను ఎన్ని ఇబ్బందులు పెట్టిన భరించామని తెలిపారు. ఎంత పెద్ద మెజార్టీతో వంశీని గెలిపిస్తే అంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.‌ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి వంశీ ని గెలిపించాలని కోరారు.

రామగుండం పారిశ్రామిక కారిడార్‌గా మారుస్తాం…

పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంను పారిశ్రామిక కారిడార్ గా ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు నెలకొల్పుతామని తెలిపారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న 7 వేల కుటుంబాలకు పట్టాలు ఇచ్చేందుకు ఎన్నికల తరువాత కృషి చేస్తామన్నారు.

సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సవిచూసినా బిఆర్ఎస్ కు ఓపిక లేదని, మాజీ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాయకులను ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తున్నారని విమర్శించారు. ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ కు పట్టం కడితే కేసిఆర్ ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు.

ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశాం

అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీమ్ లలో ఐదింటిని అమలు చేశామని స్పష్టం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ బిజేపి ఓర్వలేక పోతుందన్నారు.‌ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు బిఆర్ఎస్ నాయకులకు లేదని అన్నారు

బిఆర్ఎస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో రైతులకు నష్టం జరుగుతుంటే మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పాలకుర్తి కి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసిన తరువాతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు అడుగుతామన్నారు. పెద్దపల్లిలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి తీరుతామని తెలిపారు.

సన్నాహక సమావేశానికి మాదిగలు గైర్హాజరు

పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న మాదిగలు గోదావరిఖనిలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎస్సీలకు రిజర్వ్ అయిన పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ మూడు పార్లమెంటు స్థానాల్లో మాలలకే టిక్కెట్ ఇచ్చారని మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఢిల్లీ స్థాయిలో మాదిగ సామాజిక వర్గం ఆందోళనకు దిగింది.

పెద్దపల్లిలో మాల సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణ తప్పించి మాదిగ సామాజిక వర్గానికి చెందిన గజ్జెల కాంతం కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ సైతం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని నాయకుల మధ్య సమన్వయ లోపం మాదిగలకు కలిసి వస్తుందని భావించి ఆ దిశగా ఆందోళన చేపట్టినట్లు సమాచారం. అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావించిన వివేక్ ఫ్యామిలీ ముందుగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నాయకులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసి సపలికృతులయ్యారు.

ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలు ముఖ్య నాయకులు వంశీకృష్ణ అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ ఒకే వేదిక పైకి రావడంతో మాదిగల ఆందోళనకు చెక్ పడినట్లైంది.

(HT Correspondent K.V.REDDY, Karimnagar)

తదుపరి వ్యాసం