Cantonment By poll 2024 : కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్
06 April 2024, 13:11 IST
- Cantonment Congress Candidate: కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ తరపున అభ్యర్థి ఖరారయ్యారు. శ్రీ గణేశ్ పేరును ఖరారు చేస్తూ ప్రకటన విడుదలైంది.
కంటోన్మెంట్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్
Cantonment Congress Candidate 2024: కంటోన్మెంట్ ఉపఎన్నికలో(Cantonment By Election 2024) కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. శ్రీ గణేశ్… ఇటీవలే బీజేపీ పార్టీని వీడి… కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్(Cantonment) నుంచి బీఆర్ఎస్ తరపున లాస్య నందిత విజయం సాధించారు. బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీ గణేశ్ కు 41 వేల ఓట్లు రాగా... నందితకు 59 వేలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 17,169 ఓట్ల తేడాతో నందిత విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ తరపున గద్దర్ కుమార్తె వెన్నల పోటీ చేయగా...20,825 ఓట్లు పొందగా మూడో స్థానంలో నిలిచారు. అయితే ఈసారి వెన్నెలకు కాకుండా.... పార్టీలో చేరిన శ్రీ గణేశ్ కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఖరారు కానీ బీఆర్ఎస్ అభ్యర్థి…!
కంటోన్మెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్(BRS) సిట్టింగ్ స్థానం. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుమార్తె లాస్య నందితకు(Lasya Nandita) బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించగా....ఆమె గెలుపొందారు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో కంటోన్మెంట్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 18న కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్(Secunderabad Cantonment Byelection) కూడా రానుంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. కానీ టికెట్ ఎవరికీ ఇవ్వాలి అనేది మాత్రం అధిష్ఠానానికి తల నొప్పిగా మారింది. టికెట్ తనకే ఇవ్వాలని నందిత సోదరి నివేదిత పార్టీ అధినేత కేసీఆర్ ను రిక్వెస్ట్ చేశారు. అయితే ఒకే కుటుంబానికి ఇన్ని సార్లు టికెట్ ఇస్తే గెలుస్తామా? లేదా అనేదానిపై పార్టీ సమాలోచన చేస్తుంది. ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్ కావడంతో మరొకరికి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే దానిపై కేసిఆర్ వివరాలను నేతల నుంచి ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఇదే స్థానం నుంచి పలువురు ఉద్యమకారులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్, ఖనిజానివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ క్రిషాంక్ తో పాటు మరో ఇద్దరు పేర్లను కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వీరు ఇద్దరు కంటోన్మెంట్ టికెట్ ఆశించి భంగపడ్డారు. కాగా కృషాంక్ లాంటి తెలంగాణ ఉద్యమకారులను పార్టీ ఎన్నడూ మర్చిపోదని వారికి మంచి ప్రాధాన్యత కల్పిస్తామని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే కృషాంక్ తో పాటు నాగేష్ సైతం... ఇప్పుడైనా కంటోన్మెంట్ టికెట్(Cantonment BRS Ticket) కేటాయించాలని పార్టీని అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ ఉన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం వీరితో భేటీ అవుతున్నారు. త్వరలోనే ఈ స్థానం నుంచి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు కేసీఆర్.