YS Jagan in Nandyal : ఇటు నేను ఒక్కడినే, అటు తోడేళ్ల గుంపు... వారికి ఇవే చివరి ఎన్నికలు కావాలి - వైఎస్ జగన్
28 March 2024, 19:08 IST
- YSRCP Public Meeting at Nandyal: నారావారి పాలన ఎవరైనా తీసుకువస్తాం అంటే ఒప్పుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు ముఖ్యమంత్రి జగన్. నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన… మరోసారి వైసీపీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్
YSRCP Memantha Siddham Yatra Day 2: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్.. ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన భారీ సభలో జగన్(YS Jagan) ప్రసగించారు. ఓవైపు ఐదేళ్ల ప్రభుత్వ పాలనను వివరిస్తూనే.... మరోవైపు ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జనసంద్రాన్ని తలపిస్తోందన్న జగన్..... గతంలో చంద్రబాబు చేసిన మోసాల పాలన చూశారని చెప్పారు, నారా వారి పాలన మళ్లీ ఒప్పుకోమని ఏపీ ప్రజలు చెబుతున్నారని అన్నారు.
ఇటు నేను ఒక్కడినే - సీఎం జగన్
"ఎన్నికల యుద్ధంలో ఇటువైపు నేను ఒక్కడ్నే, అటువైపు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్.. జగన్‌ను ఎదుర్కొనేందుకు ఇంత మంది తోడేళ్లు ఏకమయ్యారు.. కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధం. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు సాధించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల మనకు జైత్రయాత్ర.. ఐదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. ఐదేళ్లలో గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి. వైసీపీ ఐదేళ్ల పాలనపై అందరితోనూ చర్చించండి. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి" అని జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు.
ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్ అనేది నిర్ణయం అవుతుందనేది గుర్తుపెట్టుకోవాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర అయితే…. మోసాల చంద్రబాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలని…, ఇక్కడనుంచే పిలుపునిస్తున్నానని వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇవాళ ఓ అమ్మ ఒడి, సున్నా వడ్డీ, ఓ ఆసరా అందజేస్తున్నామని జగన్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా విద్యా దీవెన, వసతి దీవెన, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం, మత్య్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడే కాకుండా పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశామని చెప్పారు. ఇలాంటి మంచి పనులన్నీ కూడా మీ బిడ్డ వైెస్ జగన్ పాలనలోనే జరిగాయని గుర్తుపెట్టుకోవాలని కోరారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు హాయాంలో ఇలాంటి మంచి పనులు జరిగాయా అని ప్రశ్నించారు.
చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి అని మండిపడ్డారు సీఎం జగన్. చంద్రబాబు మోసాలకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతామని హెచ్చరించారు. అలాంటి చంద్రబాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? అని ప్రజలను ఉద్దేశించి అడిగారు. చంద్రబాబు పేరు చెప్తే కరువు గుర్తుకొస్తుందన్న జగన్.... బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు గుర్తుకొస్తాయని వ్యాఖ్యానించారు. రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాలు, నిరుద్యోగ భృతితో పాటు అనేక హామీలను విసర్మించారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబుకి(Chandrababu) ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. ఈ 58 నెలల వైసీపీ పాలనలో పేదల కోసం ఎన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని చెప్పారు ఇంటికి వెళ్లి మీ కుటుంబ సభ్యులతో ఆలోచన చేయాలని…. ఇంట్లో ఉన్న అవ్వా తాతలతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ గెలిపించేందుకు సిద్ధం కావాలన్నారు.