Chandrababu : పొత్తుల్లో భాగంగా 31 మందికి సీట్లవ్వలేకపోయాం, 160 టార్గెట్ ఫిక్స్- చంద్రబాబు
23 March 2024, 16:53 IST
- Chandrababu : పొత్తుల్లో భాగంగా 31 మందికి సీట్లు కేటాయించలేకపోయామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీట్లు రాని అభ్యర్థుల త్యాగాన్ని మర్చిపోమని, వచ్చే ప్రభుత్వంలో అవకాశం కల్పిస్తామన్నారు.
చంద్రబాబు
Chandrababu : రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకోలేదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిశామని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. విజయవాడలో కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు(MLA, MP Candidates) వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ... వైసీపీ(Ysrcp) కుట్రలను తిప్పికొడుతూ.. గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో ప్రచారం చేయాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. సరైన అభ్యర్థులను ఎన్నుకోవడం చాలా కీలకమన్న చంద్రబాబు, అన్ని వర్గాలకు న్యాయం చేసేలా అభ్యర్థుల ఖరారు ఉంటుందన్నారు. పొత్తుల్లో భాగంగా 31 మందికి సీట్లు కేటాయించలేకపోయామని చంద్రబాబు అన్నారు. వాళ్ల త్యాగం తానెప్పుడు మరచిపోనన్నారు. సీట్లు రాని అభ్యర్థుల బాగోగులు చూసుకుంటామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం కొనసాగుతోందని దుయ్యబట్టారు.
కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయాం
కూటమి అభ్యర్థులు, నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. వైసీపీ కుట్రలు చేసి గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ పద్దతి ప్రకారం రాజకీయం చేశారన్నారు. కూటమి(TDP Janasena BJP) తరపున ఎవరు పోటీ చేసినా... మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో గెలిపించాలన్నారు. ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారని చూడడంలేదని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆలోచిస్తున్నామన్నారు. వైసీపీ పాలనతో గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడమే మూడు పార్టీల ముందున్న లక్ష్యమని చంద్రబాబు(Chandrababu) చెప్పారు. సర్వేలు, చాలా కసరత్తు తర్వాత అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. అయితే పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయామన్నారు. వైసీపీని మరింత బలంగా ఎదుర్కొనేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
టార్గెట్ 160
వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే లక్ష్యంతో పవన్ కల్యాణ్(Pawan Kalyan) పొత్తుపై ముందుకు వచ్చారని చంద్రబాబు అన్నారు. పొత్తుపై అసత్య ప్రచారం చేస్తూ వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ ట్రాప్ లో పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 160 నియోజకవర్గాల్లో 160 సభల్లో తాను పాల్గొంటానని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 160 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.
సీనియర్లు దక్కని టికెట్లు
టీడీపీ సీనియర్లకు(TDP Seniors) ఈసారి టికెట్లు దక్కలేదు. గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నేతలకు చంద్రబాబు టికెట్లు కేటాయించలేదు. పొత్తుల్లో భాగంగా కొందరికి సీట్లు దక్కకపోవడంతో, సర్వేల ఆధారంగా మరికొందరికి సీట్లు కేటాయించలేదని తెలుస్తోంది. అయితే పెనమలూరు టికెట్ ను బోడే ప్రసాద్‌కు చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత బహిరంగంగానే విమర్శలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ తమ కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. 2009 ఎన్నికల్లో తన తండ్రిని సొంత పార్టీ నాయకులే ఓడించారన్నారు. నాన్న మరణాంతరం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని కానీ ఏనాడు అండగాని నిలబడింది లేదని చంద్రబాబుపై దేవినేని స్మిత ధ్వజమెత్తారు. 2014, 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని, ఈసారి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. ఏ రకంగా బోడే ప్రసాద్ (Bode Prasad)కు పెనమలూరు సీటును కేటాయిస్తారని చంద్రబాబు, లోకేశ్ ను ప్రశ్నించారు. టికెట్ రాకపోడవంతో మీడియా ముందుకు వచ్చి పార్టీని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బోడే ప్రసాద్‌కు సహకరించమని దేవినేని స్మిత తేల్చి చెప్పారు.