తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Home Voting In Ap: పొత్తుపై ఉన్న శ్రద్ధ ఎన్నికల గుర్తుపై పెట్టని ఎన్డీఏ కూటమి, గాజు గ్లాసు గుర్తుతో కొత్త చిక్కులు

Home Voting In AP: పొత్తుపై ఉన్న శ్రద్ధ ఎన్నికల గుర్తుపై పెట్టని ఎన్డీఏ కూటమి, గాజు గ్లాసు గుర్తుతో కొత్త చిక్కులు

Sarath chandra.B HT Telugu

03 May 2024, 13:28 IST

google News
    • Home Voting In AP: ఏపీలో హోమ్‌ ఓటింగ్‌ ప్రారంభమైంది. మే 8 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇంటింటి ఓటింగ్ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మరోవైపు ఎన్డీఏ కూటమిలో గాజు గ్లాసు గుర్తుపై లేవనెత్తిన అభ్యంతరాలపై విచారణ సాగుతోంది. 
ఏపీలో ప్రారంభమైన ఇంటింటి ఓటింగ్‌తో గాజు గ్లాసుకు చిక్కులు
ఏపీలో ప్రారంభమైన ఇంటింటి ఓటింగ్‌తో గాజు గ్లాసుకు చిక్కులు

ఏపీలో ప్రారంభమైన ఇంటింటి ఓటింగ్‌తో గాజు గ్లాసుకు చిక్కులు

Home Voting In AP: ఏపీలో ఎన్డీఏ కూటమిగా పోటీ చేయడంపై పెట్టిన శ్రద్ధ ఎన్నికల గుర్తును కాపాడుకోవడంపై చూపకపోవడంతో చిక్కులు తలెత్తాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనంటూ కొన్నేళ్లుగా చెబుతున్న పవన్ కళ్యాణ్‌ తాను పోటీ చేయని స్థానాల్లో పార్టీ గుర్తు సంగతి ఏమటనే విషయం మాత్రం మర్చిపోయారు.

టీడీపీ-జనసేన లు ఎన్డీఏ కూటమిగా కలిస్తే వైసీపీని ఓడించవచ్చని భావించిన టీడీపీ నేతలు కూడా గుర్తు విషయాన్ని విస్మరించారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ, ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీలకు ఎన్నికల గుర్తు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ జనసేన మాత్రం ఎన్నికల సంఘం అర్హతలకు అనుగుణంగా ప్రమాణాలు సాధించలేదనే సంగతి మర్చిపోయారు.

పదేళ్ల క్రితమే జనసేన పార్టీ ఆవిర్భవించినా ఆ పార్టీ 2019లో మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చింది. ఎన్నికల సంఘం ఎన్నికల చిహ్నాల కేటాయింపుపై రూపొందించిన విధివిధానాలను ఎన్డీఏ కూటమి పార్టీలు విస్మరించాయి. 1968 ఎన్నికల గుర్తుల కేటాయింపు ఆదేశాల ప్రకారం పార్టీ చిహ్నాల కేటాయింపులో కొన్ని నిర్దేశిత అర్హతలు సాధించాల్సి ఉంటుంది. దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీని నమోదు చేసుకోవచ్చు. కానీ వాటికి రాష్ట్ర పార్టీలుగా, జాతీయ పార్టీలుగా అర్హత పొందాలంటే మాత్రం కొన్ని కనీస అర్హతలు పొందాల్సి ఉంటుంది.

రాష్ట్ర పార్టీ గుర్తింపు ఇలా…

ఎన్నికల సంఘం నిబంధన 6A ప్రకారం రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఈ అర్హతలు పొందాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..

  • ఎన్నికల సంఘం 2017లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ కింది నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పాటించాలి.
  • రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో పోలైన వాటిలో చెల్లుబాటైన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించడంతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలు గెలవాలి.
  • ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో పోల్ అవ్వడంతో పాటు చెల్లుబాటైన ఓట్లలో ఆరు శాతం ఓట్లతోపాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి.
  • ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి.
  • ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి.
  • లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలైప ఓట్లలో, చెల్లిన ఓట్లలో 8% వచ్చి ఉండాలి.
  • 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఆరు శాతానికి పైగా ఓట్లు సాధించింది. కేవలం ఒకే ఒక్క స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ కేవలం రిజిస్టర్డ్‌ పార్టీగానే మిగిలిపోయింది.

మొదలైన హోం ఓటింగ్, ఎలక్ట్రానిక్ ఓటింగ్…

ఏపీలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ ప్రారంభమైంది. 85ఏళ్లు పైబడిన వృద్ధులు 40శాతానికి పైబడిన వైకల్యంలో ఉన్న దివ్యాంగులుకు ఇళ్ల వద్దే ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నారు. ఏపీలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులకు మొత్తం 7,28,484 మంది హోం ఓటింగ్ అర్హత కలిగి ఉన్నారు

వీరిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 2,11,257 మంది, 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు 5,17,227 మంది ఉన్నారు. వీరిలో కేవలం 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఎంచుకున్నారు. హోం ఓటింగ్ ను ఎంచుకున్న వారిలో 14,577 మంది 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 14,014 మంది 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు ఉన్నారు.

హోం ఓటింగ్ ను ఎంచుకున్న ఓటర్ల ఇంటి వద్దకే అధికారుల బృందాలు వెళ్లి బ్యాలెట్ పేపర్లను అందజేసి హోం ఓటింగ్ ప్రక్రియ చేపట్టాయి. గాజు గ్లాసు గుర్తు కేటాయింపు విషయంలో రాష్ట్ర హైకోర్టు విచారణతో ఓ రోజు ఆలస్యంగా బ్యాలెట్ ముద్రణ జరిగింది. బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి చేసుకున్న జిల్లాలలో గురువారం నుంచి హోం ఓటింగ్ ప్రారంభించారు. హోం ఓటింగ్ ప్రక్రియ మొత్తం ఈ నెల 8 కల్లా పూర్తవుతుంది.

చేతులు కాలాక ఆకులు పట్టుకుని….

గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో ఏపీలో 62 అసెంబ్లీ నియోజక వర్గాల్లో గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించనున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ అర్హతపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఓటింగ్ ప్రారంభం కావడంతో ఏమి చేయలేమని ఈసీ తేల్చి చెప్పింది. ఎలక్ట్రానిక్ బ్యాలెట్లు వెళ్లిపోయాయని, హోంఓటింగ్ ప్రారంభించినట్టు ఈసీ హైకోర్టుకు స్పష్టం చేసింది. కూటములకు కామన్‌ సింబల్ సౌలభ్యం ఎన్నికల వ్యవస్థలో లేదని పిటిషన్‌కు విచారణ అర్హతే లేదని తేల్చేసింది.

హైకోర్టులో టీడీపీ కోరుకున్న ఊరట రాకపోతే జనసేన గాజు గ్లాసు గుర్తు గందరగోళానికి కారణం అవ్వొచ్చు. టీడీపీ పోటీలో ఉన్న చోట గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు పడేఅవకాశం లేకపోలేదు. జనసేన పోటీలో ఉన్న పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ నియోజక వర్గాల్లోనే కేవలం కామన్‌ సింబల్ నిబంధన వర్తిస్తుంది. ఎన్నికల పొత్తులు, మ్యానిఫెస్టో రూపకల్పన పై పెట్టిన శ్రద్ధలో ఎన్నికల గుర్తుపై పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం