Ambati Rayudu: వైసీపీలో ఒక్కడే రాజు... అంతా బానిసలేనని విమర్శించిన అంబటిరాయుడు.. విశాఖలో ఎన్నికల ప్రచారం
Ambati Rayudu: వైసీపీతో ప్రజా సమస్యలు పరిష్కారం కావని, ఆ పార్టీలో ఒక్కడే రాజని, మిగిలిన వారంతా బానిసలేనని క్రికెటర్ అంబటి రాయుడు ఆరోపించారు. విశాఖలో కూటమి అభ్యర్థుల తరపున అంబటి రాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Ambati Rayudu: వైసీపీలో ఏడు నెలల పాటు రాష్ట్రం మొత్తం పర్యటించి ఎన్నో సమస్యలు చూశానని . అక్కడ ఒక్క సమస్యకు కూడా పరిష్కారం మార్గం కనబడ లేదని అంబటి రాయుడు ఆరోపించారు. వైసీపీలో బానిసత్వం తప్ప ఏమీ లేదని, . ఒక్కడే రాజు అతని కాలు కింద రాష్ట్రం మొత్తాన్ని పెట్టి బానిసత్వం చేయిస్తున్నాడన్నారు.
రాష్ట్రం వెనుకబాటు చూస్తే కడుపు తరుక్కుపోతోందని, పవన్ కళ్యాణ్ మాత్రమే మీ కోసం నిలబడతారని, రాష్ట్రాన్ని సరైన దారిలో ముందుకు తీసుకువెళ్తారన్నారు. మంచితనానికి, ప్రగతికి ఓటు వేయాలని, కూటమికి మద్దతు ఇస్తేనే రాష్ట్రం ప్రగతిబాట పడుతుందని విశాఖ ఎన్నికల ప్రచారంలో అంబటి రాయుడు చెప్పారు.
'తప్పుడు దారితో పయనిస్తున్న తనను సన్మార్గంలో నడిపిస్తున్నందుకు పవన్ కళ్యాణ్‌కు అంబటి రాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం మొత్తాన్ని ఆయన తప్పుదారి నుంచి మళ్ళిస్తున్నార'ని టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు స్పష్టం చేశారు. వైసీపీతో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదని, కూటమి ప్రభుత్వ స్థాపనతోనే రాష్ట్రం ప్రగతి బాట పడుతుందని అన్నారు. గురువారం రాత్రి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన వారాహి విజయభేరీ సభలో ప్రసంగించారు.
"రాష్ట్రంలో ఉన్న 50 శాతం యువతే రాష్ట్ర భవిష్యత్తు అని, కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. అంతా కలసి కట్టుగా వైసీపీ అరాచకాన్ని సమాప్తం చేయాలన్నారు. ఈ ఎన్నికలు మంచి అవకాశం అని, ఎన్నికలు చాలా కీలకమని కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే బీజేపీ మద్దతుతో విశాఖ లాంటి నగరాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఎన్నో పరిశ్రమలు వస్తాయని ఉపాధి అవకాశాలు వస్తాయని, అందరి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు.
టీడీపీ ఎంపీ అభ్యర్ధి భరత్ మాట్లాడుతూ.. "వైసీపీ పాలనలో రాష్ట్రం నష్టపోయిందని రూ. 13.5 లక్షల కోట్ల అప్పులు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు లేవని, యువతకు ఉద్యోగాలు లేవని. టీడీపీ ప్రభుత్వం తెచ్చిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ని పంపేశారని ఆరోపించారు. విశాఖలో గంజాయి పెరిగిపోయిందని క్రైమ్ రేట్ పెరిగిపోయిందని యువత భవిష్యత్తు నాశనం అవుతోందన్నారు. చెత్త పన్ను కడుతున్నా డ్రైనేజీ సమస్య తీర్చరని, ఆస్తి పన్ను కట్టించుకుంటారు వీధి లైట్లు కూడా వేయరని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ కష్టకాలంలో టీడీపీకి అండగా నిలవడమే కాకుండా రాష్ట్ర బాగు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి కట్టేలా కృషి చేశారని దుర్మార్గ పాలనను దించేందుకు మూడు పార్టీలు కలసి వచ్చామని చెప్పారు. కూటమి ప్రభుత్వం పదేళ్లు పాలిస్తే రాష్ట్రం ప్రగతి తిరిగి దారిన పడుతుందని అన్నారు.
జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు
‘‘జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకురావడం వెనుక పెద్ద దురుద్దేశం దాగుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఓ ప్రణాళిక ప్రకారం ప్రజల ఆస్తుల మీద కన్నేశారని జాగ్రత్తగా గమనిస్తే అర్ధం అవుతుందని, మొదట జగన్ మన సొంత ఆస్తులకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల మీద అతడి బొమ్మ వేసుకున్నాడని తర్వాత ప్రజల ఆస్తులకు సంబంధించిన సర్వే రాళ్ల మీద తన చిత్రాన్ని ముద్రించుకున్నాడన్నారు.
తర్వాత ప్రజల ఆస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలకు కేవలం జిరాక్స్ మాత్రమే ఇస్తామని, ఒరిజినల్స్ ప్రభుత్వం వద్ద ఉంటాయని చెబుతున్నాడు. ఈ ప్రణాళికలో భాగంగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తీసుకొచ్చి ప్రజల ఆస్తులన్ని కాజేసే కుట్రకు తెరలేపాడు. దీని వెనుక జగన్ భూ దాహం దాగుందన్నారు.
ఈ యాక్టు ప్రకారం మనకు అన్యాయం జరిగితే కోర్టులకు వెళ్లలేమని, హైకోర్టుకు వెళితే ఎన్ని రోజులు అక్కడ తిరగాలో తెలీదు. మన మొర వినే పోలీసులు జగన్ కిందనే పని చేస్తారు. ఇక చివరిగా రెవెన్యూ అధికారుల వద్ద ఆస్తులను సెటిల్ చేసుకునే పరిస్థితికి తీసుకొస్తారన్నారు. చట్టం ప్రజల సొంత ఆస్తులకు మెల్లగా నిప్పు పెడుతుందన్నారు.
ఇది అమలైతే మన ఆస్తులు మనవి అని చెప్పుకోవడానికి కూడా ఏమీ ఉండదు. నేను 2019లో హెచ్చరించినట్లుగానే మరోసారి జగన్ తీరుపైనా హెచ్చరిస్తున్నాను. ఈ చట్టం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. మన సొంత ఇంట్లోనే మనం కానివాళ్లం అయిపోతాం .. మన సొంత భూమే మనది కానిది అయిపోతుంది. దీనిపై ఆలోచించండి. ఇంతటి అరాచక పాలనకు తెరదించి, అంతా సిద్ధమై వైసీపీని బంగాళాఖాతంలో కలపాల్సిన సమయం వచ్చేసిందన్నారు.
సంబంధిత కథనం