తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Annabathuni Shiva Kumar : నా భార్య ముందే అసభ్యంగా దూషించాడు, ఓటర్ పై దాడి ఘటనపై అన్నాబత్తుని వివరణ

Annabathuni Shiva Kumar : నా భార్య ముందే అసభ్యంగా దూషించాడు, ఓటర్ పై దాడి ఘటనపై అన్నాబత్తుని వివరణ

13 May 2024, 14:29 IST

google News
    • Annabathuni Shiva Kumar : ఓటర్ పై దాడి ఘటనపై తెనాలి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ వివరణ ఇచ్చారు. మద్యం మత్తుల్లో తనను దుర్భాషలాడడని ఆరోపించారు. టీడీపీ, జనసేన ఎక్కడినుంచో మనుషులను దింపి వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తుందని ఆరోపించారు.
ఓటర్ పై దాడి ఘటనపై అన్నాబత్తుని వివరణ
ఓటర్ పై దాడి ఘటనపై అన్నాబత్తుని వివరణ

ఓటర్ పై దాడి ఘటనపై అన్నాబత్తుని వివరణ

Annabathuni Shiva Kumar : గుంటూరు జిల్లా తెనాలి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఓటర్ పై దాడికి చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ స్పందించారు. తెనాలి ఐతాన‌గ‌ర్‌లో తన భార్యతో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి వెళ్లామన్నారు. ఈ సమయంలో గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి...తనను దుర్భాషలాడడన్నారు. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వ‌ర్గాల‌కు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాక‌ర్ తనపై దుర్భాష‌లాడాడని అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌ ఆరోపించారు. వైసీపీపై చాలా ద్వేషంతో అతడు ర‌గిలిపోయాడన్నారు. చాలా శాడిజంగా మాట్లాడాడన్నారు.

మద్యం మత్తులో దుర్భాషలాడాడు

"నా భార్య ముందే న‌న్ను అస‌భ్యంగా దూషించాడు. బూత్‌లోకి వెళ్లేట‌ప్పుడు..వ‌చ్చేట‌ప్పుడూ దుర్భాష‌లాడుతూనే ఉన్నాడు. గొట్టిముక్కల సుధాక‌ర్ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ వ్యక్తి. నువ్వు అస‌లు క‌మ్మోడివేనా అంటూ అస‌భ్యంగా మాట్లాడాడు. పోలింగ్ బూత్ వ‌ద్ద మ‌ద్యం మ‌త్తులో అంద‌రి ముందు చాలా దురుసుగా ప్రవ‌ర్తించాడు. పోలింగ్ బూత్‌లో ఉద‌యం నుంచి అత‌డు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నట్లు అక్కడి ఓట‌ర్లే చెప్పారు. అత‌డు బెంగులూరులో ఉంటూ ఇక్కడ‌కు వ‌చ్చి హ‌డావుడి చేశాడు. టీడీపీ, జ‌న‌సేన వాళ్లు ఎక్కడెక్కడి నుంచో వాళ్ల మ‌నుషుల‌ను పిలిపించి వైసీపీ ఎమ్మెల్యేల‌పై దాడులు చేయిస్తున్నారు"- అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌

ఓటర్, వైసీపీ అభ్యర్థి పరస్పర చెంప దెబ్బలు

తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను ఓటరు చెంప చెళ్లుమనిపించాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడి చేశారు. విచక్షణారహితంగా చితకబాదారు. పోలింగ్ కేంద్రంలోకి తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఎమ్మెల్యే శివకుమార్‌ను ఓటర్లు అడ్డుకున్నారు. ఓ యువకుడు ఎమ్మెల్యే తీరును ప్రశ్నించడంతో ఆగ్రహించిన శివకుమార్‌ ఓటరును చెంప దెబ్బ కొట్టారు. దీంతో సదరు వ్యక్తి కూడా ఎదురు తిరిగి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మరోవైపు ఎమ్మెల్యే ఓటరుపై దాడి చేసిన ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయంలోని కంట్రోల్‌ రూమ్‌లో ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న ఎన్నికల పోలీస్‌ పరిశీలకుడు మిశ్రా గుర్తించారు. ఎమ్మెల్యే అభ్యర్థి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈసీ సీరియస్

ఈ ఘటనపై సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పందిస్తూ.. సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. పోలింగ్ కేంద్రం నుంచి లైవ్ వెబ్‌కాస్టింగ్ ఫుటేజీ తమ వద్ద ఉందన్నారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యేతో పాటు ఇతరులపై కేసు నమోదు చేయాలని గుంటూరు ఎస్పీను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. పోలీసులు తక్షణమే స్పందించి వీటిని నివారించారన్నారు. ఓటింగ్‌ను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పూర్తి చేస్తామని ఎంకే మీనా హామీ ఇచ్చారు. ఏపీలో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నామన్నారు.

తదుపరి వ్యాసం