తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Sit On Ap Poll Violence : ఏపీలో హింసాత్మక ఘటనలపై ‘సిట్‌’ ఏర్పాటు - 2 రోజుల్లో నివేదిక..!

SIT On AP Poll Violence : ఏపీలో హింసాత్మక ఘటనలపై ‘సిట్‌’ ఏర్పాటు - 2 రోజుల్లో నివేదిక..!

17 May 2024, 21:40 IST

google News
    • Poll Violence in Andhra Pradesh : ఎన్నికల వేళ ఏపీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ‘సిట్’ ఏర్పాటైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు చేసింది.
ఏపీలో హింసాత్మక ఘటనలు -సిట్ ఏర్పాటు
ఏపీలో హింసాత్మక ఘటనలు -సిట్ ఏర్పాటు

ఏపీలో హింసాత్మక ఘటనలు -సిట్ ఏర్పాటు

Poll Violence in Andhra Pradesh Updates : ఏపీలో ఎన్నికల తర్వాత హింసపై సీఈసీకి నివేదిక అందింది. ప్రాథమిక విచారణ పూర్తిచేసి సీఈఓ కార్యాలయం నివేదిక పంపింది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాలతో సిట్‌ కూడా ఏర్పాటైంది. ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో సిట్‌ పని చేయనుంది. ఇందులో మొత్తం13 మంది సభ్యులు ఉన్నారు.

సిట్‌ సభ్యులు వీరే….

ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ పి.శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, ఏసీబీ డీఎస్పీ రవి మనోహర, ఇన్‌స్పెక్టర్లు భూషణం, కె.వెంకట్‌రావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్‌, మోయిన్‌, ఎన్‌.ప్రభాకర్‌రావు, శివప్రసాద్‌ ‘సిట్’ లో సభ్యులుగా ఉన్నారు.

అధికారులపై వేటు….

AP Elections 2024 Updates: తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీలో పలువురు అధికారులు కూడా బదిలీ అయ్యారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ను ఈసీ బదిలీ చేసింది. ఇదే సమయంలో పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేయగా…శాఖపరమైన విచారణ జరపాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

పల్నాడు,అనంతపురం, తిరుపతి జిల్లాల పరిధిలోని మరో 12 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించింది. మరో 25 సీఆర్పీఎఫ్ కంపెనీ బలగాలను ఏపీలో మోహరించాలని ఈసీ నిర్ణయించింది. రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. సిట్‌ ఏర్పాటు చేసి రెండ్రోజుల్లో నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది.

ఫలితాల విడుదల వేళ ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ దిశానిర్దేశం చేసింది. హింసాత్మక ఘటనల్లో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ ఆదేశించింది.

కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఇచ్చిన ఆదేశాలతో… సిట్ ఏర్పాటైంది. పోలింగ్ వేళ ఏపీలో చోటు చేసుకున్న ఘటనలపై విచారించనుంది. ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించనుంది. వీటి ఆధారంగా నివేదికను సిద్ధం చేసి సీఈసీకి పంపనుంది.

పోలింగ్ అనంతరం ఏపీలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. ఏపీలో కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీలను సీఈసీ ఆదేశించింది. 

ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లు ఈసీ అభిప్రాయపడింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఈసీ దిల్లీకి పిలిచింది.ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన సీఎస్, డీజీపీ….ఈసీ అధికారులతో సమావేశమయ్యారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఘర్షణలు తగ్గలేదు. పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో హింస చెలరేగింది. టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. పలు జిల్లాల్లో అల్లర్లు, ఘర్షణలు కొనసాగుతున్నాయి. అయితే దాడులను నివారించడంపై పోలీసులు యంత్రాంగం విఫలమైందని టీడీపీ, వైసీపీ ఆరోపణలు చేస్తున్నాయి.

 

తదుపరి వ్యాసం