NDA Alliance : ఏపీలో పొత్తులపై తేల్చేసిన బీజేపీ- ఎన్డీఏలో టీడీపీ, జనసేన చేరిక స్వాగతిస్తున్నామని ప్రకటన
09 March 2024, 19:46 IST
- NDA Alliance : ఏపీలో పొత్తులపై బీజేపీ అధికారిక ప్రకటన జారీ చేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం ఉమ్మడి ప్రకటన జారీ చేసింది.
ఏపీలో పొత్తులపై తేల్చేసిన బీజేపీ
NDA Alliance : టీడీపీ, జనసేన, బీజేపీ(TDP Janasena BJP Alliance) పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చింది. బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉమ్మడి ప్రకటన విడుదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మూడ్రోజుల పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిల్లీలో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఎట్టకేలకు పొత్తుపై బీజేపీ ప్రకటన చేసింది. ఎన్డీఏ కుటుంబంలో టీడీపీ, జనసేన చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
బీజేపీ అధికారిక ప్రకటన
డైనమిక్ లీడర్, ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని బీజేపీ, టీడీపీ, జనసేన... దేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాయన్నారు. మూడు పార్టీలు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయన్నారు. గత పదేళ్లుగా ప్రధాని మోదీ దేశాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీడీపీ, జనసేన.. అందుకు సాయపడతాయన్నారు.
బీజేపీ, టీడీపీ(TDP) గతంలో కూడా సంబంధాలు కలిగి ఉన్నాయని జేపీ నడ్డా అన్నారు. టీడీపీ 1996లో ఎన్డీఏ(NDA) కూటమిలో చేరిందని గుర్తుచేశారు. అటల్ బిహారి వాజ్ పేయ్, నరేంద్ర మోదీ ప్రభుత్వాల్లో భాగస్వామిగా పనిచేసిందన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన... టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు తెలిపిందన్నారు. సీట్ల సర్దుబాటుపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ పొత్తును ఏపీ ప్రజలు స్వాగతిస్తారని, వారి ఆకాంక్షలను నెరవేర్చుందుకు ఈ కూటమి సాయపడుతుందన్నారు.
చంద్రబాబు, పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా-జేపీ నడ్డా
ఎన్డీఏలో చేరాలన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి దేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయన్నారు.
ఏపీకి ఇది కీలక మలుపు -నారా లోకేశ్
బీజేపీ, జనసేన, టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి వృద్ధి పథంలోకి తీసుకురావడానికి బలగాలను కలుపుతున్నాయని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గత ఐదేళ్లలో చరిత్రలో చీకటి దశను ఎదుర్కొన్న ఏపీకి ఇది ఒక ముఖ్యమైన క్షణం అన్నారు. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజల జీవితాలను సానుకూలంగా మార్చిన ఒక ముఖ్యమైన మలుపుగా చరిత్రలో నిలిచిపోతుందని లోకేశ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.