BJP Janasena Seats : బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి- 8 లోక్ సభ, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ?-delhi news in telugu bjp janasena seat sharing final for 2024 elections 8 mps 30 mla constituencies ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bjp Janasena Seats : బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి- 8 లోక్ సభ, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ?

BJP Janasena Seats : బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి- 8 లోక్ సభ, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ?

Bandaru Satyaprasad HT Telugu
Mar 09, 2024 02:04 PM IST

BJP Janasena Seats : వచ్చే ఎన్నికల్లో 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, జనసేన కూటమి పోటీ చేయనుందని సమాచారం. 6 చోట్ల బీజేపీ, 2 స్థానాల్లో జనసేన లోక్ సభ బరిలో నిలిచే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ కాకినాడ లోక్ సభ స్థానానికి పోటీ చేయనున్నారు.

బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి
బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి

BJP Janasena Seats : దిల్లీ కేంద్రంగా ఏపీ పొత్తుల వ్యవహారం జోరుగా సాగుతోంది. దిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తో మరోసారి భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో సుమారు 50 నిమిషాల పాటు సీట్లు సర్దుబాటుపై చర్చించారు. సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి రాగానే పొత్తు ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే జనసేన(Janasena) ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండడంతో... టీడీపీని ఎన్డీఏ(NDA) కూటమిలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

రెండు లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ

వచ్చే అసెంబ్లీ(AP Assembly Elections), లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) 8 పార్లమెంటు స్థానాలు, 30 అసెంబ్లీ నియోజక వర్గాల్లో జనసేన, బీజేపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాకినాడ (Kakinada)లోక్‌సభ స్థానం నుంచి పవన్ కల్యాణ్ బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే 8 నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపిక కూడా కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, విశాఖ విష్ణు కుమార్ రాజు లేదా పీవీ మాధవ్, శ్రీకాళహస్తి నుంచి కోలా అనంత్, ధర్మవరం నుంచి వరదాపురం సూరి పోటీ చేయనున్నారని సమాచారం. దీంతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపురం లేదా తిరుపతి స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. జనసేన మచిలీపట్నం, కాకినాడ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది

6 లోక్ సభ స్థానాల్లో బీజేపీ పోటీ

అనకాపల్లి నుంచి సీఎం రమేష్‌ , రాజమండ్రి నుంచి పురందేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, అరకు లేదా రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ‌ కుమార్‌ రెడ్డి లోక్ సభకు పోటీ చేయనున్నారు. హిందూపురం, తిరుపతిలో ఏదొక స్థానం నుంచి బీజేపీ(BJP) అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది. కాకినాడ, మచిలీపట్నంలలో జనసేన పోటీ చేయనుంది. ఆరు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారని సమాచారం.

సీట్ల సర్దుబాటు ఇలా?

ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అయితే పొత్తుల్లో భాగంగా ఇప్పటికే టీడీపీ, జనసేన పోటీపై ప్రకటించాయి. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుందని పవన్ ప్రకటించారు. అయితే లోక్ సభ స్థానాలపై బీజేపీ దృష్టి పెట్టింది. బీజేపీ ఎక్కువ సీట్లు అడగడంతో చర్చలు సుధీర్ఘంగా కొనసాగుతున్నాయి. బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. మిగిలిన 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అయితే 25 లోక్ సభ స్థానాల్లో 8 సీట్లను బీజేపీ, జనసేనలకు కేటాయించేందుక టీడీపీ ప్రాథమికంగా అంగీకరించిందని తెలుస్తోంది. 8 సీట్లలో బీజేపీ 6 స్థానాల్లో, 2 చోట్ల జనసేన బరిలో దిగే అవకాశం ఉంది. 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, 6 చోట్ల బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ లోక్ సభ సీట్లపై మాత్రమే దృష్టి సారించిందని సమాచారం. ఈ సీట్ల సర్దుబాటుపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం