TDP JSP BJP Alliance: కొలిక్కిరాని సీట్ల లెక్క, ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్ - ఇవాళ ప్రకటనకు ఛాన్స్..!
TDP JSP BJP Alliance Updates: టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయంగానే కనిపిస్తోంది. ఇంకా ఢిల్లీలోనే ఉన్న చంద్రబాబు, పవన్… బీజేపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. ఇవాళ పొత్తుతో పాటు సీట్ల పంపకాలపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
TDP JSP BJP Alliance Updates: ఎన్నికల వేళ ఏపీలో మరోసారి పొత్తు పొడవనుంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అధికారికంగా పొత్తు కుదరగా… ఇదే కూటమిలో బీజేపీ కూడా చేరనుంది. ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలతో చర్చలు కూడా జరిపింది బీజేపీ అధినాయకత్వం. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)…. ఆ పార్టీ ముఖ్యులతో భేటీ అవుతున్నారు. గురువారం అమిత్ షా, జేపీ నడ్డాను కలిసి పొత్తులపై చర్చ జరిపారు. సీట్ల విషయంలోనే లెక్కలు తేలాల్సి ఉందని తెలుస్తోంది. ఈ విషయంలోనే శుక్రవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నప్పటికీ… అమిత్ షా, నడ్డా బిజీ షెడ్యూల్ కారణంగా సమావేశం జరగలేదని సమాచారం.
ఇవాళ ప్రకటనకు ఛాన్స్….!
శుక్రవారం భేటీ కాకపోవటంతో ఇవాళ బీజేపీ పెద్దలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సీట్ల లెక్కలపై తుది చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు పార్టీల పొత్తుపై ఇప్పటివరకు చర్చలు మాత్రమే జరగుతుండగా… అధికారికంగా ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇవాళ జరిగే చర్చల తర్వాత… అధికారికంగా కీలక ప్రకటనకు ఛాన్స్ ఉందని టీడీపీ, జనసేన వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు మార్చి 10వ తేదీన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ నేపథ్యంలో ఈ లోపే పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2014లో బీజేపీ-టీడీపీ(TDP) మాత్రమే పోటీలో ఉంది. జనసేన వారికి మద్ధతు ఇచ్చింది. ఆ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. దీంతో సీట్ల విషయంలో టీడీపీ రాజీ పడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మూడు పార్టీలు కలిసే పోటీ చేయాలనే విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు(Loksabha Elections 2024) కూడా జరుగనున్న నేపథ్యంలో తమకు వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలు కేటాయించాలని బీజేపీ పెద్దలు కోరుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి, జమ్ముల మడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ(నార్త్), ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలను బీజేపీ కోరినట్టు తెలుస్తోంది. దీంతో పాటు బిజేపి 5 లోక్ సభ స్థానాలను అడుగుతోంది. తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థుల్ని పోటీ చేయించాలని భావిస్తోంది. జనసేన ఇప్పటికే మూడు లోకసభ స్థానాలలో పోటీకి పొత్తు కుదిరింది. మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడలో జనసేన పోటీ చేయనుంది.
బీజేపీ ఆశిస్తున్నన్ని స్థానాలు కాకుండా 4 లోక్‌సభ, 6 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని చంద్రబాబు వివరించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గెలవలేని సీట్లలో పోటీ చేయడం వల్ల అక్కడ వైసీపీకి ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు వివరించే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే ఇవాళ జరిగే చర్చల అనంతరం… పోటీ చేసే సీట్ల విషయంలో ఓ అంచనాకు రావొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత అధికారికంగా ప్రకటన ఉండనుంది.