తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ec Final Order: మేలో నిధులు విడుదల చేసిన చరిత్ర ఏపీలో లేదు, పోలింగ్ ముందు డిబిటి కుదరదని తేల్చిన ఈసీ

EC Final Order: మేలో నిధులు విడుదల చేసిన చరిత్ర ఏపీలో లేదు, పోలింగ్ ముందు డిబిటి కుదరదని తేల్చిన ఈసీ

Sarath chandra.B HT Telugu

10 May 2024, 19:32 IST

    • EC Final Order: ఏపీలో పోలింగ్‌ ముగిసే వరకు ఎట్టి పరిస్థితుల్లో డిబిటి పథకాలకు నగదు బదిలీ చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గురు, శుక్రవారాల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైకోర్టు విచారణ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు వెలువరించింది.
మే 13వరకు డిబిటి కుదరదని తేల్చిన కేంద్ర ఎన్నికల సంఘం
మే 13వరకు డిబిటి కుదరదని తేల్చిన కేంద్ర ఎన్నికల సంఘం (HT_PRINT)

మే 13వరకు డిబిటి కుదరదని తేల్చిన కేంద్ర ఎన్నికల సంఘం

EC Final Order: ఏపీలో మునుపెన్నడూ మే నెలలో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేసిన చరిత్ర లేదని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఏపీ ఖజానాలో సరిపడా నిధులు ఉన్నా జనవరి నుంచి మార్చి వరకు లబ్దిదారులకు నిధులు విడుదల చేయలేదని ఈసీ అభిప్రాయపడింది.  సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై గురువారం హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha elections : 'అబ్​ కీ బార్​ 400 పార్​'- బిహార్​ డిసైడ్​ చేస్తుంది..!

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

శుక్రవారం ఉదయం హైకోర్టు తీర్పు నేపథ్యంలో నగదు బదిలీ పథకాలకు నిధుల విడుదలపై ఈసీ అనుమతి కోరుతూ సిఎస్‌ లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం పలు అంశాలపై వివరణ కోరుతూ మధ్యాహ్నం 3గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈసీకి వివరణ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం డిబిటి పథకాలను నిధులను విడుదల చేసిన తేదీలు, అవి లబ్దిదారుల ఖాతాలకు జమైన తేదీలను అందించాలని ఈసీ కోరడంతో ఆ వివరాలను ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలను పరిశీలించిన ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

డబ్బులున్నా చెల్లించలేదు…

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఖజానా పరిస్థితి 2024 జనవరి - మార్చి మధ్య కాలంలో నగదు బదిలీ పథకాలకు చెల్లింపులకు అనుకూలంగానే ఉందని గుర్తించారు. వివిధ పథకాలకు నగదును చెల్లించే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నా , వాస్తవ వ్యవధి కంటే ఎక్కువ కాలం పాటు సాగదీసినట్టు ఈసీ అ‎భిప్రాయపడింది. నిధులు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్దిదారులకు బదిలీ చేయడంలో జాప్యం జరిగినట్టు ఈసీ అభిప్రాయపడింది.

మరోవైపు గతంలో డిబిటి పథకాలకు నిధులు విడుదల చేసిన తేదీలను పరిశీలిస్తే 2024 మే నెలలో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉన్నట్టు కనిపించడం లేదని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ఆధారంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీకి ముందు మే 10వ తేదీలోపు నిధులు విడుదల చేయాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది.

మే 9వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లోనే మే13వ తేదీ తర్వాత లబ్దిదారులకు నగదు బదిలీ విషయంలో ఈసీ ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తదని స్పష్టం చేసినట్టు గుర్తు చేశారు. ఈసీ మే 3,9 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులను 10వ తేదీ వరకు అబయన్స్‌లో పెడుతూ సింగల్ జడ్జి తీర్పునిచ్చారు.

దీనిపై ఎన్నికల సంఘం డివిజన్‌ బెంచ్‌లో హైకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేసిందని గుర్తు చేశారు. హైకోర్టు డివిజన్ బెంచ్‌ ఈసీ విజ్ఞప్తిని నమోదు చేసిందని, మే 13వ తేదీ తర్వాత నిధుల విడుదల విషయంలో ఈసీఐ ఎలాంటి అభ్యంతరాలు చెపక్పదని ఎన్నికల సంఘం జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

హైకోర్టులో సుదీర్ఘ వాదనలు…

మరోవైపు ఏపీలో లబ్దిదారులకు నిధుల విడుదల చేయాలని హైకోర్టు సింగల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులపై నవతరం పార్టీ తరపున ఏపీ హైకోర్టులో డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై  చీఫ్‌ జస్టిస్ బెంచ్ విచారణ జరిపింది. నగదు బదిలీ పథకాలపై సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‍పై విచారణలో ఎన్నికల సమయంలో నిధుల విడుదల నిబంధనలకు విరుద్దమని  పిటిషనర్ న్యాయవాది వాదించారు.

ఇప్పటికే అమలులో ఉన్న స్కీమ్స్‌కు కూడా నిధుల విడుదల జరగకూడదని పిటిషనర్‌ న్యాయవాది వాదించారు.  ఈసీ కూడా ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక జమ చేయాలని చెప్పిందని పిటిషనర్ వివరించారు.  పింఛన్లు ప్రతి నెలా ఇస్తున్నారుని హైకోర్టు ప్రశ్నించడంతో  పింఛన్లు వేరు, పథకాలు వేరని పిటిషనర్ న్యాయవాది వివరించారు. ఎన్నికల సమయంలో నిధులు విడుదల  చేయడం ఓటర్లను ప్రలోభ పెట్టడమేనని వాదించారు. 

సింగల్ బెంచ్‌ ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తీరును హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు కన్నా ఎక్కువ అని ఈసీ భావిస్తున్నట్టుందని,  ఎన్నికల నిర్వహణలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రమాణాలు ఎందుకని ప్రశ్నించారు.  నిధుల విడుదలకు హైకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత ఈసీ ఏ అధికారంతో ప్రభుత్వాన్ని వివరణ కోరిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. రిట్ అప్పీల్ చేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏ విధంగా పక్కన పెట్టిందని ప్రశ్నించారు. 

కోర్టు విచారణ సమయం ముగిసిపోవడంతో  డిబిటి పథకాలపై డివిజన్ బెంచ్‍లో అప్పీల్‍పై విచారణను వేసవి సెలవుల అనంతరం వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై  ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొన్నారు.  సింగిల్ జడ్జి ఉత్తర్వులకు ఇచ్చిన సమయం అయిపోయిందని, సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం ఈనెల 11, 12, 13 తేదీల్లో నిధుల విడుదల చేయవద్దని ఆదేశాలున్నాయని గుర్తు చేశారు. 

నిధుల విడుదలపై  రోజంతా ఉత్కంఠ…

డిబిటి పథకాలకు నగదు విడుదలపై గురువారం రాత్రి ఏపీ హైకోర్టు సింగల్ బెంచ్‌ తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ  ఖజానా నుంచి లబ్దిదారులకు  నిధుల విడుదలకు ప్రయత్నాలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు రూ.10వేల కోట్లను లబ్దిదారులకు చెల్లించేందుకు రెడీ అయ్యారు.  అయితే ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌కు మాత్రమే అమోదం ఉండటంతో  పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసే విషయంలో ఆర్థిక శాఖ అధికారులు వెనుకంజ వేసినట్టు చెబుతున్నారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సొంత నిర్ణయాలు తీసుకుంటే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని అధికారులు భయపడినట్టు సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. సిఎఫ్ఎంఎస్‌ నుంచి ఆసరా, చేయూత, విద్యాదీవెన వంటి పథకాల లబ్దిదారులకు నిధుల్ని ఒక్క బటన్‌ క్లిక్‌తో  బదిలీ చేసే అవకాశం ఉన్నా ఆర్ధిక శాఖ అధికారులు సాహసించలేకపోయారు. బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడం, బిఆర్వోలు లేకపోవడంతో నిధుల విడుదల విషయంలో మల్లగుల్లాలు పడ్డారు.

దీంతో ప్రభుత్వం ఎన్నికల సంఘం నుంచి స్పష్టత కోరింది.హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి ఈసీ అనుమతిస్తే క్షణాల్లో నగదు బదిలీ అయిపోయేలా  ఏర్పాట్లు చేశారు. సిఎఫ్‌ఎంఎస్‌ నుంచి లబ్దిదారుల ఖాతాలకు నగదు చేరే క్రమంలో ఆర్‌బిఐ “ఈ -కుబేర్‌కు”   నిధులు బదిలీ అయినా ఈసీ నుంచి స్పష్టత రాకపోవడంతో హోల్డ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.  ఈసీ అనుమతి కోరుతూ సిఎస్‌ లేఖ రాసిన తర్వాత ఈసీ పలు ప్రశ్నలు లేవనెత్తుతూ వాటికి సమాధానాలు ఇవ్వాలని కోరడంతో పరిస్థితి తారుమారైనట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. 

డిబిటి నిధుల బదిలీ విషయంలో ఈసీ వైఖరి స్పష్టం కావడంతో   ప్రభుత్వం వెనకడుగు వేసింది. చివరకు సిఎస్‌ ఇచ్చిన వివరణ, హైకోర్టులో జరిగిన వాదనల ఆధారంగా నిధుల విడుదల కుదరదని ఈసీ తేల్చింది.  మరోవైపు ఏపీ ప్రభుత్వం వద్ద ప్రస్తుతం రూ.10వేల కోట్లు  ఖజానాలో ఉన్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత వీటిని లబ్దిదారులకు చెల్లిస్తారా, ఇతర అవసరాలకు మళ్లిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. మే 13 తర్వాత డిబిటి చెల్లింపులకు ఈసీ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులో ఉన్న డబ్బు ఏమి చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

తదుపరి వ్యాసం